ఆసియా క్రీడల్లో భారత షట్లర్లు నయా చరిత్ర లిఖిస్తున్నారు. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో 41 ఏళ్ల తర్వాత హెచ్‌ఎస్ ప్రణయ్ తొలి కాంస్య పతకం నెగ్గి రికార్డుల్లోకి ఎక్కితే.. ఇప్పుడు తాజాగా డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట ఫైనల్‌కు దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో భారత జోడీ స్వర్ణానికి అడుగు దూరంలో నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న సాత్విక్-చిరాగ్ జంట శుక్రవారం సెమీఫైనల్లో 21-17, 21-12తో ఆరోన్ చీ-సోహ్ యీక్ (మలేషియా) పై ఘనవిజయం సాధించింది.
46 నిమిషాల్లో ముగిసిన పోరులో భారత ద్వయం.. వరుస గేమ్‌ల్లో విజృంభించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని సాత్విక్-చిరాగ్.. మన దేశం నుంచి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి జోడీగా రికార్డుల్లోకెక్కారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న సాత్విక్-చిరాగ్.. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణం నెగ్గిన విషయం తెలిసిందే. శనివారం జరుగనున్న తుదిపోరులో కొరియా జంటతో మనవాళ్లు అమీతుమీ తేల్చుకోనున్నారు.
తొలి గేమ్ ఆరంభంలో మలేషియా ప్లేయర్ల నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురైంది. దీంతో ఒక దశలో తొలి గేమ్ 10-10తో సమం కాగా.. ఆ సమయంలో తెలుగబ్బాయి సాత్విక్ సూపర్ స్మాష్‌తో లీడ్ అందించాడు. ఇక అక్కడి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోని మన జంట.. వరుసగా ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకుని 16-10తో విజయానికి చేరువైంది. ఈదశలో మలేషియా ప్లేయర్లు కాస్త ప్రతిఘటన కనబర్చగా.. కీలక సమయాల్లో పాయింట్లు ఖాతాలో వేసుకున్న భారత్.. తొలి గేమ్ సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్ ఆరంభంలోనే మన వాళ్లు దుమ్మురేపడంతో.. విరామ సమయానికి భారత్ 11-3తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ఇక ఆ తర్వాత కూడా అదే ఆధిపత్యం కొనసాగిస్తూ.. గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
19వ ఆసియా క్రీడల్లో వంద పతకాలు సాధించాలని కేంద్ర క్రీడాశాఖ లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే మనవాళ్లు ఆ టార్గెట్‌కు చేరువయ్యారు. కబడ్డీ, హాకీ, బ్యాడ్మింటన్, క్రికెట్ వంటి పలు క్రీడల్లో ఇంకా పతకాలు రావాల్సి ఉండటంతో ఈసారి మనవాళ్లు అత్యుత్తమ ప్రదర్శనతో స్వదేశానికి తిరిగి రానున్నారు. శుక్రవారం పోటీలు ముగిసే సమయానికి భారత్ 22 స్వర్ణాలు, 34 రజతాలు, 39 కాంస్యాలతో మొత్తం 95 పతకాలు ఖాతాలో వేసుకొని పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
భారత హాకీ జట్టుకు స్వర్ణం- పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారు
భారత పురుషుల హాకీ జట్టు పసిడి పతకం కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 5-1తేడాతో డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌ను మట్టికరిపించి తొమ్మిదేళ్ల తర్వాత ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం ముద్దాడింది. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు రక్షణాత్మకంగా ఆడటంతో తొలి క్వార్టర్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే పదే పదే ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులకు దిగిన భారత్.. జపాన్‌పై ఒత్తిడి కొనసాగించింది.