ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు పసిడి పతకం కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 5-1తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌ను మట్టికరిపించి తొమ్మిదేళ్ల తర్వాత ఏషియన్‌ గేమ్స్‌లో స్వర్ణం ముద్దాడింది. టోర్నీ ఆరంభం నుంచి అప్రతిహాతంగా దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా.. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (32వ, 59వ నిమిషాల్లో) డబుల్‌ గోల్స్‌తో విజృంభించగా.. అమిత్‌ రొహిదాస్‌ (36వ నిమిషంలో), మన్‌ప్రీత్‌ సింగ్‌ (25వ నిమిషంలో), అభిషేక్‌ (48వ నిమిషంలో) తలా ఒక గోల్‌ చేశారు. జపాన్‌ తరఫున సరెన్‌ టనాక (51వ నిమిషంలో) ఏకైక గోల్‌ చేశాడు. 


 ఈ టోర్నీలో అత్యధికంగా 13 గోల్స్‌తో దుమ్మురేపిన భారత సారథి హర్మన్‌ప్రీత్‌.. తుదిపోరు చివరి నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి చరిత్రకెక్కాడు. మరో స్ట్రయికర్‌ మన్‌దీప్‌ సింగ్‌ ఈ టోర్నీలో 12 గోల్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు. టోర్నీ మొత్తంలో ఒటమి అన్నది ఎరగకుండా దూసుకెళ్లిన టీమ్‌ఇండియా.. ఫైనల్లోనూ జపాన్‌ను మట్టికరిపించింది. గ్రూప్‌ స్థాయిలో టీమ్‌ఇండియాతో జరిగిన పోరులో చక్కటి పోటీనిచ్చిన జపాన్‌.. తుదిపోరులో సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేయలేకపోయింది. మ్యాచ్‌ ఆరంభంలో ఇరు జట్లు రక్షణాత్మకంగా ఆడటంతో తొలి క్వార్టర్‌లో ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. అయితే పదే పదే ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులకు దిగిన భారత్‌.. జపాన్‌పై ఒత్తిడి కొనసాగించింది. 


రెండో క్వార్టర్‌లో మన్‌ప్రీత్‌ సింగ్‌ భారత్‌ ఖాతా తెరువగా.. హాఫ్‌ టైమ్‌ అనంతరం మనవాళ్లు మరింత రెచ్చిపోయారు. కెప్టెన్‌ హర్మన్‌ 32వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా.. మరో నాలుగు నిమిషాల వ్యవధిలో అమిత్‌ రొహిదాస్‌ బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. చివరి క్వార్టర్‌లో అభిషేక్‌ గోల్‌తో భారత్‌ 4-0తో స్పష్టమైన ఆధిక్యం సాధించగా.. మరో పది నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా.. జపాన్‌ తొలి గోల్‌ చేసింది. అయినా ఏమాత్రం ఇబ్బంది పడని భారత ఆటగాళ్లు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.. మరో గోల్‌ చేసి మ్యాచ్‌ను ముగించారు. 


ఈ ఫలితంతో భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో నాలుగో స్వర్ణం కైవసం చేసుకోవడంతో పాటు.. వచ్చే ఏడాది పారిస్‌ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న టీమ్‌ఇండియా పారస్‌లోనూ ఇదే జోరు కనబర్చి హకీకి పూర్వ వైభవం తీసుకురావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకప్పుడు ఒలింపిక్స్‌ హాకీలో మకుటం లేని మహరాజులా వెలుగొందిన భారత్‌.. ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ కాంస్యం గెలిచి ఆటకు మరోసారి జవసత్వాలు నింపింది. ఇప్పుడు దాన్నే కొనసాగిస్తూ.. ఆసియా క్రీడల్లో విజేతగా నిలిచింది. 


 2014లో ఇంచియాన్‌ వేదికగా జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ దక్కించుకున్న టీమ్‌ఇండియా.. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత హాంగ్జౌలో హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని భారత జట్టు విజయనాథం చేస్తూ గోల్డ్‌ మెడల్‌ కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా ఆసియా క్రీడల్లో భారత్‌కిది నాలుగో స్వర్ణం.


4-ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణ పతకం. గతంలో టీమ్‌ఇండియా 1966, 1998, 2014లో పసిడి చేజిక్కించుకుంది.