Kitchen Remedies : ఇంట్లో పూజ గది తర్వాత అంతే పవిత్రమైనదిగా పరిగణించేది వంటగది. ఎందుకంటే ఇక్కడ ఆహారానికి దేవతగా భావించే అన్నపూర్ణా దేవి నివసిస్తుందని చాలా మంది నమ్ముతారు. వంటగది అంటే మనం రోజువారీ భోజనాన్ని సిద్ధం చేసే ప్రదేశం. ఇది మన రోజువారీ పనులను పూర్తి చేయడానికీ, మనకి మౌలిక అవసరాల్లో ఒకటైన ఆకలిని తీర్చడానికీ, మనల్ని ఆరోగ్యంగానూ, ఫిట్‌గానూ ఉంచడానికి మూల కారకం. ఇన్ని ప్రాధాన్యతలున్న వంటగదిని నిర్మించేటప్పుడు వాస్తును కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. సరైన వాస్తుతో నిర్మించే వంటగదులు ప్రతికూల శక్తులను నివారిస్తుంది. సానుకూల వాతావరణంతో కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుంది. కాబట్టి వంటగది విషయంలో వాస్తు పరంగా గుర్తు పెట్టుకోవలసిన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వంటగది నిర్మాణం

వంటగది వాస్తు చిట్కాల ప్రకారం, ఈ గదిని ఉత్తరం, ఈశాన్య, నైరుతి దిశల్లో ఏర్పాటు చేయరాదు. బాత్రూమ్, వంటగదిని కూడా పక్క పక్కనే ఏర్పాటు చేయకూడదు. ఇది వాస్తు దోషంగా పరిగణిస్తారు. ఇక దీని ప్రవేశ ద్వారం పడమర లేదా ఉత్తరం దిశలో ఉండాలని వాస్తు చెబుతోంది. వంటగది ప్రవేశానికి ఇది అత్యంత పవిత్రమైన దిశగా పరిగణించబడుతుంది. ఒకవేళ, ఈ దిశలు అందుబాటులో లేనట్లయితే, ఆగ్నేయ దిశను కూడా ఉపయోగించవచ్చు.

గ్యాస్ స్టవ్, సింక్ :

  • వంటకు వెలిగించే మంట (స్టవ్) ఆగ్నేయ దిశలో ఉండాలి. గ్యాస్ స్టవ్‌ను వంట చేసేటప్పుడు తూర్పు వైపు ఉండే విధంగా ఉంచాలి. ఈ అగ్ని నుండి వచ్చే జ్వాలలు తూర్పు వైపుకు ఎదురుగా ఉంటాయి. ఇది మీ వంటగది లోపల శ్రేయస్సు, సానుకూలత అనుభూతిని పెంచుతుంది. దీంతో పాటు ఈ ప్రాంతానికి సమీపంలో గ్యాస్ సిలిండర్ లేదా ఏదైనా ఇంధన సరఫరా ఉండకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది మీ వంటగది స్థలంలో ప్రతికూల శక్తి పేరుకుపోవడానికి దారితీస్తుంది. 
  • కిచెన్ సింక్, స్టవ్ కోసం వాస్తు ప్రకారం సింక్‌ను ఉత్తరం లేదా ఈశాన్య మూలలో ఏర్పాటు చేయాలి. సింక్‌ను స్టవ్‌కి సమాంతరంగా లేదా ఒకే దిశలో పెట్టకూడదు. ఎందుకంటే వాస్తు ప్రకారం, అగ్ని, నీరు ఒకదానికొకటి వ్యతిరేకం. ఆ రెండింటినీ కలిపి ఉంచితే ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.

తాగు నీరు

తాగునీరు, పాత్రలకు సంబంధించిన ఉపకరణాలు కూడా వంటగది లోపలే పెట్టాలి. వంటగది వాస్తు చిట్కాల ప్రకారం, ఇంటి ఈశాన్య లేదా ఉత్తర మూలలో తాగునీటి వనరులను ఉంచాలని చెబుతారు. ఉత్తరం, ఈశాన్యం అందుబాటులో లేకపోతే వాటిని తూర్పు మూలలో కూడా ఉంచవచ్చు.

