బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ విషయంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరికీ మినహాయింపు లేదు. ప్రతి ఒక్కరూ మనశ్శాంతి, ఆనందం, సంపద కోరుకుంటారు. అందుకు అంతా సులభమైన పరిష్కారాలను వెతుకుతుంటారు. అలాంటి పరిష్కారాలు శాస్త్రంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది వెదురు మొక్క.


లక్కీ బేంబూ (Lucky Bamboo) నిజంగా లక్కీయేనా?


ఎలాంటి మొక్కలు ఇంట్లోనూ, ఆవరణలోనూ పెంచుకోవాలి? ఏ దిక్కున ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి? వంటి విషయాలన్నీ కూడా వాస్తు వివరిస్తుంది. అయితే లక్కీ మొక్కల్లో చిన్న వెదురు మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఇంట్లో అందంగా అలంకరించడానికి మాత్రమే కాదు, భాగ్యోదయానికి కూడా కారణం అవుతుంది. అందుకే ఇప్పుడు యువత కూడా చాలా మంది లక్కీ బేంబూ (Bamboo)ను నమ్ముతున్నారు. చాలామంది ఈ మొక్కను చూస్తున్నప్పుడు తమలో పాజిటివ్ ఫీలింగ్ వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ మొక్కను చూడటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.


కాస్త ప్రియమే


వెదురు మొక్క చిన్నగా కనిపించినా.. దాని ధర ఎక్కువగానే ఉంటుంది. దీని మొక్కలు నర్సరీల్లో 200 నుంచి 2000 రూపాయల ధర వరకు ఉంటాయి. చిన్న వెదురు మొక్కలు మాత్రమే కాదు, మూడు నుంచి నాలుగు అడుగుల పొడవైన మొక్కల వరకు అందుబాటులో ఉన్నాయి. మరింత అందంగా కనిపించేందుకు గాజు కుండిలో పెట్టుకుంటే మరింత బావుంటుంది.


జాగ్రత్తగా చూసుకోవాలి


ఈ వెదురు మొక్కను జాగ్రత్తగా కాపాడాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువ నీళ్లు అవసరం ఉండదు. నీళ్లు ఎక్కువైతే మొక్క కుళ్లిపోవచ్చు. వాతావరణాన్ని అనుసరించి దీని పోషణలో మార్పులు చేసుకోవాలి. అప్పుడప్పుడు ఎరువు కూడా వెయ్యల్సిన అవసరం ఉంటుంది. నేరుగా సూర్య కాంతి పడకుండా జాగ్రత్త పడాలి. మొక్కలో ఏదైనా భాగం ఎండిపోయినా, కుళ్లిపోయినా ఆ భాగాన్ని తొలగించాలి.


వెదురు మొక్కను పంచభూతాలకు ప్రతీకగా భావిస్తారు. ఇది ఇంట్లో ఉండడం వల్ల సమస్యలు తొలగి పోతాయని నమ్ముతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి అవసరమైన మార్గాలు సుగమం అవుతాయట. మొక్కలోని కాండాలన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడి పడి ఉంటాయి కనుక కుటుంబంలో ప్రేమాభిమానాలు నిలిచి ఉంటాయని, అనుబంధాలు బలపడతాయని నమ్మకం. అందుకే ఇది ఇంట్లో పెంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు.


Also read : ఫినిక్స్ బర్డ్ నిజంగానే ఉందా? ఆ పక్షి బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషం పోతుందా?


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial