ఇంట్లో ఏ దిశలో ఏ వస్తువులు ఉంచాలనేది వాస్తు శాస్త్రం వివరిస్తుంది. వాస్తులో దిక్కులు చాలా ముఖ్యమైనవి. ఇంట్లో ఏ దిక్కున ఎలాంటి వస్తువు పెట్టాలి. ఏ మూలన బరువైన వస్తువులు ఉండకూడదు, ఎటువైపు బరువు తప్పనిసరిగా ఉండాలి వంటి విషయాలన్నీ కూడా వాస్తు చక్కగా వివరించింది.
జీవితం అంటే కాలమే. కాలమంటే దైవమే. అటువంటి కాలాన్ని కొలమానంలో పెట్టి మనకు చూపించే పరికరం గడియారం. ఇది మనకు కాలపురుషుడి గమనాన్ని తెలియజేస్తుంది. అటువంటి పరికరం వాస్తును అనుసరించి ఇంట్లో ఏ దిక్కున అమర్చుకోవాలో తెలుసుకుందాం.
ఇంట్లో ఎప్పుడూ కూడా చెడిపోయిన లేదా ఆగిపోయిన గడియారం ఉంచకూడదని వాస్తు చెబుతోంది. అలా ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉండడం అశుభానికి ప్రతీకగా వాస్తు హెచ్చరిస్తోంది. చెడిపోయిన లేదా ఆగిపోయిన గడియారాలు ఇంట్లోకి నెగెటివిటిని ఆహ్వానిస్తాయట. అందువల్ల పగిలిపోయిన లేదా ఆగిపోయిన గడియారాలను ఇంట్లో పెట్టుకోకూడదు.
ఇటు వైపు అసలు వద్దు
దక్షిణ దిశను యమస్థానంగా పరిగణిస్తారు. అందుకే గడియారాన్ని ఎప్పుడూ ఇటు వైపుగా పెట్టకూడదు. అంతేకాదు ఇంటికి పడమర దిక్కున కూడా గడియారాన్ని పెట్టకూడదు.
ప్రధాన ద్వారం పైన వద్దు
వాస్తుప్రకారం ఇంటి ప్రధాన ద్వారంపై గడియారాన్ని ఉంచడం అసలు మంచిది కాదు. అక్కడ పెడితే.. ఇంట్లో ఎప్పుడూ గొడవలు అవుతుంటాయి. వాతావరణం ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడూ తెలియని ఒక టెన్షన్ ఉంటుంది. అందుకే ప్రధాన ద్వారం పైన ఉన్న గోడ దగ్గర గడియారం పెట్టకూడదు.
ఇక్కడ పెడితే మంచిది?
వాస్తు ప్రకారం గడియారాన్ని ఎప్పుడు ఉత్తరం లేదా తూర్పు దిశలో పెట్టుకోవాలి. ఈ దిశలో గడియారాన్ని ఉంచడం వల్ల ఇంటి వాతావరణం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. ఇంట్లో ప్రేమానురాగాలు వెల్లి విరుస్తాయి. బెడ్ రూమ్‌లో గోడ గడియారం పెట్టుకోకూడదు. ఇది నిద్రకు ఆటంకం మాత్రమే కాదు, పీడకలలు రావడానికి కూడా కారణం అవుతుంది.
అలంకరణ వస్తువులు, చిత్రాలు ఈ దిశలో పెట్టుకోవడం మంచిది
- ఈశాన్యానికి బృహస్పతి అధిపతి. అందువల్ల అటువైపు తప్పనిసరిగా దేవుడి ఫోటోలు పూజస్థానం ఉండేలా చూసుకోవాలి. అయితే దేవుడి విగ్రహాలు లేదా పటాలు తూర్పు అభిముఖంగా ఉండాలి.
- హింసను ప్రతిబింబించే చిత్రాలు ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి ఇంటిలోకి నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.
- చంద్రుడు వాయవ్యాధిపతి ఈ దిక్కులో వ్యర్థాలు పడెయ్య కూడదు. చీకటిగా కూడా ఉండకూడదు. ఇలా చేస్తే ఇంట్లోని స్త్రీలకు ఆరోగ్య సమస్యలు రావచ్చు.
- కాబట్టి ఇంట్లో వస్తువులను అమర్చేసమయంలో లేదా అలంకార వస్తువులు పెట్టుకునే సమయంలో వాస్తును అనుసరించి అవి ఇంట్లో ఉండవచ్చో లేదో ఒకవేళ ఉంటే ఎక్కడ, ఏదిశలో ఉండాలి వంటి అన్ని విషయాలను కూలంకశంగా తెలుసుకుని ఇంటికి ఇంటిరీయర్స్ చేయించుకుంటే.. ఇల్లు అందంగా ఉండడం మాత్రమే కాదు, ఎనర్జిటిక్ గా కూడా ఉంటుంది.
Also Read: నిత్యం తినే ఆహారంలో 5 రకాలైన దోషాలు, మీరు ఎలాంటి భోజనం చేస్తున్నారో తెలుసా!