IPL 2022 Schedule: ముంబై, పుణేల్లో జరగనున్న ఐపీఎల్ 2022 షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 65 రోజుల్లో 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్ గేమ్స్ జరగనున్నాయి. మార్చి 26వ తేదీన వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది.
మార్చి 27వ తేదీన టోర్నీలో మొదటి డబుల్ హెడర్ జరగనుంది. ఆరోజు సాయంత్రం మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. రాత్రి జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. మార్చి 29వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్ తన మొదటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.
వాంఖడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంల్లో చెరో 20 మ్యాచ్లు జరగనున్నాయి. ఇక బ్రబౌర్న్, పుణేలోని ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలు చెరో 15 మ్యాచ్‌లకు వేదికలుగా నిలవనున్నాయి. టోర్నమెంట్‌లో మొత్తంగా 12 డబుల్ హెడ్డర్‌లు జరగనున్నాయి.
ఐపీఎల్ ఫైనల్ మే 29వ తేదీ జరగనుంది. ఈ మ్యాచ్‌కు, ప్లే ఆఫ్స్‌కు ఇంకా వేదికలు ఖరారు కాలేదు. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చాక వాటికి సంబంధించిన షెడ్యూలును కూడా ప్రకటిస్తారు.