వరలక్ష్మీ వ్రత కథ


( వ్రత కథ చెప్పుకోవడం కన్నా ముందుగా..గణపతి పూజ, వరలక్షీ వ్రతం ఆచరించాలి...ఆ లింక్స్ కింద ఉన్నాయి క్లిక్ చేస్తే పూజావిధానం వివరంగా ఉంటుంది)


వరలక్ష్మీ వ్రతం ప్రారంభంలో గణపతి పూజకోసం ఈ లింక్ క్లిక్ చేయండి


గణపతి ఆరాధన అనంతరం వరలక్ష్మీ పూజ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి....Part2



శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. ఆ కథే ఇది..


పరమేశ్వరుడు ఒకరోజు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి సహా దేవతలంతా పరమేశ్వరుడిని కీర్తిస్తు న్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి ... స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా సంతోషంగా ఉండేందుకు ఏ వ్రతం చేయాలో ఉపదేశించని అడిగింది.స్పందించిన ముక్కంటి..స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది.అది వరలక్ష్మీవ్రతం.దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం...పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలని చెప్పాడు. ఆ వ్రతాన్ని ఎవరు ఏ సందర్భంలో ఎలా చేశారు, దానివల్ల పొందిన ఫలితం ఎంటో వివరించాడు శివుడు..


Also Read: శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతానికి బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారు


పూర్వం మగథ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు గోడలతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు. రోజూ తెల్లవారుజామునే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి…ఇంట్లో పనులు పూర్తిచేసుకుని అత్తమామల్ని సేవిస్తూ ఉండేది. వరలక్ష్మీదేవి ఒకరోజు చారుమతికి కలలో కనిపించింది. ఓ చారుమతీ...ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి…శ్రావణ శుక్రవారం రోజున ఇరుగు పొరుగు ముత్తైవుదులను పిలిచి ఇంట్లోనే మండపం ఏర్పాటు చేసి అమ్మవారిని షోడశోపచారాలతో పూజించింది. భక్ష్య, భోజ్యాలను నివేదించింది. తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జెలు, రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు, మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వా భరణ భూషితులయ్యారట. వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతితో పాటూ ఆ వ్రతానికి వచ్చిన వారందరి ఇళ్లలో సకల భోగాలు వచ్చాయట. అప్పటి నుంచి వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సంతోషంగా ఉన్నారు. 


Also Read: ఆగష్టు 30 or 31 రక్షాబంధన్ ఎప్పుడు, రాఖీ పండుగ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు!


శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రతకథ విన్నా, చేసినా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు కలుగుతాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు తలపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలుకలుగుతాయి. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద ఎన్నో ఉన్నాయి. 


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు.‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.