జీవితం సాఫీగా సాగిపోవాలంటే.. ఎన్నో వాస్తు నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొత్త ఇంటిని నిర్మించే ఆలోచనలో ఉన్న వారు కొన్ని ప్రాథమిక వాస్తు నియమాలను తెలుసుకోవడం అవసరం. అలాంటి వాటిలో ముఖ్యమైనది నీటి ట్యాంకు. దీన్ని ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేయకూడదు. దీన్ని కచ్చితంగా ఒక దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మీరు ప్రశాంతంగా ఆ ఇంట్లో నివసించగలరు.
ఇంటి నిర్మాణం సమయంలో నీటి ట్యాంకులు ఎక్కడ ఉండాలి? ఎలాంటి ట్యాంకు నిర్మించాలనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. ఇందుకు వాస్తు శాస్త్రం చక్కని పరిష్కారాలను చూసించింది. వాటిలో కొన్నింటిని ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా ఇంటి నిర్మాణంలో రెండు రకాల వాటర్ ట్యాంకులు నిర్మిస్తుంటారు. ఒకటి భూగర్బంలో నిర్మించే సంప్. రెండోది పైకప్పు మీద ఉండే ఓవర్ హెడ్ ట్యాంక్.
భూగర్భంలో నిర్మించే సంప్
భూమి లోపల నిర్మించే సంప్‌ను ఈశాన్యంలో నిర్మించడం ఉత్తమం. తూర్ప, ఉత్తర గోడలకు తగలకుండా ఈ నిర్మాణం చెయ్యాలి. సంప్ నైరుతి, ఆగ్నేయాల్లో నిర్మించ కూడదు. అలా నిర్మిస్తే ఇంట్లో నిరంతరం ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడతారు. వాయవ్యంలో నిర్మిస్తే ఇంట్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. దక్షిణాన నిర్మిస్తే ఇంట్లో స్త్రీలు రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అదే పడమర దిక్కులో నిర్మిస్తే పురుషులకు రోగ బాధ తప్పదు. కనుక నీటి సంప్ ఎప్పుడూ ఈశాన్యంలో నిర్మించుకోవడం మంచిది. అది కుదరని పక్షంలో తూర్పున నిర్మించుకోవాలి.
పైకప్పు మీద నిర్మించే ఓవర్ హెడ్ ట్యాంక్
ఇంటి నిర్మాణంలో ఓవర్ హెడ్ ట్యాంక్ అన్నింటికంటే బరువైనది. కనుక వాటర్ ట్యాంకు సైజు, ఎంత మంది వినియోగిస్తారనే లెక్కల ప్రకారం నిర్మిస్తారు. వాస్తు ప్రకారం ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకోవడానికి ఇంటి పై కప్పు పైన నైరుతి మూల సరైన ప్రదేశం. ఇలా కుదరనపుడు పశ్చిమాన లేదా దక్షిణంలో పెట్టుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్యంలో దీన్ని ఉంచకూడదు.
ఓవర్ హెడ్ ట్యాంక్ పై కప్పు మీద ఈశాన్య దిక్కులో ఉంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. తూర్పున ఉంటే పురుషుల పని తీరు కుంటుపడుతుంది. ఇది సంపద నష్టానికి, నిరాశకు మూలమవుతుంది. అదే ఆగ్నేయంలో ఉంటే రోగ బాధ, చోరభయం ఉంటాయి. వాయవ్యంలో ఉంటే సంపద నష్టం జరుగుతుంది. ఉత్తరంలో ఉంటే మానసిక బాధలు పెరిగి స్త్రీలకు అనారోగ్యాలు కలుగవచ్చు. ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణంలో తప్పని సరిగా నాలుగు స్థంభాలు ఉండాలి. ఈ స్థంభాల మీద ట్యాంక్ అమర్చుకోవాలి.
బావి ఏ దిక్కులో ఉండాలి?
ఇంట్లో నీటి సదుపాయానికి తప్పనిసరిగా బావి లేదా బోర్వెల్ ఏర్పాటు చేసుకుంటారు ఎవరైనా. వీటిని సరిగ్గా తవ్వించుకుంటేనే గృహస్తులకు మేలు జరుగుతుంది. బావి ఎప్పుడూ తూర్పు వైపు లేదా ఈశాన్యంలో తవ్వించాలి. ఇలా కుదరనపుడు ఉత్తరం లేదా తూర్పున తవ్వించుకోవాలి. అవి కాకుండా ఇతర ఏ దిశల్లోనూ తవ్వించకూడదు. బావి ఆకారం ఎప్పుడూ చతురస్రం లేదా దీర్ఘ చతురస్రం లేదా వృత్తాకారంలో ఉండాలి. ఇంట్లో స్త్రీలు గర్భవతులుగా ఉన్న సమయంలో బావులు తవ్వించకూడదు. బావి ఉన్న ప్రదేశంలో కనీసం రోజులో 6 గంటల పాటు సూర్యకాంతి పడే విధంగా ఉండాలి. నీటిని తోడుకునేప్పుడు గిలక ఉత్తరం లేదా దక్షిణం వైపు ఉండాలి. ఆగ్నేయంలో బావి నిర్మాణం అశాంతి, కలహాలకు కారణమవుతుంది. దక్షిణ దిక్కున బావి ఉంటే ధననష్టం, అగ్నిప్రమాదం, చోర భయం ఉంటుంది. నైరుతిలో బావి ఉంటే అకాల మరణం, అనారోగ్యం, ఆత్మహత్యల భయం ఉంటుంది. ఇంటి మధ్యలో బావి ఉంటే అది చాలా ప్రమాదకరస్థితికి కారణం అవుతుంది.
Also Read: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?