టర్కీలోని ఇస్తాంబుల్‌లో మాస్టర్స్ 3 విభాగంలో (60-69 ఏళ్ల వయసు) జరుగుతున్న ఆసియా క్లాసిక్ ఎక్విప్డ్ పవర్‌లిఫ్టింగ్ మరియు బెంచ్ ప్రెస్ ఛాంపియన్‌షిప్‌లో 165 కిలోల బరువు ఎత్తి భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది లోరైన్ మోర్ 66 ఏళ్ల వయసు మహిళ. పుణేకు చెందిన ఈమె వయసు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపించింది. 


60 ఏళ్ల తర్వాత వచ్చే ఎముకల సమస్యలను దూరంగా ఉంచడం ఎలా అనే లక్ష్యంతో పవర్‌లిఫ్టింగ్ ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. లోరైన్ మోర్.. తన ఇంటి వద్ద చిన్న చిన్న రెండు కిలోల డంబెల్స్‌ని ఎత్తడం ద్వారా ప్రారంభించిన ప్రయాణం, ఇప్పుడు 165 కిలోల బరువును సులభంగా ఎత్తి బంగారు పతాకాన్ని సాధించింది.


'50 ఏళ్ల తర్వాత మహిళలు హెవీ వెయిట్‌లు ఎత్తలేరనేది అపోహ. మహిళలకు అన్నీ సాధ్యమే మరియు 60 ఏళ్ల తర్వాత కూడా వారి శరీరానికి ఫిట్‌గా మరియు దృఢంగా ఉండే శక్తి ఉంది. మహిళలందరికీ వారి సామర్థ్యం ఏమిటో చూపించాలనుకుంటున్నాను.' క్లాసిక్ పవర్ లిఫ్టర్ మోర్ చెప్పింది.


మోర్ మూడు విభాగాల్లో వ్యక్తిగత బంగారు పతకాలను గెలుచుకుంది. 'నేను శిక్షణ ప్రారంభించినప్పుడు, నేను పోటీలో పాల్గొనాలని ఎప్పుడూ అనుకోలేదు, ఓంకార్ చించోల్కర్ వద్ద శిక్షణ పొందుతున్న నా కొడుకు రోహన్, వారితో పాటు నేను కూడా శిక్షణ ప్రారంభించాను.' అని చెబుతోంది మోర్.


ఎనిమిది నెలల్లో ఆమె బరువును ఎత్తే సామర్థ్యాన్ని మేం చూశాం.. ఆమెను పవర్ లిఫ్టింగ్ పోటీకి తీసుకెళ్లాలని అనుకున్నామని.. ఓంఫిట్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ సొల్యూషన్ యజమాని ఓంకార్ చించోల్కర్ వివరించారు. ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ఎనిమిది బంగారు పతకాలు సాధించింది మోర్‌. 


'మొదట జిల్లా ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నప్పుడు, నేను స్వర్ణం సాధించాను. ఇది నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది ఆ తర్వాత నా ప్రదర్శనను మెరుగుపరుచుకున్నాను. ఓంకార్‌తో పాటు, సీనియర్ కోచ్ గిరీష్ బింజ్వే నుంచి శిక్షణ తీసుకున్నాను. ఈ రోజు నేను సాధించిన దానికి ఇద్దరూ కారణం' అని మోర్ చెబుతోంది.   ఈ టోర్నమెంట్‌ను అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ సమాఖ్య, ఆసియా పవర్‌లిఫ్టింగ్ సమాఖ్య నిర్వహిస్తోంది.


Also Read: Ashes Series 2021-22: యాషెస్ సిరిస్ కు ఆరు వికెట్ల దూరంలో కంగారూలు.. కష్టాల్లో ఇంగ్లీష్ జట్టు


Also Read: IND Vs SA: వానా వానా వచ్చిపోయే.. టెస్టు మ్యాచు ఆగిపోయే!