Australian Open Badminton Final:  భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్‌కు  భారీ షాక్.  సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ - 500  టోర్నీలో 9వ సీడ్ ప్రణయ్‌పై.. 9-21, 21-23, 20-22 తేడాతో చైనాకు చెందిన అన్‌సీడెడ్   హాంగ్ యాంగ్ వెంగ్ అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఇరువురి మధ్య హోరాహోరిగా 90 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో  తొలి సెట్ ఓడిన  ప్రణయ్.. తర్వాత సెట్ కోలుకున్నా   మూడో సెట్‌లో  హాంగ్ యాంగ్ పుంజుకుని  ట్రోఫీ నెగ్గాడు. ప్రణయ్  రన్నరప్‌గా నిలిచాడు. 


తొలి  సెట్‌లో అనవసర తప్పిదాలు చేసిన  ప్రణయ్ భారీ మూల్యాన్ని చెల్లించుకోకతప్పలేదు.  అయితే రెండో సెట్‌లో మాత్రం  ఇరువురూ కొదమసింహాల్లా పోరాడినా  రెండు పాయింట్ల తేడాతో ప్రణయ్ ముందంజలో నిలిచాడు. మూడో సెట్ కూడా హోరాహోరిగానే సాగింది.  ఇరువురూ పోటీ పడి  పాయింట్లు సాధించడంతో   పోరు నువ్వా నేనా అన్నట్టుగా సాగింది.   చివరికి  హాంగ్ యాంగ్‌నే విజయం వరించింది.  


ఈ ఏడాదిలో రెండోసారి..  


బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్  సూపర్ 500 టోర్నీలలో  ఫైనల్‌కు చేరడం ఈ ఇద్దరికీ ఇది రెండోసారి.   2023 మార్చిలో  మలేషియా ఓపెన్ ఫైనల్ కూడా ఈ ఇద్దరి మధ్యే జరిగింది.   మలేషియా ఓపెన్స్‌లో ప్రణయ్.. హాంగ్ యంగ్‌ను ఓడించగా  తాజాగా  ఆస్ట్రేలియా ఓపెన్‌లో అతడు ఓటమిపాలయ్యాడు. దీంతో హాంగ్ యాంగ్ బదులు తీర్చుకున్నట్టైంది.  ఒక ఏడాదిలో వరుసగా రెండుసార్లు బీడబ్ల్యూఎప్ 500 టోర్నీ ఫైనల్స్ ఆడటం  9 ఏండ్ల తర్వాత ప్రణయ్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం.  చివరిసారిగా అతడు 2014లో  ఒకే ఏడాది వియత్నాం, ఇండోనేషియా మాస్టర్స్‌లో ఆడాడు. 


 






ప్రణయ్ ప్రయాణం సాగిందిలా.. 


ఆస్ట్రేలియా ఓపెన్‌లో ప్రణయ్..  లీ చెక్ యూ, చి యూ జెన్ లను ఓడించి  క్వార్టర్స్‌కు చేరాడు.  క్వార్టర్ ఫైనల్‌లో  టాప్ సీడ్ అంథోని గింటింగ్‌ను ఓడించి సెమీస్‌కు ప్రవేశించాడు. సెమీఫైనల్‌లో భారత్‌కే చెందిన  ప్రియాన్షు రజావత్‌ను ఓడించి  ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు. 


 






హాంగ్ యాంగ్ ఇలా.. 


చైనా  యువకెరటం హాంగ్ యాంగ్  తొలి రౌండ్‌లో కొడై నరోకాను ఓడించాడు. క్వార్టర్స్‌లో  చో టిన్ చెన్‌ను ఓడించి సెమీఫైనల్ చేరిన  అతడు.. సెమీస్‌లో మలేషియాకు చెందిన  లీ జీ జియాను ఓడించి ఫైనల్ చేరాడు. ఫైనల్లో ప్రణయ్‌కు షాకిచ్చాడు. 





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial