స్థపతులు సుందరరాజన్‌, డాక్టర్‌ ఆనందరాజన్‌ వేలుల పర్యవేక్షణలో ఉప స్థపతులూ, మరెందరో శిల్పులూ శ్రమించి స్తంభాలను అధ్భుతంగా తీర్చిదిద్దారు. సాధారణంగా ఆలయంలో స్తంభాలు అనేస్తారు కానీ వాటిలో మూడు రకాలుంటాయని తెలుసా...ఒక్కో ఆలయంలో ఒక్కో రకంగా చెక్కుతుంటారు. కానీ యాదాద్రి ఆలయం విషయానికొస్తే మూడు రకాల స్తంభాలు చెక్కారు.


1. బ్రహ్మకాంతం-  నాలుగు పలకలుగా చెక్కితే బ్రహ్మకాంత స్తంభాలు అంటారు
2. విష్ణుకాంతం - ఎనిమిది పలకలతో ఉంటే విష్ణుకాంత స్తంభాలు అంటారు
3. రుద్రకాంతం - వృత్తాకారంలో నిర్మిస్తే రుద్రకాంత స్తంభం అంటారు.


ఈ మూడింటిని కలపి నిర్మిస్తే యాలీ స్తంభాలు అంటారు. ఇదే యాదాద్రి ఆలయం ప్రత్యేకత.



  • సింహ ఆకారంతోపాటు తొండం ఉన్న శిల్పాన్నే యాలీ అంటారు. ఈ స్తంభంలో విగ్రహస్థానం, నాగబంధం, అష్టపటం, చతురస్రం సహా పలు విభాగాలుంటాయి.  

  • రెండు ప్రాకారాలతో నిర్మితమైన యాదాద్రి నారసింహక్షేత్రంలో  మొదటి ప్రాకారంలో విష్ణుకాంత స్తంభాలు ఎక్కువగా ఉంటే, రెండో ప్రాకారంలో యాలీ స్తంభాలు చెక్కారు.

  • బయటి ప్రాకారంలో ఉన్న అష్టభుజి మండపాల్లో చిత్రకంఠ స్తంభాల్నీ బాలపాద స్తంభాల్నీ నిర్మించారు.

  • పంచతల రాజగోపురం లోపల రుద్రకాంత స్తంభాలను అమర్చగా ఏడంతస్తుల రాజగోపురం లోపల చిత్రకంఠ స్తంభాలు కనిపిస్తాయి.

  • అనేక స్తంభాలమీద పద్మాలనీ, పక్షుల్నీ, దశావతారాల్నీ కళ్లకు కట్టినట్లుగా చెక్కారు.

  • ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలతో పాటు ఆధునిక కాలంనాటి క్రీడల్నీ కరెన్సీనీ కూడా స్తంభాలపై చెక్కారు. 


Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం


చూపు తిప్పుకోనివ్వని మహా ముఖమండపం



  • ప్రధానాలయంలో ఉన్న మహా ముఖ మండపంలో స్తంభాలు చెక్కిన తీరు చూస్తే చూపుతిప్పుకోలేరేమో. ఆళ్వారుల వైభవాన్నీ కాకతీయుల పౌరుషాన్నీ చాటిచెప్పేందుకు ఇంతకన్నా ఏముంది నిదర్శనం అనిపించకమానదు.  

  • సాధారణంగా యాలీ స్తంభాలూ, అశ్వ స్తంభాలతోనే మహా మండపాలు నిర్మితవుతాయి. కానీ యాదాద్రి క్షేత్రంలో మహా మండపంలోని కింది అంతస్తులో ఉన్న 12 స్తంభాల ముందువైపున 12 మంది ఆళ్వార్లు కొలువుదీరి ఉంటారు. తమ పాశురాలతో విష్ణువును కీర్తించి, దక్షిణాదిన భక్తితత్త్వాన్ని విస్తరించిన విశిష్ట భక్తులే ఆళ్వారులు. ( కలియుగంలో ధర్మంనాలుగు పాదముల మీదకాక ఒంటికాలిమీద కుంటి నడక నడుస్తుందని, ధర్మాచరణకు విఘాతం కలుగుతోందని ఆ శ్రీమన్నారాయణుడే 12 మంది ఆళ్వారులుగా ఈ భూమిపై జన్మించాడని చెబుతారు) .

  • పై అంతస్తులో కాకతీయుల శైలిలో నిర్మించిన బ్రహ్మకాంత స్తంభాలు ప్రధాన ఆకర్షణ.  ప్రధాన స్తంభానికి నలువైపులా పిల్ల స్తంభాల్ని చెక్కినదాన్నే బ్రహ్మకాంత స్తంభం అంటారు. ఈ స్తంభాలమీద యుద్ధ సన్నివేశాల్నీ గజ, సింహ, పులి, అశ్వవాహనాలపై సైనికులు స్వారీ చేస్తున్నట్లుగా  చెక్కిన తీరు అద్భుతం అనిపిస్తుంది.


ఇంకా చెప్పుకుంటూ పోతే యాదాద్రి లక్ష్మీ నారసింహుడి సన్నిధిలో అణువణువూ అద్భుతమే...అడుగడుగూ మహిమాన్వితమే...


Also Read: సింహాద్రి అప్పన్న నుంచి కాటమరాయుడి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నారసింహ క్షేత్రాలు


Also Read: యాదాద్రి సహా తెలంగాణలో నారసింహస్వామి కొలువైన మహిమాన్వితే క్షేత్రాలివే-