Amit Shah TS Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 11వ తేదీన తెలంగాణ పర్యటనకు రానున్నారు. వచ్చే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్లాన్ ప్లాన్ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటనలు జరుపుతున్నారు. ఫిబ్రవరి నెలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన కూడా ఖరారు అయింది. ఈనెల 11వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానుండగా.. లోక్ సభ ప్రవాస్ యోజన కార్యక్రమానికి హాజరు కానున్నారు. హైదరాబాద్ లోని జాతీయ పోలీసు అకాడమీలో జరిగే పాసింగ్ అవుట్ పరేడ్ కు అమిత్ షా హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు.


మరోవైపు ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్లు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల్లో అమిత్ షా పర్యటన ఉండనుండగా... పార్లమెంట్ స్థానాలతో సంబంధం లేకుండా ఏదైనా ఒక కేంద్రంగా కార్యకర్తలతో అమిత్ షా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. సంస్థాగతంగా పార్టీ ఎంత మేరకు బలోపేతమైందనే విషయాలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. వాస్తవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టూర్ గత నెల 28, 29వ తేదీనే ఉండాల్సి ఉంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయన టూర్ వాయిదా వేసుకున్నారు. కాగా ఈనెల 11వ తేదీన ఆయన తెలంగాణ పర్యటన ఖరారు అయింది.