వచ్చే ఏడాది IPLలో రెండు కొత్త జట్లు జత అవుతాయని ఇప్పటికే తెలిసిందే. ఈ విషయాన్ని తాజాగా BCCI ఒక కొత్త జట్టు కోసం బిడ్ ఆహ్వానిస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపింది.
IPLలో రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం మంగళవారం టెండర్లు ఆహ్వానించింది బీసీసీఐ. IPL - 2022 సీజన్‌లో పాల్గొనబోయే రెండు కొత్త టీమ్స్‌లో ఒక దాని కోసం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ బిడ్లను ఆహ్వానించిందని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టెండర్ డాక్యుమెంట్లు అక్టోబర్ 5 వరకూ అమ్మకానికి ఉండనున్నట్లు చెప్పింది. ఈ ఇన్విటేషన్ టు టెండర్ డాక్యుమెంట్‌ను రూ.10 లక్షలుగా నిర్ణయించింది. ఈ రూ. 10లక్షల మొత్తం నాన్ రిఫండబుల్. ఈ డాక్యుమెంట్‌లోనే సవివరంగా నియమ, నిబంధనలు, అర్హత, బిడ్ల దాఖలు ప్రక్రియ, కొత్త టీమ్స్ హక్కుల వివరాలన్నీ ఉంటాయని బీసీసీఐ చెప్పింది.
బిడ్ దాఖలు చేయాలనుకుంటున్న వాళ్లు ఈ ఇన్విటేషన్ టు టెండర్‌ను మొదట కొనుగోలు చేయాలి. అయితే అందులోని అర్హత ప్రమాణాలు అందుకున్న వారికే బిడ్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. దీనిని కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ బిడ్లు దాఖలు చేయాలన్న నియమం లేదని BCCI తెలిపింది. కొన్ని నెలలుగా కొత్త టీమ్స్ గురించి చర్చలు నడుస్తున్నాయి. ఈ రెండు టీమ్స్‌లో ఒకటి అహ్మదాబాద్ నుంచి వస్తోందని సమాచారం. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అయిన మొతెరా హోమ్ గ్రౌండ్‌గా ఈ కొత్త అహ్మదాబాద్ జట్టు ఉండొచ్చు.
Also Read: Dale Steyn Retirement: క్రికెట్ కు స్టెయిన్ గుడ్ బై.. అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటన
ఒక్కో జట్టుకి కనీస ధరను రూ.2 వేల కోట్లుగా నిర్ణయించగా.. ఈ రెండు టీమ్స్ ద్వారా బీసీసీఐ ఖాతాలో మరో రూ.5 వేల కోట్లు చేరనున్నట్లు అంచనా. వచ్చే ఏడాది నుంచి మొత్తం 10 జట్లతో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.