Tirumala News: తిరుమల మాడవీధులు గోవింద నామస్మరణతో మారుమోగాయి. రథసప్తమి సందర్భంగా శ్రీనివాసుడు సప్తవాహనాల్లో భక్తులను అనుగ్రహించారు. సూర్యజయంతి సందర్భంగా సూర్యప్రభ వాహనంతో మొదలై చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఒకేరోజు అనుగ్రహించారు స్వామివారి. అందుకే ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు.

రథసప్తమి పర్వదినాన్ని క్రీ.శ 1564 నుంచి తిరుమలలో జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఏడు వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.
సూర్యప్రభ వాహనం
అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.48 గంటలకు శ్రీవారి పాదాలపై ప్రసరింపచేశాడు. ఈ వాహన సేవను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యప్రభ వాహనంలో ఉండే స్వామిని దర్శించుకుంటే సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి.
చిన్నశేషవాహనం
సూర్యప్రభ వాహనం తర్వాత ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్న శేషవాహనంపై శ్రీవారి చిద్విలాసాన్ని చూసి తరించారు భక్తులు. చిన్న శేషుడిని నాగలోకానికి రాజుగా భావిస్తారు. వైష్ణవ సంప్రదాయం అనుసరించి భగవంతుడు శేషి..ఈ ప్రపంచం శేషభూతం అని అర్థం. చిన్నశేష వాహనంపై శ్రీవారిని దర్శించుకుంటే కుటుంబ శ్రేయస్సు ఉంటుందని భక్తుల విశ్వాసం
గరుడవాహనం
రథ సప్తమి ఉత్సవాల్లో భాగంగా సూర్యప్రభ, చిన్న శేష వాహనం తర్వాత గరుడ వాహనంపై దర్శనమిచ్చారు మలయప్ప స్వామివారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు గరుడవాహనంపై శ్రీవారిని దర్శించుకున్నారు భక్తులు. జ్ఞానవైరాగ్యానికి రూపం అయిన రెక్కలతో విహరించే గరుడుడిపై కొలువైన మలయప్పస్వామిని దర్శించుకుంటే సకలపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం
Also Read: అనారోగ్యం దరిచేరనివ్వని ద్వాదశ ఆదిత్యుల ఆరాధన - ఎవరా 12 మంది ఆదిత్యులు!
హనుమంతవాహనం
రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా నాలుగో వాహనసేవ హనుమంత వాహనం. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకూ మలయప్పస్వామి హనుమంతవాహనంపై మాడవీధుల్లో విహరించారు. భక్తులలో అగ్రగణ్యుడు అయిన ఆంజనేయుడు చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధి. హనుమంతవాహనంపై విహరించే మలయప్పస్వామి దర్శనం సకల భయాలను రూపుమాపి, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది.
ఈ వాహన సేవల్లో EO శ్రీ జె శ్యామల రావు, అదనపు EO శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, JEO శ్రీ వి వీరబ్రహ్మం, పాలకమండలి సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీ జి.భానుప్రకాష్ రెడ్డి, ఇంఛార్జి CVSO శ్రీ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
రథసప్తమి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. శ్రీ వరాహస్వామివారి ఆలయం వద్ద ఉన్న స్వామిపుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అభిషేకం చేశారు.