తలుపులు, కిటికీలు:

  • వంటగదిలో ప్రవేశానికి ఒక దిశ మాత్రమే ఉండాలి. ఒకదానికొకటి ఎదురుగా రెండు తలుపులు ఎప్పుడూ నిర్మించకూడదు. రెండు తలుపులు ఉంటే, ఉత్తరం లేదా పడమర వైపు ఉన్న ఒకటి తెరిచి ఉంచాలి. వ్యతిరేక దిశలలో ఉన్న రెండవ తలుపుని మూసివేయాలి. 
  • ఈ గదికి కిటికీ ఉండడం చాలా ముఖ్యం. ఇది ఎందుకంటే ఇది సానుకూల శక్తుల ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది. వంటగదిలో తగినంత వెంటిలేషన్ ఉండేలా చేస్తుంది. కిటికీలు వంటగదికి తూర్పు లేదా దక్షిణం వైపున ఉంచాలి. తద్వారా ఎండ, గాలి లోనికి సులభంగా ప్రవేశించగలవు.
  • వంటగదిలో రెండు కిటికీలు ఉంటే, క్రాస్ వెంటిలేషన్‌ను సులభతరం చేయడానికి పెద్దదానికి ఎదురుగా చిన్నది ఉండేలా చూసుకోవాలి. చిన్న కిటికీని దక్షిణం వైపు లేదా పెద్ద కిటికీకి ఎదురుగా నిర్మించడం సరైనది.

కిచెన్ స్లాబ్:

  • వంటగదిలో వాస్తు శాస్త్రం, స్లాబ్‌ను గ్రానైట్‌కు బదులుగా బ్లాక్ మార్బుల్ లేదా రాయితో తయారు చేసిన స్లాబ్ తో ఏర్పాటుచేసుకోవాలి. వంటగది స్లాబ్ రంగు కూడా వంటగది దిశపై ఆధారపడి ఉంటుంది. వంటగది తూర్పున ఉన్నట్లయితే, ఆకుపచ్చ లేదా గోధుమ రంగు స్లాబ్ ఉత్తమం. వంటగది ఈశాన్యంలో ఉంటే, పసుపు స్లాబ్ అనువైనది.
  • వంటగది దక్షిణం లేదా ఆగ్నేయ దిశలో ఉంటే, గోధుమ, మెరూన్ లేదా ఆకుపచ్చ స్లాబ్ వేయవచ్చు. పశ్చిమాన ఉంటే గ్రే లేదా పసుపు, ఉత్తర దిశలో ఉంటే ఆకుపచ్చ రంగులో ఉండాలి. కానీ ఉత్తరం వైపు వంటగదిని కలిగి ఉండకూడదని వాస్తు సూచిస్తోంది.

వంటింటి ఉపకరణాలు :

  • వంటగదిలో రిఫ్రిజిరేటర్‌ను వంటగదికి నైరుతి మూలలో గానీ లేదా వేరే ఏదైనా మూలలో గానీ ఉంచాలి. కానీ ఈశాన్య మూలలో దీన్ని ఎప్పుడూ ఉంచకూడదు.
  • వాస్తు ప్రకారం వంటగది ఏ సమయంలోనూ చిందరవందరగా ఉండకూడదు. కాబట్టి వంటగదికి దక్షిణ లేదా పశ్చిమ మూలల్లో క్యాబినెట్‌లో అన్ని పాత్రలనూ చక్కగా అమర్చండి.
  • వంటగదిలోని అన్ని ఎలక్ట్రిక్ ఉపకరణాలనూ ఆగ్నేయ మూలలో ఉంచాలి. ఈ ఉపకరణాలు పెట్టడానికి ఈశాన్య మూల పనికి రాదు. కాబట్టి ఆ మూల పెట్టకూడదు.

వంటగది రంగు:

  • వంటగదిలో వాస్తు ప్రకారం, ఎరుపు, లేత గులాబీ, నారింజ ఆకుపచ్చ వంటి రంగులను కూడా వంటగది రంగులుగా ఉపయోగించవచ్చు.
  • ముదురు రంగులను ఉపయోగించడం మానేయాలి. ఎందుకంటే అవి వంటగదినీ, అక్కడి వాతావరణాన్నీ నిస్తేజం చేస్తాయి.

Also Read : Horoscope Today 4th February 2025: ఈ రాశులవారు ఆస్తి కొనుగోలు, అమ్మకం ద్వారా ప్రయోజనం పొందుతారు!