ACA Cash Incentive For young Cricketer Nitishkumar Reddy: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌రెడ్డి (NitishKumar Reddy) అద్భుత ఆటతీరు కనబరిచాడు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో శతకంతో అలరించాడు. క్లిష్ట పరిస్థితుల్లో సెంచరీతో చెలరేగిన అతనిపై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా నితీశ్‌ను అభినందించారు.
'బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీ 2024లో ఆస్ట్రేలియాతో మెల్బోర్న్‌లో జరుగుతున్న క్రికెట్ నాలుగో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించిన విశాఖపట్నం యువకుడు కె.నితీష్‌కుమార్‌రెడ్డికి అభినందనలు. టెస్టు మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కూడా కావడం మరింత సంతోషం కలిగిస్తోంది. రంజీలో ఆంధ్రా తరపున ఎన్నో విజయాలు సాధించాడు. అండర్ 16లో కూడా అద్భుత విజయాలు అందుకున్నాడు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో మరిన్ని సాధించాలని, భారత క్రికెట్ జట్టులో ఉండి దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.' అని పేర్కొన్నారు.
'తెలుగువారికి గుర్తుండిపోతుంది'
'విశాఖ కుర్రాడు నితీశ్ ఆసీస్‌పై సెంచరీ చేయడం చూసి ఆనందించా. తీవ్ర ఒత్తిడిలోనూ ఏకాగ్రతను కోల్పోకుండా తొలి శతకం పూర్తి చేసినందుకు అభినందనలు. నితీశ్ ఆటపై గర్వంగా ఉంది. ఇలానే మున్ముందూ కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా. ఏపీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఈ ఏడాది గుర్తుండిపోయేలా చేసినందుకు ధన్యవాదాలు. కఠిన పరిస్థితులు ఎదుర్కొంటూ ఒక్కో అడుగు ముందుకేస్తూ స్వర్ణాంధ్ర దిశగా సాగిపోదాం.' అని పోస్ట్ చేశారు.
రూ.25 లక్షల నగదు బహుమతి
అటు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున యువ క్రికెటర్ నితీశ్‌కుమార్‌రెడ్డికి ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని విశ్వనాథ్ రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా నగదు బహుమతిని అందిస్తామన్నారు. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆల్‌రౌండర్‌గా నితీశ్ అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించారు. నేటి యువతకు నితీశ్ రోల్ మోడల్ అని.. యువ క్రికెటర్లను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. దేశంలోనే అత్యాధునిక వసతులతో కూడిన స్టేడియంను అమరావతిలో నిర్మిస్తామని పేర్కొన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడే విధంగా విశాఖ స్టేడియంను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఏపీకి కూడా ఐపీఎల్ టీమ్ సిద్ధం చేసేలా ఏసీపీ ఆలోచిస్తోందన్నారు.
అటు, ఉత్తరాంధ్ర ప్రజల తరఫున నితీశ్‌కుమార్‌రెడ్డికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభినందనలు తెలిపారు. 'క్రికెట్ చరిత్రలో నీ ఆరంభం రాష్ట్ర, దేశ ప్రజలకు, క్రికెట్ అభిమానులకు స్ఫూర్తినిస్తుంది. అలాగే, విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున అభినందనలు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా.' అంటూ మెయిల్ ద్వారా విషెష్ చెప్పారు.