గార్బా గుజరాతి జానపద నృత్యం. గార్బా నృత్యం ఒక ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమం. గుజరాతీ పల్లెప్రాంతంలో పుట్టిన నృత్యరీతి. ఈ నృత్య కార్యక్రమం గ్రామం మధ్య జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొంటారు. గ్రామాల్లో జరిగే అన్ని జానపద సంప్రదాయల మాదిరిగానే దీనికి కూడా ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ నృత్యాన్ని దేవీ ఆరాధనలో భాగంగా చెప్పుకోవచ్చు.


గార్బా నృత్యాలు నవరాత్రి సమయంలో ప్రదర్శిస్తారు. నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు. ఇవి దుర్గామాత ను కొలుచుకునే రోజులు. హిందుత్వంలో స్త్రీ శక్తికి జరిపే ఆరాధనగా దీన్ని చెప్పుకోవచ్చు. దుర్గాదేవి అంటే దైవశక్తికి స్త్రీరూపంగా భావించవచ్చు. ఆమె తొమ్మిది రూపాలను తొమ్మిదిరోజులపాటు వైభవంగా కొలుచుకునే సుదీర్ఘ పండుగ ఇది. భారతదేశమంతటా కూడా ప్రతీ ప్రాంతంలో వారి సంప్రదాయం ప్రకారం ఈ పండుగ జరుపుతారు.


గుజరాత్ లో ఈ తొమ్మిది రాత్రులలోనూ దుర్గాదేవిని ప్రసన్నం చేసుకునేందుకు స్త్రీలు, పరుషులు రాత్రి పొద్దుపోయే వరకు నృత్యాలు చేస్తారు. చాలా మంది ఈ తొమ్మిది రోజుల పాటు కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు, ఉపవాసాలు కూడా పాటిస్తారు. గుజరాత్‌లో నవరాత్రి ఉత్పవాల్లో గార్బా ప్రధానమైంది. గార్బా ఉత్సవానికి ఒక ప్రత్యేకమైన ఉత్సాహాన్ని తెస్తుంది.


వలయాకారంలో సాగే నృత్యం ఇది. ఎక్కువ మంది పాల్గొంటున్నపుడు ఎక్కువ సంఖ్యలో వలయాలు ఏర్పాటు చేస్తారు. ఈ నృత్యానికి ఒక ప్రత్యేకమైన దృక్పథం ఉంటుంది. కాలచక్రం ఎప్పుడూ తిరుగుతూ పునరావృతం అవుతుంది. పుట్టుక నుంచి మరణం వరకు, మరణం నుంచి పునర్జన్మ వరకు ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఈ అన్నీ అంశాల్లోనూ కదలకుండా నిరంతరాయంగా ఉండేది దైవశక్తి ఒకటే. దానికి ప్రతీకగా నృత్య వలయం మధ్య దేవీ ప్రతిమ లేదా పెద్ద దీపపు సెమ్మెను పెడతారు. దాని చుట్టూనే జీవితం తిరుగుతుందని చెప్పేందుకు ఇదొక ప్రతీక. శక్తి రూపంలో ఉండే దైవం నిరంతరమైనదని చెబుతుంది.


గార్బా దైవారాధనా రీతుల్లో ఒకటి కనుక తప్పకుండా చెప్పులు లేకుండానే చెయ్యలి. చెప్పులు ధరించకపోవడం సకల జీవులకు ఆలవాలమైన భూదేవి పట్ల మనం చూపే గౌరవంగా భావిస్తారు. భూమిని నిరంతరం అంటి పెట్టుకుని ఉండే భాగం పాదాలు. ఈ పాదాల ద్వారానే శరీరంలోకి శక్తి ప్రవాహం జరుగుతుందని నమ్మకం. ఆ దేవితో మనకు నేరుగా సంబంధాన్ని కల్పించేవి పాదాలే. అందుకే చెప్పులు లేకుండా చేసే ఈ నృత్యం పవిత్రమైన దైవారాధన వంటిది.


Also read : Vastu Tips in Telugu: డస్ట్ బిన్ ఇక్కడ పెడితే దరిద్రం వెంటాడుతుంది - ఈ తప్పులు అస్సలు 



Disclaimer : ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.