Kohli On Suryakumar Yadav: హాంకాంగ్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్‌పై విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రశంసలు కురిపించాడు. అతడి ఫైర్ పవర్‌తో తన బ్యాటింగ్ కొట్టుకుపోయిందని వెల్లడించాడు. కఠినమైన పిచ్‌పై వచ్చీరాగానే అతడు మూమెంటమ్ మార్చేశాడని పేర్కొన్నాడు. బీసీసీఐ ఇంటర్వ్యూలో కోహ్లీ, సూర్య మాట్లాడారు.
ఆసియాకప్ రెండో మ్యాచులో విరాట్ కోహ్లీ, సూర్య (Surya Kumar Yadav) అజేయ హాఫ్ సెంచరీలు అందుకున్నారు. ఇద్దరు ఆడిన తీరు మాత్రం పూర్తిగా భిన్నం! స్కూప్స్, ఫ్లిక్స్, స్వీప్ షాట్లతో చెలరేగిన సూర్య 22 బంతుల్లోనే అర్ధశతకం సాధిస్తే విరాట్ 44 బంతుల్లో 59తో నిలిచాడు. వీరిద్దరూ 42 బంతుల్లో 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆఖరి 5 ఓవర్లలో భారత్‌కు 78 పరుగులు వచ్చాయి. దాంతో టీమ్‌ఇండియా 192/2తో నిలిచింది.
'సూర్యకుమార్ యాదవ్ తిరుగులేని ఇన్నింగ్స్ ఆడాడు. అవతలి ఎండ్‌లో నిల్చొని అతడి బ్యాటింగ్‌ను ఎంతగానో ఆస్వాదించాను. ఐపీఎల్‌లో అతనాడిన ఇన్నింగ్సులు ఎన్నో చూశాను. కాకపోతే అప్పుడు నేను వేరే జట్టులో ఉండేవాడిని. ఇంత దగ్గరగా చూడటం మాత్రం ఇదే తొలిసారి. అతడి బ్యాటింగ్ సుడిగాలిలో నేను కొట్టుకుపోయాను. సూర్య ఇలాగే ఆడితే ప్రపంచంలోని ఏ జట్టు మ్యాచ్ స్వరూపమైనా ఇట్టే మారిపోతుంది' అని విరాట్ అన్నాడు.
ఆరు వారాల తర్వాత బ్యాటు అందుకోవడంతో మైండ్ చాలా ఫ్రెష్ ఉందని కోహ్లీ చెప్పాడు. పాకిస్థాన్ మ్యాచులో బ్యాటింగ్ ఎంజాయ్ చేశానని పేర్కొన్నాడు. హాంకాంగ్ పైనా అలాగే చేశానని వెల్లడించాడు. నిలకడగా ఆడాలని సూర్యకు సూచించానన్నాడు. అయితే తొలి బంతి నుంచే అతడు బాదుడు షురూ చేయడంతో తన పాత్ర మార్చుకున్నానని వెల్లడించాడు. ఒకవేళ అతడు పరుగులు చేయకపోయినా తాను, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, జడ్డూ ఉన్నారని వివరించాడు.
మైదానంలోని వచ్చే ముందు తానూ, రిషభ్ పంత్ చర్చించుకున్నామని సూర్యకుమార్ తెలిపాడు. పిచ్ మరీ స్లోగా ఉండటంతో మ్యాచును ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందో మాట్లాడకున్నామని పేర్కొన్నాడు. 'బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు నేను నాలాగే ఉండాలనుకున్నా. చేసే పనిని ప్రేమిస్తాను. నేను ఎదుర్కొనే తొలి 10 బంతుల్లో కనీసం 3-4 బౌండరీలు బాదాలని ప్లాన్ వేసుకున్నా. వర్కౌట్ అవ్వడంతో అదే కొనసాగించా' అని సూర్య వెల్లడించాడు.
'ఏదేమైనా కోహ్లీ క్రీజులో ఉండాలని కోరుకున్నా. ఒక ఎండ్‌లో ఉండి బ్యాటింగ్ చేయాలని సూచించా. అప్పుడే పరుగులు చేయడం సులువుగా ఉంటుంది. విరాట్ 30-35 బంతులు ఆడాక తర్వాతి 10 బంతులకు స్ట్రైక్‌రేట్ 200-250 ఉంటుంది. అందుకే అతడు ఉండాలని కోరుకున్నా. 20వ ఓవర్లో స్వేచ్ఛగా షాట్లు ఆడాను' అని సూర్య తెలిపాడు.