Vastu Tips In Telugu​: వాస్తు ప్రకారం, కొన్ని మొక్కలు ఇంటిలోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. ఆ ఇంట్లో నివ‌సించే వారి జీవితాల్లో అదృష్టాన్ని తెస్తాయి. అలాంటి మొక్కలను ఇంట్లో ఉంచడం మంచిది, కానీ వాస్తు ప్రకారం అశుభం అని భావించే కొన్ని మొక్కలను  ప్రజలు ఇళ్లలో ఉంచుతారు. ఈ మొక్కలు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తెచ్చి, అవి పెరిగినప్పుడు దురదృష్టాన్ని కలిగిస్తాయి. అటువంటి 5 మొక్కల గురించి ఇక్కడ తెలుసుకుందాం, వాటిని ఇంట్లో పెంచ‌డం ద్వారా మీకు ఇబ్బందులు త‌లెత్త‌వ‌చ్చు. అందువ‌ల్ల‌ ఈ మొక్కలను ఇంట్లో పెంచ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాలి.


కాక్టస్


జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం, కాక్టస్ (బ్ర‌హ్మ‌జెముడు జాతి) మొక్కను ఇంట్లో ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, కాక్టస్ మొక్క ఇంట్లో ప్రతికూల శక్తిని తెస్తుంది. దాని ఆకులపై ఉన్న పదునైన ముళ్ళు ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయని నమ్ముతారు. కాక్టస్ మొక్క ఇంట్లో దురదృష్టాన్ని తెస్తుంది. ఇది కుటుంబంలో ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది.


Also Read : ఈ వస్తువులు బహుమతిగా ఇస్తే దురదృష్టాన్ని ఆహ్వానించినట్టే!


పత్తి మొక్క


ఇంట్లో పత్తి మొక్కను పెంచ‌డం వాస్తు శాస్త్రంలో అశుభం. పత్తి మొక్కను ఇంటి లోపల నాటడం దురదృష్టాన్ని తెస్తుంది. చాలా మంది తమ ఇంటిని అలంకరించుకోవడానికి పత్తి మొక్కలను ఇంట్లో ఉంచుతారు, కానీ అలా చేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, పత్తి మొక్కలు మీ పురోగతికి ఆటంకం కలిగిస్తాయి, మిమ్మల్ని ఇబ్బందుల్లో పడవేస్తాయి.


బోన్సాయ్ మొక్క


ఇంట్లో బోన్సాయ్ మొక్కలు నాటడం వాస్తు శాస్త్రంలో స్పష్టంగా నిషేధించారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ మొక్కలను ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి, మీ పురోగ‌తిని అడ్డుకుంటాయి. ఇది వారి కెరీర్ లేదా వ్యాపారంలో ఎదురుదెబ్బకు దారితీయవచ్చు. కాబట్టి, ఈ మొక్కను మీ ఇంటి లోపల ఉంచ‌కూడదు.


చింత మొక్క


చింత మొక్కలు ఇంటి లోపల ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి కాబట్టి వాటిని ఇంటి చుట్టూ లేదా లోపల నాటకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ మొక్కలు పర్యావరణంలో ప్రతికూలతను ఆకర్షిస్తాయి, ఇంట్లోని వ్య‌క్తుల‌ మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. దీంతో ఇంట్లో నిత్యం భయాందోళనలు నెలకొంటాయి. అందువల్ల, ఈ మొక్కను వెంటనే ఇంట్లో నుంచి తొలగించాలి.


Also Read : మీ ఇంట్లో ఈ చిన్న పొరపాటు చేస్తే అప్పుల భారం పెరుగుతుంది!


గోరింటాకు మొక్క


గోరింటాకు మొక్కలను ఇంట్లో పెట్టుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, దుష్టశక్తులు ఈ మొక్కలలో నివసిస్తాయి. ఈ మొక్కలను ఇంట్లో పెంచ‌డం వల్ల ఇంట్లో అసంతృప్తి వ్యాపిస్తుందని నమ్ముతారు. ఈ మొక్కల వాసన చాలా బలంగా ఉంటుంది, ఇది మానసిక ప్రశాంతతను, ఇంటి మొత్తం వాతావరణాన్ని పాడు చేస్తుంది. మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే, వీలైనంత త్వరగా వాటిని తొలగించండి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.