ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో పసిడి పడింది. ఇరాన్‌తో జరిగిన ఫైనల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు బంగారు పతకాన్ని కొల్లగొట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇరాన్‌ను భారత్ మట్టికరిపించింది. ఆట ఆరంభంలో దూకుడుగా ఆడిన ఇరాన్ ఆధిక్యంలోకి వెళ్లి భారత్‌కు షాక్ ఇచ్చింది. పూర్తి హైడ్రామా మధ్య జరిగిన మ్యాచ్‌లో 33-29 తేడాతో భారత్ విజయదుందుభి మోగించింది. చివరి రైడ్‌లో భారత కెప్టెన్ నవీన్ తెచ్చిన మూడు పాయింట్ల కోసం చాలా సేపు మ్యాచ్ ఆగిపోయింది. చాలా సేపటి తర్జనభర్జన తర్వాత మ్యాచ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు రిఫరీలు ప్రకటించారు. తర్వాత ఆ మూడు పాయింట్లను భారత్‌కు కేటాయించండతో భారత్‌కు పసిడి దక్కింది.
ఇరాన్ స్ట్రైకర్ మహ్మద్రెజా షాడ్‌లౌయ్ చియానెహ్ భారత రక్షణ శ్రేణిని ఛేదించి ఒకేసారి మూడు పాయింట్లు సాధించడంతో ఇరాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సూపర్ రైడ్‌తో 6-10తో ఇరాన్ ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత వేగంగా పుంజుకున్న భారత్ ఫస్టాఫ్ ముగిసే సమయానికి 17-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత కూడా ఆధిక్యాన్ని కొనసాగించిన భారత కబడ్డీ జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
ఇరాన్ కూడా భారత్‌కు గట్టిపోటి ఇచ్చింది. భారత్ పతకం సాధించిన ప్రతీసారి ఇరాన్ రైడర్లు పాయింట్లు సాధించారు. చివరి పట్టు విడవకుండా ఇరాన్ రైడర్లు పోరాడారు. కానీ పటిష్టమైన భారత్ డిఫెన్స్ ముందు వారి ఆటలు సాగలేదు. ఇరు జట్లు హోరాహోరీగా తలపడడంతో ప్రతి పాయింట్‌కు ఉత్కంఠ పెరుగుతూ వచ్చింది. కానీ అనుభవాన్నంత రంగరించిన భారత్ 29-27 తేడాతో ఇరాన్‌ను ఓడించి పసిడిని ఒడిసిపట్టింది. మ్యాచ్ గెలిచిన అనంతరం కబడ్డీ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. జాతీయ పతాకాన్ని చేతబూని ఆటగాళ్లు సందడి చేశారు. ప్రపంచ కబడ్డీలో తమకు ఎదురులేదని ఈ విజయంతో భారత కబడ్డీ జట్టు మరోసారి నిరూపించుకుంది.
ఈ ఆసియా గేమ్స్‌లో భారత జట్టు సాధికార విజయాలతో స్వర్ణం ముద్దాడింది. పైనల్లో ఇరాన్ చేతిలో ప్రతిఘటన ఎదురైనా భారత్ పట్టు విడవలేదు. సెమీస్‌లో భారత్.. పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. ఏకంగా 61-14 స్కోర్ తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుచేసి భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది.
భారత మహిళల జట్టు కబడ్డీలో స్వర్ణ పతకం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చైనీస్ తైపీ జట్టును 26-25తో భారత్ ఓడించి బంగారు పతకం కైవసం చేసుకుంది.
ఈ ఆసియా గేమ్స్‌లో భారత్ శత పతకాల లక్ష్యం నెరవేరింది. ఆసియా గేమ్స్‌లో వంద పతకాలు సాధించాలన్న సంకల్పం సిద్ధించింది. ఆటగాళ్ల అసాధారణ ప్రదర్శనతో భారత బృందం గతంలో ఎన్నడూలేనన్ని పతకాలను కైవసం చేసుకుని.. చైనా గడ్డపై విజయ గర్జన చేసింది. జ్యోతి సురేఖ మూడు స్వర్ణాలతో అదిరిపోయే ప్రదర్శన చేయగా లాంగ్ డిస్టాన్స్ రన్నింగ్‌లో అవినాశ్ ముకుంద్ సాబలే, హర్మిలన్ రెండేసి పతకాలు సాధించి సత్తా చాటారు. హాకీ, కబడ్డీ జట్లు స్వర్ణ పతకాలతో భారత కీర్తిని నలుదిశలా వ్యాపించాయి. 25 స్వర్ణాలు , 35 రజత పతకాలు, 40 కాంస్య పతకాలతో ఆసియా క్రీడల్లో భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 100కు చేరింది. కబడ్డీలో మహిళల జట్టు పసిడి పతకం సాధించడంతో భారత్ 100 పతకాల మైలురాయిని చేరుకుంది. ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు సత్తా చాటింది. ఫైనల్లో జపాన్‌పై విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత, హాంగ్‌జౌలో సంచలన ప్రదర్శనతో హాకీ జట్టు భారత కీర్తి పతాకాన్ని ఎగరేసింది.