కొంతమందికి వస్తువులు చెడిపోయినా, విరిగిపోయినా, పగిలిపోయినా పడేసేందుకు మనసొప్పదు. అలాగే వాడుతుంటారు. మరి కొందరు పగిలిన కప్పులు, గ్లాసుల వంటివి పడెయ్యకుండా ఉపయోగిస్తూనే ఉంటారు. ఇలా చెయ్యడం ఇంట్లోకి ప్రతికూలతలను ఆహ్వానిస్తుంది. ఈ ప్రతికూల ప్రభావం ఇంట్లో ప్రతి ఒక్కరి మీదా ఉంటుంది.
ఇంట్లో వస్తువులు అలంకరించేందుకు, అమర్చుకునేందుకు కూడా వాస్తు నియమాలు ఉంటాయి. ప్రతి వస్తువును ఒక నిర్ధుష్టమైన దిక్కున అమర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నియమాలను పాటించకపోయినా సరే ప్రతికూల ప్రభావాలు ఇంట్లో అందరి రోజువారి జీవితం మీద ప్రభావం చూపుతాయి.
ఇంట్లో వస్తువులు అమర్చే సమయంలో ముఖ్యంగా అద్దం పెట్టుకునే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే అద్దం ప్రభావం జీవితం మీద ప్రత్యక్షంగా ఉంటుందట.
చెడిపోయిన, విరిగిన, పగిలిన వస్తువులు ఏ దిక్కున పెట్టాలి?
వాస్తును అనుసరించి ఇంట్లో విరిగిన, పగిలిన, చెడిపోయిన పనికి రాని వస్తువులను ఉంచుకోవద్దు. విరిగిన లేదా పగిలిన పాత్రల్లో ఆహారం తీసుకోవడం లేదా వండడం వల్ల ఇంట్లో అనవసర సమస్యలు వస్తాయట. అంతే కాదు ఆర్థిక నష్టాలు పెరిగి అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంటుందని శాస్త్రం చెబుతోందని పండితులు వివరిస్తున్నారు. అందుకే ఇంట్లో పగిలిన లేదా విరిగిన పాత్రలను అసలు ఉపయోగించ కూడదు.
ఎలక్ట్రానిక్ వస్తువులు?
చెడిపోయిన గడియారాలు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను వీలైనంత త్వరగా బాగు చేయించి వాడుకోగలిగితే మంచిది. లేదంటే వాటిని పడెయ్యడం మంచిది. ఇలాంటి పనిచెయ్యని వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల జీవితంలో స్తబ్దత ఆవరిస్తుంది. అభివృద్ది కుంటుపడుతుందని శాస్త్రం వివరిస్తోంది.
ఫర్నిచర్
కొంత మంది విరిగిన మంచాలు, టేబుళ్లకు చెక్కలను జాయింట్ చేసి వాడుతుంటారు. ఇది కూడా ఇంట్లో ప్రతికూలతలకు కారణం అవుతుందట. ఇంట్లో అనారోగ్యాలు పెరిగి, ఖర్చులు అధికమవుతాయని వాస్తు వివరిస్తోంది. ఇలా పనికి రాని వస్తువులు వినియోగించడం మానేసి వాటిని తొలగించి వాటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవి తెచ్చుకోవడం తప్పనిసరి.
చిన్న పరిహారం
ఆర్థిక కష్టాలు వేధిస్తుంటే, అప్పుల బెడద ఎక్కువగా ఉండే వారు అష్టభుజి ఆకారంలో ఉన్న అద్దాన్ని ఇంట్లో ఉత్తరం దిక్కుగా అమర్చుకోవాలి. ఇది ఇంట్లోని ప్రతికూలతలను తొలగిస్తుంది. సంపద వృద్ధి అవుతుంది. చాలా శుభఫలితాలు కూడా కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.
ఇంట్లో చిన్నచిన్న మార్పులు, పరిహారాలతో జీవితంలో మంచి మార్పులు తీసుకు రావచ్చని పండితులు సూచిస్తున్నారు. ప్రతి సమస్యకు శాస్త్రంలో పరిష్కారం దొరుకుతుంది. కనుక అవి తెలుసుకుని పాటిస్తే కష్టాలను అలవోకగా దాటే అవకాశం ఏర్పడుతుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.