Maharashtra ATS On PFI:
యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చార్జ్‌షీట్..
మహారాష్ట్రలోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) పాపులర్ ఫ్రంట్ ఇండియా (PFI)కి చెందిన 5గురు నిందితులను గతేడాది సెప్టెంబర్‌లో అరెస్ట్ చేసింది. కేంద్రం ఆ సంస్థపై నిషేధం కూడా విధించింది. అయితే..ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ATS ఈ ఐదుగురిపై ఓ చార్జ్‌షీట్ తయారు చేసింది. ఇందులోని వివరాలన్నీ ABP News సంపాదించింది. ఇందులో అత్యంత సంచలనంగా మారిన విషయం ఒకటుంది. 2047 నాటికి ఇండియాను ఇస్లామిక్ కంట్రీగా మార్చాలని పీఎఫ్‌ఐ ప్లాన్ చేసినట్టు అందులో ప్రస్తావించారు. నిందితుల్లో ఒకరైన మజర్ మన్సూర్ ఖాన్‌ను విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2047 నాటికల్లా భారత్‌ను ముస్లిం దేశంగా మార్చేందుకు ఎలా ప్లాన్ చేయాలో మొత్తం రూట్ మ్యాప్‌ను సిద్దం చేసుకున్నట్టు చెప్పారు. మొత్తం 7 పేజీలున్న ఈ పీడీఎఫ్‌లో మరెన్నో సంచలన విషయాలున్నాయి. భారత్‌లో 70% మంది ముస్లింలే ఉన్నారంటూ విచారణలో నిందితులు చెప్పారు. 2047 నాటికి 100% మంది ముస్లింలే ఉంటారని...అప్పుడు ఇండియాను కూడా ఇస్లామిక్ దేశంగా ప్రకటించొచ్చని వాళ్లు వివరించినట్టు ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించారు.
విచారణలో ఏం చెప్పారంటే..?
1. ముస్లింల సంక్షేమం కోసం ఆలోచించే వాళ్లంతా PFIతో కలిసి పని చేయాలి. ముస్లింలకు భారత్‌లో ఎంత అన్యాయం జరుగుతోందో వివరించాలి. అవసరమైనప్పుడల్లా కత్తులు, రాడ్‌లతో దాడులు చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్లాన్ చేశారు.
2. హింసాత్మక ఘటనలతో అందరినీ భయభ్రాంతులకు గురి చేయాలి. క్రమంగా PFI బలాన్ని పెంచాలి. కఠినమైన శిక్షణ అందించాలి. RSS సహా మరి కొన్ని హిందూ సంస్థల మధ్య చిచ్చు పెట్టాలి.
3.ఎస్‌సీ, ఎస్‌టీల మద్దతు కూడగట్టుకునేందుకు ముస్లిం అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలి. ఆ గెలిచిన అభ్యర్థులు PFIని బలోపేతం చేసేందుకు సహకరించాలి. ఈ వెనకబడిన వర్గాల కోసం ముస్లింలందరూ కలిసి ప్రత్యేకంగా ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి అండగా నిలబడాలి.
4.ముస్లిం సంస్థలన్నీ ఒకే గొడుగు కిందకు రావాలి. ఈ సంస్థలకు విధేయంగా ఉన్న వారికే ఉన్నత పదవులు ఇవ్వాలి.
భారత్‌లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పీఎఫ్ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ల పాటు బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పీఎఫ్ఐ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నందుకే ఆ సంస్థపై ఈ నిషేధం విధిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో కారణంగా పేర్కొన్నారు. గత కొద్ది రోజుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థ కార్యాలయాలు సహా సభ్యుల ఇళ్లపై వరుస సోదాలు నిర్వహించింది. ఇప్పటికే ఎన్ఐఏ పలువురు పీఎఫ్ఐ లీడర్లను అరెస్టు కూడా చేసింది. దేశంలో మొత్తం 8 రాష్ట్రాల్లో PFI సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తులు, సంస్థ ఆఫీసుల్లో సోదాలు కొనసాగాయి.. యూపీ, మధ్యప్రదేశ్, కేరళ, పంజాబ్, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, అసోంలో ఈ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్ లో ఇంటలిజెన్స్ బ్యూరోతో పాటు సోదాలు జరిగిన రాష్ట్రాల పోలీసులు కూడా సాయం చేశారు.