Holika Dahan 2025 Correct Date Muhurat Timings: మార్చి 13 , 14 రెండు రోజులు పౌర్ణమి తిథి తగులు, మిగులు రావడంతో హోలీ ఎప్పుడు అనే సందేహం అందర్లోనూ ఉంది. అయితే సాధారణంగా సూర్యోదయానికి తిథి ఉండే రోజునే పరిగణలోకి తీసుకుంటారు. కానీ..పౌర్ణమి, అమావాస్య తిథులతో ముడిపడే పండుగలన్నింటికీ మాత్రం రాత్రికి తిథి ఉండడమే ప్రధానం. అందుకే ఎలాంటి సందేహాలు అవసరం లేదు..హోలీ పౌర్ణమి మార్చి 13 గురువారమే...
అయితే హోలీకా దహనం చేసేవారు రాత్రివేళ పౌర్ణమి ఘడియల్లో చేస్తారు కాబట్టి 13 రాత్రి హోలీ పండుగ జరుపుకుంటారు..రాక్షస దహనం జరిపిస్తారు. రంగులు చల్లుకుని ఆనందించేవారు మార్చి 14 శుక్రవారం పౌర్ణమి ఘడియలు వెళ్లిపోకముందే సంబరాలు చేసుకుంటారు.
హోలీ కొత్తగా ప్రారంభమైన పండుగ కాదు..సత్యయుగం ( యుగాలు 4 సత్యయుగం or కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం) నుంచి రంగులపండుగను కలర్ ఫుల్ గా జరుపుకుంటున్నారు. హిందూ పురాణాల్లో ఈ విషయం స్పష్టంగా ఉంది. ఈ పండుగ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి..
హిరణ్యకశపుడి తయయుడైన ప్రహ్లాదుడు నిత్యం శ్రీ మహా విష్ణువుని ధ్యానించడం తండ్రికి నచ్చదు. హరినామస్మరణను సహించలేకపోయిన ఆ రాక్షసరాజు కుమారుడిని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. ఏనుగులతో తొక్కించి, పాములతో కరిపించి, చీకటి గుడలో పడేసి , కొండపై నుంచి తోసేసి ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసినా శ్రీహరి కాపాడుతాడు. అయితే ఈసారి ఆ అవకాశం లేకుండా మంటల్లో కాల్చి బూడిద చేయాలి అనుకుంటాడు. అందుకోసం తన సోదరి హోళిక సహాయం కోరుతాడు. ఆమెకు ఉన్న శక్తిని వినియోగించి మంటల్లో కాల్చేయమని చెబుతాడు. హోళిక ప్రహ్లాదుడిని తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో దిగుతుంది. ఆమెకు హాని జరగకుండా ప్రహ్లాదుడు మసైపోతాడు అనుకుంటుంది. కానీ ఆ నారాయణుడి ధ్యానంలో ఉన్న ప్రహ్లాదుడిని మంటలు ఏమీచేయలేరు. పైగా హోళిక ఆ మంటల్లో దహనం అయిపోతుంది. అప్పటి నుంచి రాక్షసి పీడ విరగడైనందుకు హోలికా దహనం నిర్వహిస్తున్నారు. ఈ దహనం రాత్రివేళ నిర్వహిస్తారు..
కొత్తగా పెళ్లైన వారికి హోలీకి ఏంటి సంబంధం? ఎందుకు హోలీ చేసుకోకూడదు? చేసుకుంటే ఏమువుతుంది?
కొత్తగా పెళ్లైనవాళ్లు హోలీ జరుపుకోవచ్చు కానీ..హోళికా దహనం చూడకూడదు. ఎందుకంటే హోళికా దహనం అంటే ఓ శవాన్ని కాల్చడంతో సమానం..రాక్షసి శరీరం అగ్నికి ఆహుతి అవుతున్నట్టు భావిస్తారు. అందుకే కొత్తగా పెళ్లైన దంట హోళికా దహనం చూస్తే వారి జీవితంలో కష్టాలు , సమస్యలు ఎదురవుతాయని విశ్వాసం.
కృతయుగంలో సూర్యవంశానికి చెందిన ఓ మహారాజు దగ్గరకు వచ్చిన ప్రజలంతా ఓ రాక్షసి తమను ఇబ్బందులకు గురిచేస్తోందని మొరపెట్టుకుంటారు. అప్పుడే అక్కడకు వచ్చిన నారదుడు..మాఘపౌర్ణమి రోజు హోళికా దహనం చేస్తే ఆ కష్టాలు తొలగిపోతాయని చెప్పాడు. హోళికా దహనం పగటి సమయంలో చేయకూడదని పౌర్ణమి ఘడియల్లో రాత్రివేళ నిర్వహించాలని చెప్పాడు నారదుడు. హోళికా దహనం నిర్వహించిన తర్వాత ఆ రాక్షసి పీడ నుంచి విముక్తి లభించింది ప్రజలకు. ఇదే రోజు కాముని పున్నమి పేరుతో సంబరాలు చేసుకుంటారు. సతీవియోగంతో సర్వం వదిలేసిన శంకరుడికి...హిమవంతుడి కుమార్తెగా జన్మించిన పార్వతితో పెళ్లి జరిపించాలని దేవతలు నిర్ణయిస్తారు. అందుకు మన్మథుడి సహాయం తీసుకుంటారు. అలా శివుడిపై మన్మథబాణం ప్రయోగించి తపోభంగం చేసిన కాముడిపై మూడోకన్ను ప్రసరింపచేసి భస్మం చేస్తాడు. అలా కోరికలకు మూలపురుషుడు అయిన కాముడిని దహనం చేసిన రోజు మాఘ పౌర్ణమి కావడంతో ఈ రోజుని కాముని పున్నమి అంటారు. అందుకే కోరికలు జయించాలని కోరుకుంటూ కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను తయారుచేసి దహనం చేస్తారు.
శ్రీకృష్ణుడు గోపికలతో హోలీ ఆడుతూ ఈ ఉత్సవాన్ని సంబరంగా జరుపుకున్నాడు. రంగురంగుల పూలు చల్లుకుంటూ ప్రేమ, సౌభాగ్యం వెల్లివిరిసేలా చేశాడు.
ఇదే రోజు బాలకృష్ణుడిని ఉయ్యాలలో వేశారని మరో కథనం. అందుకే డోలోత్సవం జరుపుకునేది కూడా ఈ రోజే. కొన్ని ప్రాంతాల్లో ఉయ్యాలలో శ్రీ కృష్ణుడిని ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుతారు.