Sri Kshetra Dharmasthala Manjunatha Swamy Temple: కర్ణాటక రాష్ట్రం ధర్మస్థలలో ఉన్న శ్రీ మంజునాథ స్వామి దేవాలయం 800 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే దీనిని జైనులు నిర్వహిస్తారు, పూజలు మధ్వ వైష్ణవులు చేస్తారు.
దక్షిణ కర్ణాటకలోని బెల్తంగడిలో మల్లార్మడి అనే గ్రామంలో ఉన్న ఈ ప్రదేశాన్ని పురాణాల ప్రకారం కుడుమ అని పిలిచేవారు. ఇక్కడ నెల్లియడి బీడు అనే ఇంట్లో, జైన అధిపతి శ్రీ బిర్మన్న పెర్గాడే కుటుంబం నివసించేవారు. ఓ రోజు కొంతమంది సందర్శకులు వారి ఇంటికి వచ్చి, ధర్మాన్ని నిరంతరం ఆచరించడానికి ఒక ప్రత్యేక స్థలాన్ని అడిగారు. వారి అభ్యర్థన విని ఆశ్చర్యపోయిన ఆ జంట.. సందర్శకులను ప్రత్యేకంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేశారు. ఆ రోజు రాత్రి భగవంతుడు వారి కలలో కనిపించి ఈ ఇంటిని ధర్మపూజలకోసం అంకితం చేయాలని అడిగాడట. జైన దంపతులు ఆ కలను అనుసరించి తమ నివాసాన్ని ఇచ్చేసి మరోఇల్లు నిర్మించుకునేందుకు వెళ్లిపోయారు.
పూజలకు అంకితం చేసిన ఆ ఇంట్లో నివసించిన జైన దంపతులకు మరో బాధ్యత అప్పగించారు ధర్మ దేవతలు. శ్రీ కాళ రాహువు, శ్రీ కాలర్కాయి, శ్రీ కుమార స్వామి, శ్రీ కన్యా కుమారి లకు నాలుగు ప్రత్యేక మందిరాలను ప్రాంగణం లోపల నిర్మించాలని ఆదేశించారు. ఆ మందిరాల నిర్మాణం తర్వాత బ్రాహ్మణులను పూజలు చేసేందుకు ఆహ్వానించారు జైన దంపతులు. ఈ విగ్రహాలతో పాటూ ఓ శివలింగాన్ని కూడా ప్రతిష్టిస్తే పూజలు నిర్వహిస్తామని ఆ బ్రాహ్మణులు చెప్పారు. దీంతో మంగళూరు సమీపంలో కద్రి మంజునాథ స్వామి ఆలయం నుంచి ఓ శివలింగాన్ని తీసుకొచ్చేందుకు అన్నప్ప స్వామి అనే వ్యక్తిని నియమించారు. ధర్మస్థల ఆలయం మధ్యలో శివలింగాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయం నుంచి కిలోమీటరన్నద దూరంలో ఈ అన్నప్ప స్వామి మందిరం కూడా దర్శించుకోవచ్చు. గణేషుడి మందిరం కూడా ఉంటుంది ఇక్కడ. ఆ జైన కుటుంబ వారసుడిని వివాదాల పరిష్కారం కోసం ధర్మ అధికారిగా గౌరవిస్తారిక్కడ.
శ్రీ మంజునాథ స్వామి దర్శన సమయాలు
శ్రీ మంజునాథ స్వామి ఆలయం వేకువజామున 4 గంటలకు తెరుచుకుంటుంది.
శుద్ధి తర్వాత ఉదయం ఆరున్నర నుంచి 11 వరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
ఉదయం 11.30 గంటలకు శివుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత అన్నదానం ప్రారంభవుతుంది.
మధ్యాహ్నం 12 గంటలకు మాహాపూజ జరుగుతుంది. ఈ సమయంలో పూజారులు ఆలయ ప్రదక్షిణ చేస్తారు. ఈ సమయంలో దర్శనాలు నిలిపివేస్తారు.
ఈ ప్రదక్షిణలు పూర్తయ్యాక మళ్లీ 2 గంటల 15 నిముషాల వరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
సాయంత్రం 5 గంటలకు తిరిచి రాత్రి 8 గంటల 30 నిముషాల వరకూ దర్శనాలు కొనసాగుతాయి. 8.30 కి మహాపూజ జరుగుతుంది.
శ్రీ మంజునాథ స్వామి ప్రత్యేక రోజులు వినాయకచవితి రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు
నవరాత్రి సందర్భంగా అమ్మవారి ఆరాధన ఉంటుంది
కార్తీకమాసం,మహాశివరాత్రి సమయంలోనూ ఆలయం భక్తులతో నిండిపోతుంది
ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి ఇక్కడ
వార్షిక జాతర ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జరుగుతుంది
ధర్మస్థల ఎలా చేరుకోవాలి?
మంగళూరు వరకు వెళితే అక్కడి నుంచి బస్సులు లేదా టాక్సీల్లో ధర్మస్థల చేరుకోవచ్చు. ఇక్కడ వసతిని ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చు, అక్కడకు వెళ్లాక కూడా దొరుకుతాయి.
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన వివరాలు, పుస్తకాల్లో పొందుపరిచిన వివరాలు ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని పరిగణలోకి తీసకునేముందు సంబంధిత నిపుణుల సలహాలు స్వీకరించండి..