ఆసియా పారా గేమ్స్‌లో తొలి స్వర్ణ పతకాన్ని సాధించి భారత క్రీడా చరిత్రలో ప్రాచీ యాదవ్ తన పేరును నిలబెట్టుకుంది. భారత్ దేశపు విజయ పతాకాన్ని మరోసారి రెపరెపలాడించింది. పారా కానోయింగ్ మహిళల KL2 ఫైనల్‌లో స్వర్ణ పతకం సాధించడం ద్వారా ఆమె అద్భుతమైన ప్రదర్శన యావత్ దేశం గర్వించేలా చేసిందని ప్రధాని మోదీ స్వయంగా ట్వీట్ చేశారు.
మహిళల VL2 ఫైనల్లో 1వ రోజు రజతం సాధించిన తర్వాత, ఆమె మహిళల KL2 ఈవెంట్లో 54.962 సెకన్ల టైమింగ్ తో అగ్రస్థానంలో నిలిచారు. చైనాకు చెందిన షన్హాన్ వాంగ్ 55.674 సెకన్లతో రజత పతకాన్ని చేజిక్కించుకున్నారు . ఇరాన్ కు చెందిన రోయా సోల్తానీ 56.714 సెకన్లతో కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 1వ రోజున, ప్రాచీ ఉజ్బెకిస్తాన్కు చెందిన ఇరోదాఖోన్ రుస్తమోవాకు 1.022 సెకన్ల తేడాతో ఉన్నారు. ప్రాచీ 1:03.47 సెకన్లతో రజత పతకాన్ని ఖాయం చేసుకోగా, ఇరోదాఖోన్ 1:02. 125 సెకన్లతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక జపాన్ క్రీడాకారిణి సాకి కొమట్సు 1:11.635 సెకన్లతో కాంస్య పతకంతో నిష్క్రమించింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ప్రాచీకి అభినందనలు తెలిపారు. సంకల్ప శక్తికి పరిమితులు లేవని ఆమె గెలుపు నిరూపించిందని అన్నారు. అలాగే క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ భారత్‌కు చెందిన నారీ శక్తి ఈ క్రీడల్లో దేశానికి తొలి పతకం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఆమె నిబద్ధత, అవిశ్రాంత అంకితభావం, విశేషమైన నిలకడను ప్రశంసిస్తూ, యావత్ దేశం మరోసారి గర్విస్తున్నదని ట్వీట్ చేశారు.
ఆసియా క్రీడలు ముగిసిన రెండు వారాల తర్వాత హాంగ్‌జౌలో మళ్లీ ఆటల సందడి మొదలైంది. ఈసారి పారా ఆసియా క్రీడలు ప్రారంభం అయ్యాయి. ఆదివారంనాడు హాంగ్‌జౌ ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ స్టేడియంలో ఈ క్రీడల ఆరంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చైనా ఉపాధ్యక్షుడు డింగ్ గ్జూజియాంగ్ క్రీడలు మొదలైనట్లు ప్రకటించారు. ఈ క్రీడలలో మన దేశం తరఫున 313 అథ్లెట్లు బరిలో ఉన్నారు.
మధ్యప్రదేశ్ గ్వాలియార్కు చెందిన ప్రాచీ ఆసియా పారాకానో ఛాంపియన్‌షిప్ 2023లో రెండు స్వర్ణాలు మరియు ఒక రజతం గెలుచుకున్నారు.అలాగే ఆమె 2022లో జరిగిన ICF కానో స్ప్రింట్ మరియు పారాకానో ప్రపంచ కప్‌లో కాంస్యాన్ని కూడా గెలుచుకుంది. 2019లో ఢిల్లీలో జరిగిన పారా కానో ఛాంపియన్‌షిప్‌లో ప్రాచీ తన మొదటి బంగారు పతకం పొందారు. తరువాత మే 2019లో పోలాండ్‌లోని పోజ్నాన్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో మొదటి అంతర్జాతీయ కార్యక్రంలో పాల్గొని 8 వ స్థానంలో నిలిచారు. జపాన్‌లోని టోక్యోలో జరిగిన 2020 పారాలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించిన మొట్టమొదటి భారతీయ పారాకానో అథ్లెట్ కూడా ప్రాచీ. ఆమే భర్త మనీష్ కౌరవ్, పురుషుల KL3 కానోలో 44.605 సెకన్ల సమయాన్ని నమోదు చేసి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు. మనీష్ కౌరవ్ ఇప్పటికే రెండుసార్లు ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో బంగారు పతక విజేత మరియు జాతీయ స్థాయిలో అనేక ప్రశంసలు పొందారు. కాంటినెంటల్ గేమ్స్‌లో మనీష్ కౌరవ్‌కు ఇదే తొలి పతకం.
అసలు పారా ఆసియా గేమ్స్‌లో భారత్ ఈసారి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. రెండు ఈవెంట్స్‌లో అన్ని పతకాలను సాధించిన భారత్.. ఘనమైన ఓపెనింగ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల హైజంప్ టీ63, పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లలో భారతదేశం మొత్తం అన్ని పతకాలను కైవసం చేసుకుంది. పురుషుల హైజంప్ టీ63 ఈవెంట్‌లో శైలేష్ కుమార్, బ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లో ప్రణవ్ సూర్మ గోల్డ్ మెడల్స్ సాధించారు. పతకాల పట్టికలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ 2 వ స్థానంలో ఉంది.