భ‌గ‌వంతుడికి చేసే పూజ‌లో పూల‌ను వాడే ఆచారం అనాది కాలం నుంచి ఉంది. పూజ అనే పదంలో మొదటి అక్షరం పుష్పాన్ని సూచిస్తే, రెండో అక్షరం జపాన్ని సూచిస్తుందని చెబుతారు. దేవుడికి అత్యంత ప్రీతికరమైనవి పూలు. నిత్య పూజ అయినా, గుళ్లో అయినా, హోమం జరిగినా ముందుగా పూలకే ప్రాధాన్యం ఉంటుంది. ఎన్ని రకాల పూలు పూసినా.. అవి ఆ స్వామి కైంక‌ర్యానికే.  నిశ్చ‌ల భక్తితో, పవిత్రమైన మనసుతో స‌మ‌ర్పించే పువ్వు గానీ, పండు గానీ, నీటిని గానీ చివ‌ర‌కు ఆకును అయినా స‌రే తృప్తిగా స్వీకరిస్తానని గీతాచార్యుడు శ్రీ‌కృష్ణుడు వివరించాడు. భక్తితో సమర్పించిన తులసి ఆకు సైతం కృష్ణుని భారాన్ని మోయగలిగిందని తెలిసిందే క‌దా...  


దేవుడికి చేసే అలంకారం నుంచి పూజలోని ప్రతి అంశం పూలతోనే ముడిపడి ఉంటుంది. రకరకాల పూల‌తో ఆ స్వామిని అలంకరించడం, పూజించడం ఆనవాయితీ. పూజకు ఉపయోగించే పూలు చాలా పవిత్రంగా ఉండాలి. వాడిపోయినవి, ముళ్లు ఉన్నవి, అపరిశుభ్రమైనవి, దుర్వాసనతో ఉన్న పూలు పూజ‌కు ఉపయోగించ కూడ‌దు.  ముందు రోజు సమర్పించిన పూలను బొటనవేలు, చూపుడు వేలుతో తీసేయాలి. తాజా పూలను బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలుతో దేవుడికి సమర్పిస్తే మంచిది. దేవునికి విడి పూల కంటే మాలగా కట్టిన పూలతో  పూజ చేస్తే ప్రత్యక ఫలితం లభిస్తుంది. దేవునికి వేసే పుష్పాలు విచ్చుకుంటే అపార‌మైన ఫ‌లితం ద‌క్కుతుంద‌ని  న‌మ్మ‌కం. 


దేవుడి పూజకు ఉపయోగించే పూలు ఎలా పడితే అలా కోయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. పూలు కోసేముందు ఈ పూలు భగవంతుడి కోసం అని మనసులో ప్రార్థించి, చెట్టుకు నమస్కరించాలి. పువ్వులను కర్రతో దులపకూడదు. చేత్తోనే కోయాలి. కోసిన పూలను కిందపెట్టకూడదు. తడిదుస్తుల‌తో కోసిన పూలను భగవంతుడు స్వీకరించడని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు... పూజకు ఉపయోగించే పూలను కూడా తడపకూడదు. ఈ నియమాల్లో దేనిని తప్పినా... సమర్పించే పూల వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.


తామర, కలువ, జాజి, చామంతి, నందివర్దనం, మందారం, నీలాంబరాలు, కనకాంబరాలు, పారిజాతం, పద్మాలు, ఎర్ర గన్నేరు, నిత్యమల్లి పూలు దేవుడి పూజకు శ్రేయస్కరం. దేవుళ్లకు ఇష్టమైన పూలతో పూజ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని శాస్త్రం చెబుతోంది. కలువ పూలంటే మహాలక్షికి ఎనలేని ప్రీతి. అలాగే తెల్లని పూలంటే.. చదువుల తల్లి సరస్వతికి, పసుపు రంగు పూలు పార్వతీదేవికి ఇష్టం. కాబట్టి ఈ దేవతల పూజలకు ఈ రంగు పూలను ఉపయోగించడం శ్రేయస్కరం. మహా శివుడిని బిల్వ పత్రాలతో, శ్రీ చక్రాన్ని, విష్ణువుని పారిజాత పుష్పాలతో పూజించాలి.


పుష్పదానానికి సంబంధించినంతవరకు, పుష్పాన్ని గాని, ఫలాన్నిగాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగిలబడకూడదు. అలా చేయడంవల్ల దుఃఖం కలుగుతుంది. అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు. ‘మంకెన‌’ పుష్పాలతో పూజ ఓర్పును, శాంతిని, సహనాన్ని ఇస్తుంది. విరుచి పుష్పాలు మనసుకు ప్రశాంతతను, ‘ఎరుక’ పుష్పాలు ఆత్మస్థైర్యాన్ని, అరళి పుష్పాలు సత్యసంధ‌తను పెంపొందిస్తాయి. అలాగే తెల్ల తామరలతో దైవాన్ని అర్చిస్తే భక్తి పెరుగుతుంది. తులసి దళాలు ఆధ్యాత్మిక వికాసాన్ని, గన్నేరు, జీవంతి పుష్పాలు  ముక్తికి, మల్లెపువ్వులు  నిష్కల్మష బుద్ధిని, సంపెంగ పుష్పాలు  అభివృద్ధిని, నాగలింగ పుష్పాలతో పూజిస్తే ఆర్థికాభివృద్ధి జరుగుతుందని శాస్త్ర వచనం.