Vamana Jayanti 2022: విష్ణుమూర్తి ధరించిన దశావతారాల్లో ఐదవ అవతారం,మొదటి మానవ అవతారం వామనుడు.
అదితి గర్భాన జన్మించిన వామనుడు
బలిచక్రవర్తి ప్లహ్లాదుని మనువడు. వైరోచనుని కుమారుడు. బలిచక్రవర్తి విశ్వజిత్ యాగము చేసి దానధర్మాలు చేసి అత్యంత శక్తివంతుడై ఇంద్రుడిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు. స్వర్గం మీదకు దండెత్తిన బలిని నిలువరించడం ఎవరి తరమూ కాలేదు. దేవతలంతా చెల్లాచెదురైపోయారు. తమను రక్షించమంటూ వెళ్లి ఆ విష్ణుమూర్తినే శరణువేడారు. అంతట విష్ణుమూర్తి తాను అదితి అనే రుషిపత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. అలా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి గర్భాన చిన్నారి విష్ణుమూర్తి జన్మించాడు. బలిని అణచివేసే రోజు కోసం ఎదురుచూడసాగాడు.
బలిని మూడు అడుగులు అడిగిన వామనుడు
బలి ఒకసారి అశ్వమేథయాగాన్ని తలపెట్టాడని తెలుస్తుంది. బలిని అణగదొక్కేందుకు ఇదే సరైన అదనుగా భావించిన విష్ణుమూర్తి ఓ చిన్నారి బ్రాహ్మణుడి (వామనుడు) రూపంలో యాగశాల వద్దకు వెళతాడు. బలిచక్రవర్తి ఆ వామనునికి సాదర స్వాగతం పలికి, సకల మర్యాదలు చేసి ఏం కావాలో కోరుకోమంటాడు. వామనుడు తనకు యాగం చేసుకోనేందుకు మూడు అడుగుల నేల కావాలని కోరతాడు. అందుకు బలిచక్రవర్తి సంతోషంగా అంగీకరిస్తాడు. దానం అడుగుతున్నవాడు...వామన రూపంలో ఉన్న రాక్షస విరోధి అయిన శ్రీమహావిష్ణువు అని అక్కడున్న రాక్షసుల గురువు శుక్రాచార్యుడు గ్రహిస్తాడు. అదే విషయం బలిని పిలిచి చెబుతాడు. కానీ అప్పటికే మాటిచ్చేశానని..ధన ప్రాణాలపై ఉన్న వ్యామోహంతో మాట వెనక్కు తీసుకోలేను అంటాడు. ఆగ్రహించిన శుక్రాచార్యుడు రాజ్యభ్రష్టుడవు అవుతావని బలిని శపించి వెళ్ళిపోతాడు.
Also Read: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం పొందుతారు!
ఏటా బలిచక్రవర్తి వస్తుంటాడు
ఆ తర్వాత బలి చక్రవర్తి వామనుని పాదాలు కడిగి ఆ నీటిని తల మీద చల్లుకుంటాడు. వామనుడు కోరిక మేరకు మూడు అడుగులు దానమిస్తున్నానని ప్రకటిస్తూ కలశంతో తన చేతి మీదగా వామనుని చేతిలోకి నీళ్ళు పోస్తుంటాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడతాడు. ఇది గ్రహించిన వామనుడు అక్కడున్న దర్భ పుల్లతో రంధ్రాన్ని పొడవగా శుక్రాచార్యుడు తన రెండు కళ్ళల్లో ఒక కన్నును కోల్పోతాడు. దానం స్వీకరించిన వామనుడు కొద్దికొద్దిగా పెరుగుతూ యావత్ బ్రహ్మాండమంత ఆక్రమించేస్తాడు. ఓ అడుగు భూమ్మీద, మరో అడుగు ఆకాశం మీద వేసి మూడో అడుగు ఎక్కడ వేయాలని అడుగుతాడు.
అప్పుడు బలి ‘నా తలపై వేయి’అని తలొంచుతాడు. వామనుడు తన మూడో పాదాన్ని బలి నెత్తి మీద వేసి అధ:పాతాళానికి తొక్కేస్తాడు. అయితే బలి దాన గుణానికి సంతోషించిన మహావిష్ణువు ఏటా అతను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేట్టు వరమిస్తాడు. ఇప్పటికీ కేరళలో ఓనం పండగను బలి రాక కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వామన జయంతి నాడు వైష్ణవ ఆలయాలకు వెళ్ళి విష్ణువుని పూజిస్తే శుభప్రదం.
మూడు అడుగులతో ఈ లోకాన్ని జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడు అని పేరు. ఆ త్రివిక్రముని పేరు మీద చాలా ఆలయాలున్నాయి. కంచిలో ఉన్న ‘ఉళగలంద పెరుమాళ్’ ఆలయం, ఖజరుహోలో ఉన్న ‘వామన’ ఆలయం వీటిలో ప్రముఖమైనవి. ఇవే కాకుండా ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ తదితర చోట్ల కూడా వామనుడి ఆలయాలు కనిపిస్తాయి.
Also Read: వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశకు ఏ రంగులు వేస్తే మంచిది!
వామనుడు కోరిన మూడు అడుగుల వెనుకున్న ఆంతర్యం
నేటి తరానికి అన్వయించి చూస్తే...వామనుడు కోరిన మూడు అడుగులు సత్వరజోతమోగుణాలనీ, సృష్టిస్థితిలయలనీ సూచిస్తాయని అంటారు. ఇక బలి తల మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణచివేయడమే. వామన జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని కొలిచిన వారు కూడా ఆ అహంకారాన్ని జయించి, ఈతి బాధల నుంచి విముక్తి పొందుతారని విశ్వాసం.