రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో అగ్ర దర్శకుడు సుకుమార్ ఓ ప్రాజెక్ట్ ను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలం అయింది. పాన్ ఇండియా స్థాయిలో ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలిపారు. కానీ ఏళ్ళు గడుస్తున్నా ఇంతవరకూ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కాలేదు. అసలు ఉంటుందో లేదో అనేది కూడా ఎవరికీ అర్థం కావడం లేదు.
నిజానికి 'పుష్ప' సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే విజయ్ దేవరకొండ - సుకుమార్ ల చిత్రానికి ప్రకటన వచ్చింది. అప్పటికి పుష్ప సెకండ్ పార్ట్ తీయాలనే ఆలోచన లేకపోవడంతో, అల్లు అర్జున్ మూవీ పూర్తయిన వెంటనే VD సినిమాని మొదలు పెట్టాలని ప్లాన్ చేసుకున్నారు సుక్కు. అయితే 'పుష్ప' రెండు భాగాలుగా మారడం.. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్లాన్స్ అన్నీ మారిపోయాయి.
'పుష్ప 2' కు ఏర్పడిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని విజయ్ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టారు సుకుమార్. మరోవైపు రౌడీ హీరో ఇతర ప్రాజెక్ట్స్ కి కమిట్ అయ్యాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన పాన్ ఇండియా మూవీ లైగర్ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా మారింది. దీంతో పూరీతో అనౌన్స్ చేసిన జనగణమన సినిమా అటకెక్కింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఖుషీ సినిమాపైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు వీడీ.
ఖుషీ తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేతులు కలపనున్నాడు విజయ్'D. అలానే 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు కూడా విజయ్ లైనప్ లో ఉంటాడని టాక్ వినిపిస్తోంది. మరోవైపు సుకుమార్ 'పుష్ప: ది రూల్' తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ ఓ భారీ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో VD - సుక్కూ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయబడిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
సుకుమార్ - విజయ్ దేవరకొండ మూవీ సెట్స్ మీదకు వెళ్లకపోవడం.. అసలు ఈ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. అయితే ఫాల్కన్ క్రియేషన్స్ టీమ్ ఈ పుకార్లను ఖండిస్తూ ఓ నోట్ రిలీజ్ చేసింది. దర్శక హీరోల ఇతర కమిట్మెంట్స్ పూర్తైన వెంటనే ఈ సినిమా ప్రారంభం అవుతుందని.. ఈ కలయిక బిగ్గర్ గా ఉండబోతోందని పేర్కొన్నారు. 2022 లోనే సెట్స్ పైకి వెళ్తుందని తెలిపారు. కానీ పరిస్థితులన్నీ మారిపోయాయి.
సుకుమార్ ప్రాజెక్ట్ పూర్తిగా రద్దు చేయబడిందనే రూమర్స్ ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తోంది. లైగర్ మూవీ హిట్ అయ్యుంటే రౌడీ కెరీర్ మరోలా ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఇప్పుడు శివ నిర్వాణ, గౌతమ్ తిన్ననూరి సినిమాలతో సత్తా చాటుతాడని ధీమాగా ఉన్నారు. భవిష్యత్ లో కచ్ఛితంగా సుక్కూతో VD సినిమా ఉంటుందని నమ్ముతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.