Home Loan EMI Tips: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‍‌(RBI), తన రెపో రేటును మరో 0.25 శాతం పెంచింది. ప్రస్తుత క్యాలెండర్‌ సంవత్సరంలో (2023) ఇదే తొలి పెంపు అయినా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఇది వరుసగా ఆరో దఫా పెంపు. ఈ ఆర్థిక సంవత్సంలో, 2022 మే నెల నుంచి ఇప్పటి వరకు, రెపో రేటును 4 శాతం నుంచి 6.5 శాతానికి, అంటే 2.5 శాతానికి సెంట్రల్ బ్యాంక్ పెంచింది.


ఆర్‌బీఐ రెపో రేటు (RBI Repo Rate) పెరగడంతో, అన్ని బ్యాంకుల వడ్డీ రేట్లు ఇకపై పెరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నుంచి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వరకు గృహ రుణ రేట్లను పెంచుతాయి. ఆ ప్రభావం మీ హౌస్‌ లోన్‌ EMI మీద పడుతుంది. నెలనెలా మీరు చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తం పెరుగుతుంది.  


మీరు బ్యాంకుల నుంచి గృహ రుణం తీసుకుని నెలనెలా వాయిదాల (EMI) రూపంలో తిరిగి చెల్లిస్తుంటే, పెరిగిన రెపో రేటు ఒత్తిడిని తగ్గించుకుని వీలైనంత త్వరగా రుణం నుంచి విముక్తి పొందాలనుకుంటే, మీరు కొన్ని పద్ధతులను అనుసరించాలి. ఇది మీ ఆర్థిక పరిస్థితి మీద పడే ఒత్తిడిని తగ్గిస్తుంది, వడ్డీల బాదుడు నుంచి కాపాడుతుంది.


ఈఎంఐ భారం తగ్గిద్దామిలా..:  


పాత విధానంలో తక్కువ వడ్డీ రేటు చెల్లింపు  
బేస్ రేట్‌, MCLR (Marginal Cost of Funds Based Landing Rate) లేదా BPLR ‍‌( Benchmark Prime Lending Rate) వంటి పాత విధానంలో రుణ వడ్డీ పెరుగుదల రేటు నెమ్మదిగా ఉంది. ఈ పరిస్థితిలో, EBLR కింద, కొత్త రుణగ్రహీతల కంటే మీరు చాలా తక్కువ వడ్డీ రేటును చెల్లిస్తారు. దీంతో పోల్చి చూస్తే, పాత పద్ధతిలో EMI చెల్లింపును మీరు కొనసాగించవచ్చు.


కొత్త రుణంతో పోల్చండి          
మీరు పాత విధానంలో ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నట్లయితే, మీరు మీ రుణ వడ్డీని EBLR వడ్డీతో పోల్చాలి. మీ లోన్ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే మీరు దాన్నుంచి మారవచ్చు.  


ఇతర బ్యాంకులతోనూ పోల్చండి             
మీ హోమ్‌ లోన్‌ మీద మీ బ్యాంకర్‌ ఎక్కువ వడ్డీని వసూలు చేస్తున్నట్లయితే, మీ రుణాన్ని తక్కువ వడ్డీ వసూలు చేసే బ్యాంకుకు బదిలీ చేయవచ్చు.        


క్రెడిట్ స్కోర్ సాయం తీసుకోవచ్చు       
మీకు మంచి క్రెడిట్ స్కోర్‌ ఉన్నట్లయితే, రుణ కాల వ్యవధిని పొడిగించమని & EMIని తగ్గించమని బ్యాంకర్‌ను కోరే అవకాశం మీకు ఉంది. దీంతో పాటు, తక్కువ వడ్డీకి రుణం ఇవ్వాలని కూడా మీరు డిమాండ్ చేయవచ్చు.


పెట్టుబడి ఉపయోగించండి
 మీ హౌస్‌ లోన్‌కు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే, ఆ వడ్డీని EMIని తిరిగి చెల్లించడానికి ఉపయోగించవచ్చు.