Asian Games Controversy:
ఆసియా క్రీడల్లో భారత్‌కు అన్యాయం జరుగుతోందా? టీమ్‌ఇండియా అథ్లెట్లను టార్గెట్ చేశారా? ఉద్దేశపూర్వకంగా చైనా అధికారులు కుట్రలు చేస్తున్నారా? నీరజ్ చోప్రా, జీనా, జ్యోతి, అన్ను రాణి నష్టపోయారా? చూస్తుంటే ఔననే అనిపిస్తోంది.
జావెలిన్ త్రోలో ఆటగాళ్లకు ఆరుసార్లు అవకాశాలు ఇస్తారు. అందులోనే అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. కానీ బుధవారం గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఏడుసార్లు ఈటెను విసిరాడు. మరో ఆటగాడు జీనా విసిరిన త్రోను ఉద్దేశపూర్వకంగా ఫౌల్ ఇచ్చారు. మహిళల జావెలిన్ త్రోలో అన్నురాణి, హర్డిల్స్‌లో జ్యోతికీ ఇలాగే జరిగింది.
సాధారణంగా జావెలిన్ త్రోలో క్రీడాకారులు మొదటిసారే ఎక్కువ దూరం విసిరేందుకు ప్రయత్నిస్తారు. తాజాగా ఉండటం, అలసట లేకపోవడమే ఇందుకు కారణం. టీమ్‌ఇండియా గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఇందుకు మినహాయింపేమీ కాదు. బుధవారం అతడు మొదటిసారి విసిరినప్పుడు ఈటె 85 మీటర్ల మార్క్ దాటింది. స్టేడియంలో అభిమానులు దాదాపుగా 90 మీటర్లు విసిరాడనే భావించారు. కానీ అధికారులు ఆ గుర్తును కొలవడంతో నిర్లక్ష్యం వహించారు. దాంతో అతడు టెక్నికల్ కమిటీ దగ్గరికి వెళ్లి 12-15 నిమిషాలు గడపాల్సి వచ్చింది. ఈ విషయం తేలకుండానే తర్వాతి ఆటగాడు ఈటెను విసరడంతో నీరజ్ గుర్తు చెరిగిపోయింది.
ఏమీ చేయలేని పరిస్థితి రావడంతో నీరజ్ మరోసారి మొదటి త్రో విసిరాల్సి వచ్చింది. అందులో 82.38 మీటర్లే నమోదైంది. ఏదేమైనా నాలుగో దఫాలో అతడు 88.88 మీటర్లు విసిరి స్వర్ణం దక్కించుకున్నాడు.
'ఏ పోటీలైనా సాధారణంగా ఆరుసార్లే ఈటెను విసురుతారు. ఈరోజు నేను ఏడుసార్లు విసరాల్సి వచ్చింది. నేనిలాంటిది ఎప్పుడూ చూడలేదు. ఏదో తప్పు జరిగింది. వాళ్లు నేనెంత దూరం విసిరానో కొలవలేదు. తర్వాత ఆటగాడు వచ్చేసరికి నా గుర్తు తొలగిపోయింది. మొదటిసారి నేను ఈటెను బలంగా విసిరాననే అనిపించింది. అదెంత దూరం వెళ్లిందో వీడియె పుటేజీ చూస్తాను. ఇలాంటి అనుభవాలు మరికొందరు అథ్లెట్లకు ఎదరుయ్యాయి. ఇది సరికాదు. వీటిని చర్చించడంలో అర్థం లేదు. నేను అందరు అథ్లెట్లను గౌరవిస్తాను' అని నీరజ్ అన్నాడు.
తన రెండో త్రోను అధికారులు ఫౌల్‌గా గుర్తించారని జీనా సైతం అన్నాడు. ఇలాంటిది గతంలో చూడలేదని వాపోయాడు. 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో జ్యోతి యెర్రాజీకీ ఇలాగే జరిగింది. ఆమె బ్లాక్స్‌ను దాటకముందే ఫాల్స్ స్టార్ట్ పేరుతో ఫౌల్ ఇచ్చారు. ఈ సంఘటనలపై భారత అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలు అంజు బాబీ జార్జి మాట్లాడారు. ఆసియా క్రీడల అధికారులు భారతీయులను మోసం చేస్తున్నారని, లక్ష్యంగా ఎంచుకున్నారని విమర్శించారు. మంగళవారం అన్ను రాణి విసిరిన మొదటి త్రోను ఇలాగే గుర్తించలేదని తెలిపారు.