Australian Open 2023:  ఆస్ట్రేలియా ఓపెన్‌లో  తెలుగమ్మాయి పీవీ సింధు పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో  ఆకర్షి కశ్యప్‌ను ఓడించిన సింధు క్వార్టర్స్‌లో 12-21, 17-21 తేడాతో  యూఎస్ఎకు చెందిన వరల్డ్ నెంబర్ 12వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ చేతిలో ఓడింది. శుక్రవారం ముగిసిన  పురుషుల సింగిల్స్‌లో తెలుగు ఆటగాడు కిదాంబి శ్రీకాంత్  కూడా మరో భారత ఆటగాడు ప్రియాన్షు రజావత్ చేతిలో ఓడాడు. రజావత్ సెమీస్‌లో భారత్ స్టార్ షట్లర్  హెచ్ఎస్ ప్రణయ్‌ను ఢీకొననున్నాడు. 


శుక్రవారం సిడ్నీ వేదికగా జరిగిన మహిళల  సింగిల్స్ క్వార్టర్స్‌లో సింధు మరోసారి నిరాశపరిచింది. గత నాలుగు మేజర్ టోర్నీలలో క్వార్టర్స్‌కే పరిమితమైన సింధు.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో కూడా దానినే కొనసాగించింది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ (బర్మింగ్‌హామ్)  తర్వాత  ఆరు నెలలు రెస్ట్ తీసుకుని  ఈ ఏడిది జనవరి నుంచి బరిలోకి దిగుతున్న సింధు.. తన వైఫల్య ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.  బీవెన్ జాంగ్‌తో 39 నిమిషాలలో ముగిసిన  క్వార్టర్స్ పోరులో రెండు రౌండ్లలోనూ సింధు  ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే ఓడింది. 


 


శ్రీకాంత్‌కు షాక్.. 


21 ఏండ్ల ప్రియాన్షు రజావత్.. 30 ఏండ్ల సీనియర్ భారత షట్లర్  కిదాంబి శ్రీకాంత్‌ను ఓడించి సెమీస్‌కు చేరాడు. రజావత్..  21-13, 21-8 తేడాతో శ్రీకాంత్‌ను చిత్తుగా ఓడించాడు. తొలి రౌండ్‌లో కాస్త  పోటీనిచ్చిన శ్రీకాంత్ రెండో రౌండ్‌లో పూర్తిగా డీలాపడిపోయాడు. కాగా రజావత్‌కు ఇది తొలి  సూపర్ 500 టోర్నీ సెమీఫైనల్.  సెమీస్ పోరులో అతడు  భారత్‌కే చెందిన  హెచ్ఎస్ ప్రణయ్‌తో తలపడనున్నాడు. వీరిలో ఎవరు గెలిచినా  భారత్‌కు మెడల్ అయితే  గ్యారెంటీ. 


 










గింటింగ్‌ను ఓడించి సెమీస్‌కు.. 


ఆరో సీడ్ హెచ్ఎస్ ప్రణయ్.. క్వార్టర్స్‌లో టాప్ సీడ్ అంథోని గింటింగ్‌తో తలపడ్డాడు.   ఈ పోరులో ప్రణయ్.. 16-21, 21-17, 21-14 తేడాతో విజయం సాధించాడు.  తొలి సెట్ ఓడిపోయినా  ప్రణయ్.. రెండో సెట్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రణయ్‌కు ఈ ఏడాది ఇది  సూపర్ - 500 టోర్నీలలో మూడో సెమీస్ కావడం విశేషం. 


 






ముగ్గురూ  గోపీచంద్ శిష్యులే.. 


సెమీస్‌కు అర్హత సాధించిన  ప్రియాన్షు రజావత్, హెచ్ఎస్ ప్రణయ్‌‌తో పాటు క్వార్టర్స్‌లో ఓడిన  కిదాంబి శ్రీకాంత్ మధ్య ఓ  కామన్ పాయింట్ ఉంది. ఈ ముగ్గురూ పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందినవారే కావడం గమనార్హం. 


 







ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial