Asian Games 2023:  నాలుగేండ్లకోసారి జరిగే ఆసియా క్రీడలు (ఏసియన్ గేమ్స్) మరో  ఐదు రోజుల్లో మొదలుకానున్నాయి.  చైనాలోని హాంగ్జౌ వేదికగా 19వ ఆసియా క్రీడలు  ఈనెల 23 నుంచి  ఆరంభమవుతాయి. అక్టోబర్ 08 వరకూ పదిహనురోజుల పాటు సాగే ఈ మెగా ఈవెంట్‌లో తలపడేందుకు 45 దేశాల ఆటగాళ్లు ఇదివరకే  హాంగ్జౌ లోని  ‘స్పోర్ట్స్ విలేజ్’కు చేరుకున్నారు. ఆసియా క్రీడల షెడ్యూల్, ఆటగాళ్లు, లైవ్, ఇతరత్రా వివరాలు ఇక్కడ చూద్దాం. 


2018లో జకర్తాలో ముగిసిన ఆసియా గేమ్స్ తర్వాత 2022లోనే చైనాలో ఇవి జరగాల్సి ఉండగా  కోవిడ్ కారణంగా అప్పుడు వాయిదాపడ్డాయి. పారిస్ ఒలింపిక్స్ ముందు  జరుగుతున్న అతిపెద్ద క్రీడా ఈవెంట్ కూడా ఇదే. సుమారు 5,050 మంది పాల్గొంటున్న  ఈ క్రీడలలో  దాదాపు 40 క్రీడాంశాలు (61 విభాగాలు) న్నాయి.  హాంగ్జౌతో పాటు మరో  ఐదు నగరాలలోని  56 వేదికలలో ఈ క్రీడలు జరుగనున్నాయి.  అధికారికంగా  ఏసియన్ గేమ్స్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నా   క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, బీచ్‌బాల్ వంటి పోటీలు  ఈనెల 19 (మంగళవారం) నుంచే మొదలుకానున్నాయి.


భారీ బృందంతో భారత్.. 


ఈ మెగా ఈవెంట్‌లో అత్యధిక పతకాలను కొల్లగొట్టేందుకు గాను భారత్  భారీ బృందంతో బరిలోకి దిగుతోంది.  దాదాపు 40 క్రీడాంశాలలో  భారత్ నుంచి 655 మంది సభ్యులతో కూడిన క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. భారత్ నుంచి  క్రికెట్ (పురుషులు, స్త్రీలు) జట్లకు ఇవే తొలి ఆసియా క్రీడలు.  మహిళల క్రికెట్‌లో భారత్ ఈనెల 21న పురుషుల క్రికెట్‌లో 25న తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. 


భారత్ పోటీపడే  క్రీడాంశాలు : ఆర్చరీ, ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్ (మూడు విభాగాలు), బేస్ బాల్, బాక్సింగ్, బ్రేకింగ్, బీచ్ వాలీబాల్, బ్రిడ్జ్, క్రికెట్, చెస్, కనోయ్ స్లలోమ్, కనోయ్ స్ప్రింట్, సైక్లింగ్ (నాలుగు విభాగాలు), డైవింగ్,  డ్రాగన్ బోట్, ఈక్వెస్ట్రియన్, ఈ స్పోర్ట్స్, ఫుట్‌బాల్, ఫెన్షింగ్, గోల్ఫ్, హాకీ, హ్యాండ్‌బాల్, జూడో, జు జిట్సు, కబాడీ, కరాటే, కురాశ్, మారథాన్ స్విమ్మింగ్, మోడ్రన్ పెనథ్లాన్, రిథమిక్ జిమ్నాస్టిక్స్, రగ్బీ సెవెన్స్, రోయింగ్ , రోలర్ స్కేటింగ్, సెయిలింగ్, సెపక్‌తక్రా, షూటింగ్,  స్కేట్ బోర్డింగ్, స్క్వాష్, సాఫ్ట్ టెన్నిస్, సాఫ్ట్ బాల్,  స్విమ్మింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, తైక్వాండో, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, ట్రంపోలిన్ జిమ్నాస్టిక్స్, ట్రయత్లాన్, వాలీబాల్, వాటర్ పోలో, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, వీకీ, వుషు, జియంగి


 






ట్రాక్ అండ్ అథ్లెటిక్స్‌లో  68 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. భారత్ కచ్చితంగా జావెలిన్ త్రో తో పాటు  బాక్సింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, హాకీ, ఆర్చరీ వంటి ఈవెంట్లలో భారత్ కచ్చితంగా పతకాలు సాధించే అవకాశముంది.    


2018లో జకర్తా వేదికగా ముగిసిన 18వ ఆసియా క్రీడలలో భారత్ 570 మంది అథ్లెట్లను పంపగా  70 పతకాలు సాధింది. ఇందులో 16 గోల్డ్ మెడల్స్, 23 రజతాలు, 31 కాంస్యాలు నెగ్గింది.  ఈ ఏడాది కూడా భారత్ పతకాల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తోంది.    


 






లైవ్ చూడటమిలా.. 


- భారత్‌లో ఆసియా క్రీడలను లైవ్ ప్రసారాలను సోనీ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో వీక్షించొచ్చు. యాప్‌లో అయితే ఇవే ప్రసారాలు సోనీ లివ్ ‌లో ప్రసారమవుతాయి.  








ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial