Vidur Niti in telugu: దృతరాష్ట్ర మ‌హారాజు సోదరుడు, కురు సామ్రాజ్య ప్రధాన మంత్రి విదురుడు. సునిశిత ఆలోచనా ధోరణి, దార్శనికత కలిగిన గొప్ప మేధావి. సరళమైన ప్రశాంత చిత్తం కలిగిన స్థిత ప్రజ్ఞ‌త కలిగిన రాజకీయవేత్త. కృష్ణ భగవానుడికి కూడా అత్యంత ప్రీతి పాత్రుడు. దృతరాష్ట్రుడు ముఖ్య విషయాలన్నింటికీ విదురుడిని సంప్రదించిన త‌ర్వాతే నిర్ణయాలు తీసుకునేవాడు. అలా వారిద్దరి మధ్య సాగిన సంభాషణలే విదుర నీతిగా ప్రాచుర్యం పొందాయి. అనేక జీవిత సత్యాలను విదురుడు దృతరాష్ట్రుడికి చెప్పినట్టుగా ప్రపంచానికి మార్గదర్శనం చేశాడు. అందులో భాగంగా జీవన విధానం, ధనం, కర్మ వంటి అనేకానేక విషయాల గురించిన వివరణలు ఇచ్చాడు. విదుర నీతిలో సంపాదన, సంపద సమీకరణతో పాటు ఎలాంటి వారి ద‌గ్గ‌ర ధ‌నానికి కొర‌త ఉండ‌దో వివ‌రించాడు. ఆ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.


డబ్బును సరిగ్గా ఉపయోగించండి: 
విదుర‌ నీతి ప్రకారం, డబ్బు సంపాదించడం కంటే డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం. అందుకే మీరు డబ్బు పొదుపు గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా, పెట్టుబడి పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆ తర్వాతే పెట్టుబడి పెట్టండి.


సత్య మార్గాన్ని అనుసరించండి: 
సరైన మార్గంలో సంపాదించిన డబ్బు మీకు కీర్తిని ఇస్తుంద‌ని, ఆర్థిక పురోగతికి మార్గం సుగమం చేస్తుందని విదుర నీతిలో పేర్కొన్నారు. అందుకే మనిషి ఎప్పుడూ సత్యమార్గంలో నడవాలి. కానీ త్వరగా డబ్బు సంపాదించాలనే తపనతో మనుషులు తప్పుడు మార్గంలో పయనిస్తారు. తప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు నాశనాన్ని కలిగిస్తుంది.


పొదుపు నేర్చుకోవాలి: 
సంపద సమకూరాలంటే మనస్సును అదుపులో ఉంచుకోవాలని విదుర‌ నీతిలో స్ప‌ష్టంచేశారు. ఎందుకంటే మనిషి మనసు చాలా చంచలమైనది. చేతికి డబ్బులు రాగానే ఖర్చు పెట్టేందుకు రకరకాల ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటాడు. ఆ ప్రణాళికలను పూర్తి చేసే ప్రక్రియలో డబ్బు వృధా అవుతుంది.


చెడు వ్యసనాల చ‌ట్రంలో చిక్కుకోవద్దు: 
ఒక వ్యక్తి ప్రతి పరిస్థితిలో ఓపికగా ఉండాలి. కాలం క‌లిసి రాక‌పోయినా సహనం కోల్పోయి తప్పుడు పనులు చేయకూడదని, ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు చెడు వ్యసనాల వలలో పడకూడదని విదుర నీతిలో సూచించారు. ఈ రెండు పరిస్థితుల్లోనూ ఓపికగా ఉండ‌క‌పోతే జీవితం నాశనం అవుతుంద‌ని హెచ్చ‌రించారు.


అనిర్వేదః శ్రీ మూలం లాభస్య చ శుభస్య చ ।
మహాన్ భవత్యనిర్విన్నః సుఖం చానన్త్యమశ్నుతే ।


పై శ్లోకం ప్రకారం, తన పనిని పూర్తి అంకితభావం, భక్తితో చేసే వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందాన్ని పొందుతాడు. అతని జీవితం ఎప్పుడూ సంపదతో నిండి ఉంటుంది. అంతే కాదు, అతనికి కీర్తి, గౌరవం కూడా లభిస్తాయి. పూర్తిస్థాయిలో పనిపై దృష్టి పెట్ట‌డం ద్వారా లక్ష్యానికి ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగవచ్చ‌ని విదుర నీతిలో పేర్కొన్నాడు.


సుఖార్థినః కుతో విద్యా నాస్తి విద్యార్థినః సుఖమ్ ॥
సుఖార్థీ వా త్యజేత్ విద్యాం విద్యార్థి వా త్యజేత్ సుఖమ్ ॥


ఆనందాన్ని కోరుకునే వ్యక్తికి, జ్ఞానాన్ని పొందడంలో కష్టాలు ఎదుర‌వుతాయ‌ని విదురుడు తెలిపాడు. జ్ఞానాన్ని పొందాలనుకునేవాడు ఆనందానికి విముఖంగా ఉంటాడు. కాబట్టి మీరు ఆనందాన్ని కోరుకుంటే, జ్ఞానాన్ని సంపాదించడం గురించి ఆలోచించాలి. అలా కాకుండా జ్ఞానం కావాలంటే మీరు జీవితంలో ఆనందాన్ని త్యాగం చేయాలి. జ్ఞానాన్ని సంపాదించడానికి కృషి, త్యాగం అవసరం. ఇప్పుడు చేసిన పరిత్యాగం ద్వారా మాత్రమే జ్ఞాని తరువాత కాలంలో సంపద, గౌరవాల‌ను పొందుతాడు.