vijayawada dasara schedule 2025 | విజయవాడ: దసరా అంటే తెలుగు ప్రజలకు గుర్తొచ్చేది విజయవాడ. "బెజవాడ దుర్గమ్మ" గా  భక్తుల గుండెల్లో  కొలువైన కనకదుర్గమ్మ ఉత్సవాల తేదీలు వచ్చేసాయి. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో 2025 దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన దుర్గ గుడి ఈవో శీనా నాయక్  అమ్మవారి అలంకారాలకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి వైదిక సభ్యులు కూడా పాల్గొన్నారు.

సెప్టెంబర్ 22  నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

ప్రతి ఏడాది లానే బ్రహ్మాండంగా నిర్వహిస్తామన్న ఈవో శీనా నాయక్  సెప్టెంబర్ 22  నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరుపుతున్నట్టు తెలిపారు. ఈ ఏడాది11 రోజుల పాటు విశేషం గా దసరా మహోత్సవాలు జరుగుతాయని తెలిపిన అధికారులు ప్రతి రోజు సాయంత్రం విజయవాడ నగరోత్సవాలు కూడా జరుగుతాయని చెప్పారు.

మూలా నక్షత్రం అంటే సెప్టెంబర్ 29 వ తేదీ సోమవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారనీ అక్టోబర్ 2 వ తేదీ గురువారం విజయదశమి రోజున ఉదయం మహా పూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుందనీ వివరించారు. సామాన్యులకు పెద్దపీట వేస్తూ అందరికీ దుర్గమ్మ దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటామన్న ఈవో ఈ ఏడాది దుర్గ గుడి ఉత్సవాల నిర్వహణ ను ప్రతిష్టాత్మకం గా తీసుకున్నట్టు చెప్పారు.

ఆలయ స్థానాచార్యులు  శివ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ.. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏడాది లానే విశేషంగా నిర్వహిస్తామని చెబుతూనే రోజు వారీ అమ్మవారి అలంకరణ లు గురించి వివరాలు అందజేశారు. దసరా పండుగ రోజుల్లో అమ్మవారి అలంకరణలు ఈ విధంగా ఉండనున్నాయి.

సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం 

23వ తేదీ  శ్రీ గాయత్రి దేవి అలకారం 

24వ తేదీ శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం 

25 వ తేదీ శ్రీ కాత్యాయిని దేవి అలంకారం 

26 వ తేదీ శ్రీ మహా లక్ష్మీ దేవి అలంకారం

27 వ తేదీ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం 

28 వ తేదీ శ్రీమహా చండీ దేవి అలంకారం 

29 తేదీ శ్రీ మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతి దేవి అలంకారం 

30 వ తేదీ శ్రీ దుర్గా దేవి అలంకారం 

1వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం 

2 వ తేదీ విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం

11 రోజులు 11 దివ్య అలంకారాల్లో దుర్గమ్మ  భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు