Pawan Kalyan Visit Galiveedu MPDO: వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మండిపడ్డారు. శుక్రవారం వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో (Galiveedu MPDO) జవహర్‌బాబును ఆయన శనివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్.. వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వైసీపీ నేతలు గాలివీడు ఎంపీడీవోను అమానుషంగా కొట్టారు. అధికారులపై దాడులు చేయడం వైసీపీకి కొత్తేం కాదు. ఆధిపత్యం, అహంకారంతో దాడి చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో చూపిస్తాం. ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారా.? ఖబడ్దార్. మీ ఇష్టారాజ్యంగా చేయలేరు. మీ అహంకారం ఎలా అణచివేయాలో మాకు తెలుసు. అది చేసి చూపిస్తాం.' అని పవన్ వార్నింగ్ ఇచ్చారు.
ఇదీ జరిగింది
కాగా, అన్నమయ్య జిల్లాలో (Annamayya District) వైసీపీ నేతలు శుక్రవారం వీరంగం సృష్టించారు. గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, అతని అనుచరులు దాడికి తెగబడ్డారు. ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి దాదాపు 20 మంది అనుచరులతో మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. ఎంపీపీ ఛాంబర్ తాళం ఇవ్వాలని అడగ్గా.. ఎంపీపీకి మాత్రమే తాళాలు ఇస్తానని ఎంపీడీవో చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు.. 'మాకే ఎదురు చెబుతావా' అంటూ ఒక్కసారిగా ఎంపీడీవోపై దాడికి దిగారు. కుర్చీలో నుంచి కింద పడిపోయినా ఆగకుండా కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు కురిపించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వైసీపీ నేతలను చెదరగొట్టారు. ఎంపీడీవోను ఆస్పత్రికి తరలించారు. సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. దాడిలో పాల్గొన్న అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు.
13 మందిపై కేసు
మరోవైపు, ఈ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 13 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఎంపీడీవో ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టారు. అనుచరుల కోసం గాలింపు తీవ్రం చేశారు.
అభిమానులపై పవన్ ఆగ్రహం
అటు, ఎంపీడీవోను పరామర్శించిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీనిపై పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీరియస్‌గా మీడియాతో మాట్లాడుతోన్న క్రమంలో 'ఓజీ.. ఓజీ.. ఓజీ' అంటూ స్లోగన్స్ చేశారు. దీంతో పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'ఏంటయ్యా మీరు ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కకు రండి.' అంటూ అసహనం వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండగా.. వీలు కుదిరినప్పుడు ఓజీ, హరిహర వీరమల్లు షూటింగుల్లో పాల్గొంటున్నారు.