కొన్ని ధార్మిక విషయాలను కచ్చితంగా నియమానుసారమే చెయ్యాలి. తెలిసీ తెలియక చేసే పనుల వల్ల కష్టాలపాలయ్యే ప్రమాదం ఉంది. అందుకే వాస్తు శాస్త్రం అందరికీ అర్థమయ్యే విధంగా కొన్ని సూచనలు చేస్తోంది. వాటిని పాటించడం ద్వారా ఇంట్లో ఇబ్బందులన్నీ దూరమవుతాయి. జీవితం సాఫీగా సాగిపోతుంది. 


ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణం, అలంకరణ, పెంచుకునే మొక్కలు, పూజస్థానం వంటి అన్నింటికి సంబంధించిన వివరాలు తెలుసుకుని ఉండడం అవసరం. తులసి మనకు పూజనీయమైన మొక్క. ఈ మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. విష్ణు ఆరాధనలో తులసి దళాలకు ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది. అందుకే తులసి దామోదరుల కళ్యాణం కూడా చేస్తుంటారు.


తులసి బెరడుతో చేసిన పూసల దండను తులసి మాలగా భక్తిగా ధరిస్తారు. రుద్రాక్ష తర్వాత అంతటి పవిత్రత, ప్రత్యేకత ఈ తులసి మాలకు కూడా ఉంటుంది. హిందూ సంప్రదాయంలో తులసికి ఉన్న స్థానం చాలా విశిష్టమైంది. హిందువుల్లో ప్రతి ఒక్కరూ తులసిని ఆరాధిస్తారు. తులసి మొక్క లేని ఇల్లు దాదాపుగా ఉండదనే చెప్పొచ్చు.


హిందువుల్లో తులసి మొక్క చాలా ముఖ్యమైన పవిత్ర దైవిక మొక్క. తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయని నమ్ముతారు. తులసి మొక్క విషయంలో చాలా నియమాలు ఉంటాయి. వీటిని నిష్టగా ఆచరించాల్సిన అవసరం ఉంటుంది? వాస్తు తులసి మొక్క గురించి ఏం వివరిస్తుంది? అది మన జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? అంత పవిత్రమైన మొక్క ఇంట్లో ఏ దిక్కున ఉండాలో తెలుసుకుందాం. 


వాస్తు నిర్మాణం గురించి మాత్రమే కాదు, ఇంట్లోని ప్రతి వస్తువు అమరికను, మొక్కల అమరికను గురించి కూడా చర్చిస్తుంది. ఏ మొక్క ఇంట్లో ఎటువైపు ఉంటే మంచిదో వాస్తు నియమానుసారం చెయ్యడం మంచిది. ఇంట్లో తులసి మొక్కను నాటే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.


వాస్తును అనుసరించి ఇంట్లో తులసి మొక్క ఉత్తరం లేదా ఈశాన్యం లేదా తూర్పు దిక్కులలో పెట్టుకోవాలి. ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. నెగటివ్ ఎనర్జీని తరిమేస్తుంది. ఇంట్లో ఆర్థిక స్థితి కూడా మెరుగు పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి దక్షిణాన తులసి మొక్క నాటకూడదు. ఇలా చేస్తే నష్టపోవాల్సి రావచ్చు. అందుకే సరైన దిశ తెలుసుకుని మాత్రమే తులసిని నాటాలి.


తులసి ఉండ కూడని దిక్కున ఉంచితే అది మన జీవితం మీద ప్రతికూల ప్రభావాన్ని కలిగించవచ్చు. వాస్తు ప్రకారం ఈశాన్య దిక్కును సంపదకు మూలమైన కుబేర దిశగా పరిగణిస్తారు. ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు తప్పకుండా తులసిని ఈశాన్యంలోనే పెట్టాలి. ఒక వేళ తులసి మొక్క ఎండి పోతే కుండలో నుంచి తీసి ప్రవహించే నీటిలో వదలాలి. లేదా సమీపంలోని బావిలో వేయాలి. అది కుదరక పోతే గొయ్యి తీసి మట్టిలో పాతిపెట్టాలి. తులసి విషయంలో ఇలా కొన్ని నియమాలను తప్పకుండా పాటిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్ఝీ తప్పకుండా చేరుతుంది. ఇల్లు సమృద్ధిగా ఉంటుంది. 




Also Read: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?