Virat kohli Mentally Down, Asia Cup 2022: కెరీర్లో తొలిసారి నెల రోజులు బ్యాటు ముట్టుకోలేదని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. నాలుగైదేళ్లుగా ఎడతెరపి లేకుండా క్రికెట్ ఆడటంతో మానసికంగా అలసిపోయానని పేర్కొన్నాడు. బలహీనంగా ఉన్నామని అంగీకరించడంతో పోలిస్తే బలంగా ఉన్నామని మోసగించుకోవడం మరింత దారుణమని వెల్లడించాడు. రాబోయే రెండు నెలల్లో తమ జట్టు రెండు కీలక టోర్నీలు ఆడనుందని వివరించారు. అభిమానులు తమకు అండగా ఉండాలని కోరాడు.
నెల రోజులు విశ్రాంతి
ఆసియాకప్‌లో తొలి మ్యాచుకు ముందు విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. పాకిస్థాన్‌తో అత్యంత కీలకమైన మ్యాచుకు ముందు మనసు విప్పి మాట్లాడాడు. బ్యాటింగ్ పరంగా అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పిన విరాట్ మూడేళ్లుగా సెంచరీ చేయలేదు. ఏ ఫార్మాట్లోనూ మూడంకెల స్కోరు అందుకోలేదు. ఐపీఎల్ ముందు నుంచీ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. దాంతో అతడి మానసిక ఒత్తిడి, పని భారం తగ్గించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత పూర్తిగా విశ్రాంతి ఇచ్చింది.
బలమైన వాడినే.. అయినా!
'ఈ పదేళ్లలో తొలిసారి నెల రోజుల పాటు నేను బ్యాటు పట్టుకోలేదు. నన్ను నేనే మోసం చేసుకుంటున్నానని గుర్తించాను. లేదు, నీలో ఇంటెన్సిటీ ఉందని ఇన్నాళ్లూ నన్ను నేనే నమ్మించుకొనే ప్రయత్నం చేశాను. కానీ నా శరీరం మాత్రం ఆపేయాలని చెప్పింది. వెనక్కి తగ్గి కాస్త విరామం తీసుకోవాలని నా మనసు చెప్పింది. మానసికంగా నేనెంతో బలంగా ఉంటాను. అలాగే ఉండేవాడిని. అయితే ప్రతి ఒక్కరికీ ఒక పరిమితి ఉంటుంది. దానిని గుర్తించడం అవసరం. లేదంటే పరిస్థితులు అనారోగ్యకరంగా మారతాయి' అని విరాట్ కోహ్లీ అన్నాడు.
నాకూ పరిమితి!
'ఫామ్‌లో లేని గడ్డు రోజులు నాకెన్నో పాఠాలు నేర్పించాయి. నేను వాటిని బయటకు తెలియనిచ్చేవాడిని కాదు. అవి వచ్చాక ఆస్వాదించడం మొదలుపెట్టాను. నేను మానసికంగా అలసిపోయానని చెప్పేందుకు సిగ్గుపడను. అందరికీ ఇదెంతో సామాన్య విషయం. కానీ మనం దాని గురించి బహిరంగంగా మాట్లాడేందుకు నిరాకరిస్తాం. మానసికంగా బలహీనంగా ఉన్నట్టు కనిపించేందుకు ఇష్టపడం. అందుకే బలహీనంగా ఉన్నామని అంగీకరించడం కన్నా పటిష్ఠంగా ఉన్నామని మోసగించుకోవడం మరింత దారుణం' అని విరాట్ వివరించాడు.
ఎప్పట్లాగే అండగా ఉండండి
టీమ్‌ఇండియాలో నాణ్యమైన ప్రతిభావంతులు ఉన్నారని విరాట్ పేర్కొన్నాడు. అందరూ సమష్టిగా రాణిస్తామని తెలిపాడు. ఈ రెండు నెలల్లో ఆసియాకప్, టీ20 ప్రపంచకప్ ఉన్నాయని వివరించాడు. అందులో గెలిచేందుకు అభిమానులు తమకు ఎప్పట్లాగే అండగా ఉండాలని కోరాడు.