విద్యార్థులందరికీ పరీక్షలు సమీపిస్తున్నాయి. పిల్లలందరూ పుస్తకాలు ముందు వేసుకుని తెగ చదివేస్తూ ఉంటారు. పిల్లలకు మంచి మార్కులు రావాలని చాలా మంది తల్లిదండ్రులు వారి మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తారు. కానీ కొంతమంది మాత్రం పిల్లలకు సహాయం చేస్తూ ఎగ్జామ్ టెన్షన్ నుంచి ఎలా బయట పడాలో తెలియజెప్పడానికి ట్రై చేస్తారు. బాగా చదవడం మాత్రమే కాదు పిల్లలు చదువుకునే గది వాస్తు ఎలా ఉందనేది కూడా ముఖ్యమే అని అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. పూజ గది, వంట గదికి వాస్తు ఉన్నట్టే పిల్లల స్టడీ రూమ్ కి కూడా వాస్తు ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే వాళ్ళ స్టడీ రూమ్ లో ఈ వాస్తు మార్పులు చేసి చూడండి.


గది దిశ ఏ విధంగా ఉంది?


విద్యార్థుల మీద వాస్తు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని అధ్యయనాల ప్రకారం ఇంట్లోని పశ్చిమ, నైరుతి మధ్య స్థలం జ్ఞానం ఇచ్చేదానిగా ఉంటుంది. అందుకే స్టడీ రూమ్ ఈ దిశలో ఉంటే మంచిది. దిశని కనిపెట్టడానికి ఇంటి మధ్యలో దిక్సూచి పట్టుకుని నిలబడి నైరుతి, పశ్చిమాన్ని గుర్తించాలి. అటు వైపు వాళ్ళు చదువుకోవడానికి గదిని కేటాయించాలి. అది సాధ్యం కాకపోతే ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉన్న గది కేటాయించవచ్చు.


స్టడీ టేబుల్ డైరెక్షన్


గదిలో చేయాల్సిన మరొక ముఖ్యమైన మార్పు చదవడానికి పిల్లలు కూర్చునే దిక్కు. పిల్లవాడు తూర్పు లేదా ఉత్తరం వైపు చూసే విధంగా స్టడీ టేబుల్ ని ఉంచాలి. ఇది పిల్లలు జ్ఞానాన్ని గ్రహించి, నిలుపుకోవడంలో సహాయపడుతుంది.


గదిలో వీటిని అసలు ఉంచొద్దు


మెరుగైన ఏకాగ్రత కోసం నైరుతి పశ్చిమం వైపు చీపురు, వాక్యూమ్ క్లీనర్, మాప్ లేదా ఎటువంటి క్లీనింగ్ వస్తువులు ఉంచకూడదు. స్టడీ రూమ్ దిశ మాత్రమే కాదు ఈ వస్తువులు కూడా చదువుకి భంగం కలిగిస్తాయని చెబుతున్నారు.


బొమ్మలు వద్దు


అదే విధంగా పశ్చిమ- నైరుతి ప్రాంతంలో బొమ్మలు, టెలివిజన్, గేమింగ్ స్టేషన్ ఉంచకూడదు. ఇది చదవకుండా చేస్తాయి. పరధ్యానంగా ఉంటారు. వీటికి బదులుగా స్టడీ టేబుల్ మీద గణేష్ విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది.


గోల్డెన్ పెన్ స్టాండ్


స్టడీ టేబుల్ మీద సాధారణ పెన్ స్టాండ్స్ చూస్తూనే ఉంటారు. కానీ పరీక్షల్లో విజయం సాధించాలంటే గోల్డెన్ పెన్ స్టాండ్ ఉండాలి. పరీక్షల సమయంలో విద్యార్థి తాను నేర్చుకున్న విషయాలను గుర్తు తెచ్చుకోవాలి. రీకాల్ సరిగా జరగాలంటే పశ్చిమం లేదా నైరుతిలో ఈ పెన్ స్టాండ్ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. కేవలం ఇలా చేస్తే పరీక్షల్లో పాస్ అవుతారని అనుకునేరు. అలా అసలు అనుకోవద్దు. మీరు ఎంత బాగా చదివితే అంత మంచి మార్కులు వస్తాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: అకస్మాత్తుగా గుండెపోటు రావడానికి ముందు కనిపించే ప్రధాన లక్షణాలివే - నిర్లక్ష్యం వద్దు!