Chinnamasta Devi : మహేశ్ బాబు - రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ప్రపంచ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ప్రమోషన్ ప్రారంభించిన జక్కన్న.. ఈ మూవీ టైటిల్ తో పాటూ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ప్రతి ఫ్రేమ్ అద్భుతమే.. సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులు చూసే క్షణం పెద్ద పండుగే.. అయితే చిన్న గ్లింప్స్ తోనే తన సినిమా ఎలా ఉండబోతోందో చెప్పడమే కాదు.. ఏ ఏ విషయాలు కవర్ చేయబోతున్నారో హింట్ ఇచ్చి వదిలారు. చిన్న టీజల్లో అందర్నీ ఆకర్షించిన విగ్రహం ఓ గుహలో తల చేత్తో పట్టుకుని రక్తం తాగే మొండెం ఉన్న అమ్మవారి విగ్రహం. కాళీ మాత అనుకున్నారంతా.. కానీ ఆ దేవతా రూపం పేరు చిన మస్త దేవి. దశ మహావిద్యల్లో ఓ విద్యకు ఈమె అధినేత్రి.
దశ మహావిద్యల్లో చిన మస్త ఒకరైతే..మిగిలిన తొమ్మిది మంది ఎవరు? ఎవరు దేనికి సంకేతం? తాంత్రిక సాధనలో అత్యంత శక్తివంతమైన పాత్ర పోషిస్తాయ్ దశమహావిద్యలు. జ్ఞానస్వరూపిణి అయిన ఆదిపరాశక్తి పార్వతీదేవి పది రూపాలే దశ మహావిద్యలకు అధిపతి. ఇవి శక్తి ఉపాసనలో అత్యంత గోప్యమైనవి.
దశ మహావిద్యలు - అధిదేవత పేరు
కాళీ మహావిద్య
ఈ విద్యకు అధిదేవత శ్రీ మహాకాళి - కాలం, మరణం, వినాశనం, మోక్షం, అజ్ఞాన నాశనానికి ప్రతీక
తారా మహావిద్య
శ్రీ తారా దేవి - మోక్షప్రదాయిని, దుఃఖ తారణం, బౌద్ధ తాంత్రికులకూ పవిత్ర రూపం ఇది
త్రిపురసుందరీ (షోడశీ)
శ్రీ లలితాంబిక / శ్రీవిద్య - సౌందర్యం, శృంగారం, జ్ఞానం, ఐశ్వర్యం, షోడశ కళల స్వరూపిణి
భువనేశ్వరీ
శ్రీ భువనేశ్వరి - సమస్త విశ్వానికి అధిపతి, ఆకాశ తత్త్వం, సృష్టి పాలన
భైరవీ (త్రిపురభైరవీ)
శ్రీ త్రిపురభైరవి - తేజస్సు, యోగసాధన, కఠిన తపస్సు, శివుని శక్తికి రూపం
చిన మస్త ( వారణాసి సినిమా టీజర్లో కనిపించిన ఈ రూపం గురించి పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
శ్రీ చిన మస్త దేవి - తన కంఠాన్ని తానే ఛేదించుకుని రక్తం తాగే స్వరూపిణి – ఆహారం (ప్రాణం) మీద అధికారం, కుండలినీ జాగృతి, అహంకార నాశనానికి ప్రతీక
ధూమావతీ
శ్రీ ధూమావతీ - దుఃఖం, దారిద్ర్యం, ఒంటరితనం, తామస గుణం, అతీత జ్ఞానానికి ప్రతీక
బగళాముఖీ
శ్రీ బగళాముఖీ - శత్రు నాశనం, వాక్స్తంభన, విజయం, రాజస శక్తికి ప్రతీక
మాతంగీ
శ్రీ మాతంగి (రాజశ్యామల) - వాక్కు, కళలు, సంగీతం, జ్ఞానం, మంత్రసిద్ధి రూపం
కమలాత్మికా (కమలా)
శ్రీ మహాలక్ష్మీ - ఐశ్వర్యం, సంపద, సౌభాగ్యం, సౌందర్యం, సత్వగుణ స్వరూపిణి
ఈ పది రూపాలను దశమహావిద్యలు అంటారు. ఈ 10 రూపాలు కలిపి సమస్త సృష్టి-స్థితి-లయలను... మూడు గుణాలను (సత్వ-రజస్-తమస్), మూడు కాలాలను ( భూత - భవిష్యత్-వర్తమాన), అన్ని విధాలైన శక్తులను ప్రతినిధీకరిస్తాయి.
దశ మహావిద్యల్లో ఒక్కొక్కటీ ఒక్కో తాంత్రిక మార్గాన్ని సూచిస్తాయి. వీటి సాధన అత్యంత గుప్తం, అత్యంత కఠినం... గురుముఖంగా మాత్రమే సాధన సాధ్యం అవుతుంది
గమనిక: పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!
'వారణాసి' ఈ పేరెలా వచ్చింది? అక్కడ ప్రత్యేకతలు , వింతలు ఏంటి? రాజమౌళి - మహేష్ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు?