తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని మనసులో తలచుకోగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఏడుకొండలు, మూడు నామాలు. స్వామి రూపంలో ముందుగా అందరినీ ఆకట్టుకుని, ప్రత్యేకంగా కనిపించేవి మూడు నామాలే. ఈ మూడునామాలను తిరుమల కొండపై పెద్దగా కనిపించేలా ఏర్పాటుచేశారు. ఏడుకొండలకు నడక దారిన వెళ్లేటప్పుడు కూడా మూడు నామాల కొండ ఉంటుంది. అది దిగువనున్న తిరుపతికి కూడా కనబడుతుంది.
మూడు నామాల వెనుక పరమార్థం
శ్రీ మహా విష్ణువు ధరించి, మానవుడు తన ఉజ్జీవనానికి ఇలా ధరించాలని చెప్పినదే ఊర్ద్వ పుండ్రం. "పూడి - ఖండనే " అనే సంస్కృత దాతువును అనుసరించి అజ్ఞానాన్ని, కర్మపాశాన్ని ఖండించేది పుండ్రం. సత్వగుణం మనిషిని ఉన్నతమైన మార్గంలో, ఉత్తమ లక్ష్యం వైపు నడుపుతుంది. తెల్ల నామాలు సత్వగుణాన్ని, దానివల్ల కలిగే ఉద్రేక రహిత స్థితిని తెలియజేస్తాయి. అది పునాదిగా ఉండాలని క్రింద పాదపీఠం ఉంటుంది. సత్వగుణం మనల్ని ఉన్నతికి తీసుకు వెడుతుందని సూచించేదే నిలువు బొట్టు. సత్వగుణానికి అధిష్ఠాన దేవత శ్రీ మహావిష్ణువు కనుక రెండు తెల్లని ఊర్ద్వ పుండ్రాలు ఆయన పాదాలుగా శిరసావహిస్తారు.
ఇక విశ్వమంతటా వ్యాపించిన అనురాగానికి ప్రతీక లేత ఎరుపు రంగు. అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం, శుభసూచకం, మంగళకరమైనది. కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్త, సాక్షాత్తూ ఆదిశేషుని అంశతో జన్మించిన శ్రీ రామానుజాచార్యుల వారు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి ఊర్ధ్వ వుండ్రములు అలంకరించారు. అలా.. శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది.
శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులం కస్తూరితో మూడు నామాలు అలంకరిస్తారు. అవి మళ్లీ గురువారం వరకూ అలానే ఉంటాయి. గురువారం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు. అంటే ఎప్పుడూ శ్రీవారు కళ్లు నామాలతో మూసి ఉంటాయి. శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో శ్రీవారు మూడు నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో నేత్ర దర్శనం, నిజపాద దర్శనం చేసుకునే అరుదైన, మహత్తరమైన అవకాశం భక్తులకు లభిస్తుంది. శుక్రవారం అభిషేకం తర్వాత మూడు నామాలు అలంకరిస్తే మరలా శుక్రవారం అభిషేకం సమయం వరకు ఈ నామం అలాగే ఉంటుంది. అంటే వారానికి ఒకసారి మాత్రమే శ్రీవారికి మూడు నామాలు దిద్దుతారు.
బ్రహ్మోత్సవాల్లో మరింత ప్రత్యేకం
బ్రహ్మోత్సవ సమయాలలో మాత్రం శ్రీవేంకటేశ్వరస్వామి ఊర్ధ్వపుండ్రములలో పచ్చకర్పూరం, కస్తూరి రెట్టింపు మొత్తంలో వినియోగిస్తారు. శ్రీనివాసునికి అత్యంత ప్రియమైనవి బ్రహ్మోత్సవాలు. 10 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో, బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే శుక్రవారంనాడు, మధ్యలో వచ్చే శుక్రవారం రోజు, తిరిగి ముగింపు శుక్రవారం రోజు, ఇలా 3 లేదా 4 శుక్రవారాలలో శ్రీవారి ఊర్ధ్వపుండ్రముల అలంకరణలో 32 తులాల పచ్చకర్పూరం, 3 తులాల కస్తూరి వినియోగిస్తారు. ఈ శుక్రవారములను ఆలయ సంప్రదాయాలలో రెట్టింపు శుక్రవారాలని, రెట్టవారాలని వ్యవహరిస్తారు.
మనిషి సహజంగా తమోగుణాన్నికలిగి ఉంటాడు. తమోగుణం ముఖ వర్ణముతో సూచించబడింది. తమోగుణమును నశింప చేసుకుని సత్వగుణ ప్రధానులు కావాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ సత్వగుణమును సూచించేవే తెల్లటి తిరునామాలు. సత్వగుణ సంపన్నుడు మాత్రమేకాక రజోగుణ సంపన్నుడు కూడా కావాలనే భావము అరుణ వర్ణము కలిగిన శ్రీ చూర్ణము వెల్లడిస్తుంది. ధీమహిధియోయోనః ప్రచోదయాత్ అనే గాయత్రీ మంత్రానికి అర్థము ఊర్ధ్వపుండ్ర ధారణము సూచిస్తుంది. నాలో ఉండి నన్ను సత్కర్మలకు ప్రేరేపించు, నన్ను వ్యసనముల మాయలో పడనీయకు సంమార్గాములో నడిపించు అని ఈ మంత్రానికి అర్థం.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు