అంతర్జాతీయ టీ20 క్రికెట్లో బంగ్లాదేశ్ మరోసారి చరిత్ర సృష్టించింది. కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ని కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ తాజాగా న్యూజిలాండ్ పై కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను దక్కించుకుంది. ఢాకా వేదికగా బుధవారం జరిగిన నాలుగో టీ20లో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ గెలుపొందడం బంగ్లాదేశ్‌కి ఇదే మొదటిసారి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. బంగ్లా బౌలర్లు నసుమ్ అహ్మద్(4/10), ముస్తాఫిజుర్(4/12) ధాటికి 19.3 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. విల్ యంగ్(48 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ లాథమ్(26 బంతుల్లో 21; ఫోర్) రెండంకెల స్కోర్ చేయడంతో కివీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లా సైతం ఆరంభంలో తడబడింది.
అయినప్పటికీ పుంజుకుని విజయం సాధించింది. కెప్టెన్ మహ్మదుల్లా(48 బంతుల్లో 43 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) చివరి దాకా క్రీజ్‌లో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికి ఓపెనర్ మహ్మద్ నయిమ్(35 బంతుల్లో 29; ఫోర్, సిక్స్) సహకారం అందించడంతో బంగ్లా జట్టు 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కివీస్ బౌలర్లలో ఎజాజ్ పటేల్ 2, కోల్ మెక్ కొన్చి ఓ వికెట్ పడగొట్టారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించన నసుమ్ అహ్మద్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో బంగ్లా గెలుపొందగా.. మూడో టీ20ని న్యూజిలాండ్ నెగ్గింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన చివరి మ్యాచ్ శుక్రవారం(సెప్టెంబర్ 10) ఇదే వేదికగా జరుగనుంది.