Gundla Brahmeswara Swamy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బండి ఆత్మకూరు మండల పరిధిలో నల్లమల అడవిలో ఉంది గుండ్ల బ్రహ్మేశ్వర క్షేత్రం. ఈ దేవాలయం ఏడాదికి రెండ రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే అటవీ అధికారుల అనుమతి తప్పనిసరి.
దట్టమైన అడవిలో ఉన్న గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయాన్ని కాకతీయ, విజయనగర రాజులు పునర్నిర్మించినట్టు శిలాశాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ పరమేశ్వరుడే బ్రహ్మేశ్వరుడి రూపంలో కొలువై ఉన్నాడు. మహాభారత కురుక్షేత్ర సంగ్రామం తర్వాత అశ్వత్థాముడు ( యుద్ధసమయం ముగిసిన తర్వాత ఉప పాండవులను చంపిన పాప ప్రక్షాళన కోసం) శ్రీకృష్ణుడి ఆదేశానుసారం గుండ్లకమ్మ నదితీరంలో శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణం. జన్మస్థానతీరాన శివలింగాన్ని ప్రతిష్టించాడని భక్తుల నమ్మకం. ఇక్కడ గుండ్లబ్రహ్మేశ్వరుడిగా కొలువైన శివయ్యతో పాటూ రాజరాజేశ్వరిదేవి, అశ్వత్థామ, వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, నవగ్రహాలను దర్శించుకోవచ్చు.
ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే సంవత్సరానికి రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. మహా శివరాత్రి సమయంలో రెండు రోజుల పాటు భక్తులకు ప్రవేశం ఉంటుంది. అప్పుడు కూడా అటవీ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే.
గుండ్ల బ్రహ్మేశ్వరస్వామి దేవాలయం సందర్శం కేవలం ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు ఇక్కడ ప్రకృతి మైమరపిస్తుంది. ఎన్నో వృక్షజాతులు, జంతువులు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో దాదాపు 353కి పైగా వృక్షజాతులు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. పులులు సంచరించే ప్రదేశం ఇది...ఇంకా మచ్చలపిల్లి, దుప్పులు ఇతర అటవీ జంతువులను చూడొచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 23 పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్న లెక్క.
ఆలయం సమీపంలో ఉన్న గుండ్లకమ్మ నది నంద్యాల, ప్రకాశం, పల్నాడు, బాపట్ల వరకూ ప్రవహిస్తుంది. ఈ నదిపై కందుల ఓబుళరెడ్డి గుండ్లకమ్మ జలాశయం ఏర్పాటు చేశారు. ఈ జలాశయంతో ప్రకాశం జిల్లా పరిధిలో ఎన్నో గ్రామాలకు తాగు, సాగునీరు అందుతోంది గుండ్ల బ్రహ్మేశ్వరస్వామి దేవాలయానికి ఎలా వెళ్లాలి?
ముందుగా నంద్యాల జిల్లా వెలుగోడు చేరుకోవాలి. అక్కడి నుంచి గట్టుతండా మీదుగా నేరుగా ఈ క్షేత్రానికి ట్రాక్టర్లు సహా వివిధ వాహనాలుంటాయి. గతంలో ఆర్టీసీ బస్సులతో పాటూ అన్ని వాహనాలు ఈ క్షేత్రానికి వెళ్లేవి. తెలుగుగంగ రిజర్వాయర్ నిర్మాణం, పులుల సంరక్షణ కేంద్రంగా ఈ క్షేత్రాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించడంతో రహదారిని మూసి వేశారు. ఏటా మహాశివరాత్రి సందర్భంగా అయినా అనుమతించాలన్న భక్తుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని ఏడాదికి 2 రోజులు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. ఇంకా నంద్యాల - వెలుగోడు - ఆత్మకూరు - సంతజూటూరు నుంచి పెద్దదేవలాపురం మీదుగా ఈ ఆలయానికి వెళ్లొచ్చు. ఇంకా నంద్యాల నుంచి గాజులపల్లె మీదుగా గిద్దలూరు దిగువమెట్టు నుంచి కూడా గుండ్లబ్రహ్మేశ్వరం చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి అయితే అన్ని రకాల వాహనాలు వెళతాయి. 42 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం 6 గంటలు బయలుదేరి వెళ్లి సాయంత్రం 6 లోపు వచ్చేయాల్సి ఉంటుంది. అప్పటివరకూ మాత్రమే అనుమతి.
ఒకప్పుడు కార్తీమాసం, మాఘమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో భక్తుల సందడి ఉండేది. కానీ ఇప్పుడు అటవీ అధికారులు అనుమతి నిరాకరించడంతో ఏడాదిలో రెండు రోజులే వెళ్లే అవకాశం వస్తోంది. నిత్యం భక్తులు సందర్శించుకునే ఏర్పాట్లు చేస్తే ఆలయం అభివృద్ధి చెందుతుందంటున్నారంతా. అయితే పులుల సంరక్షణ కేంద్రం కావడంతో ఏడాదికి రెండు రోజులే అనుమతి అని అటవీ అధికారులు స్పష్టంగా చెప్పేస్తున్నారు.