Amritsar Golden Golden Temple interesting Facts: పంజాబ్‌లోని అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. ఆయన సేవాదార్‌గా శిక్ష అనుభవిస్తుండగా ఈ ఘటన జరగడం కలకలంరేపింది. శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయ ప్రవేశద్వారం వద్ద కాపలాదారుగా ఉన్న సుఖ్‌బీర్ ని సమీపించిన ఓ వ్యక్తి కొన్ని అడుగుల దూరంనుంచి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సుఖ్ బీర్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు..నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నారైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. నారైన్ గతంలో ఓ ఇంటర్నేషనల్ ఉగ్రముఠాలో పనిచేసినట్టు సమాచారం.
Also Read: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుఖ్ బీర్ మతపరమైన తప్పిదాలు చేసినట్టు తేలడంతో స్వర్ణదేవాలయంలో పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని అకాల్ తఖ్త్ ఆదేశించింది. డిసెంబరు 03 మంగళవారం నుంచి సుఖ్ బీర్ సేవాదార్ గా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ సమయంలో కాల్పులు జరగడంతో స్వర్ణదేవాలయం గురించి చర్చ జరుగుతోంది. ఏంటి ఈ ప్రార్థనా మందిరం ప్రత్యేకత..ఇక్కడ శిక్షలెందుకు? అమృత్ సర్ స్వర్ణ దేవాలయం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే...
ఈ అమృత్‌సర్ స్వర్ణ దేవాలయాన్ని శ్రీ హర్మందిర్ సాహిబ్ అని పిలుస్తారు. దేశంలోనే అత్యంత అందమైన, ప్రశాంతమైన పవిత్ర ప్రదేశాల్లో ఇదొకటి. సిక్కులకు ప్రధాన గురుద్వార్ కూడా అమృత్ సర్ స్వర్ణ మందిరమే. ఈ ఆలయాన్ని కేవలం సిక్కులుమాత్రమే కాదు ఇతర మతస్తులు కూడా దర్శించుకుంటారు. నిత్యం భక్తులతో, పర్యాటకులతో సందడిగా ఉండే ఈ ప్రదేశంలో అడుగుపెట్టగానే మానసిక ప్రశాంతత లభిస్తుందంటారంతా.
మనదేశంలో అత్యధిక పర్యాటకులు సందర్శించే ప్రార్థనా స్థలాల్లో టాప్ లో ఉంటుంది అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమలేశుడి సన్నిధిలానే అమృత్ సర్ ప్రార్థనామందిరం కూడా నిత్యం భక్తులు, పర్యాటకులతో కళకళలాడుతుంది. ఈ మందిరానికి దేశం నలుమూలల నుంచే కాదు..విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు.
ఒకప్పుడు బుద్ధుడు ధ్యానం చేసిన ప్రదేశం ఇది అని అక్కడ రికార్డుల్లో ఉంది. ప్రస్తుతం గోల్డెన్ టెంపుల్ ఉన్న ప్రదేశం అప్పట్లో దట్టమైన అటవీప్రాంతం ఉండేది. అందుకే ఈ ప్రదేశాన్ని ధ్యానం కోసం ఎంపిక చేసుకున్నాడట బుద్ధుడు.
Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం
ఈ ప్రార్థనా మందిరానికి ఉన్న ప్రత్యేక ఆకర్షణ బంగారుతాపడం. మొత్తం 24 క్యారెట్ల బంగారు పూతను మందిరం చుట్టూ అద్దారు. అందుకే స్వర్ణ మందిరం అని పిలుస్తారు. మహారాజా రంజిత్ సింగ్ అనే వ్యక్తి తొలిసారి ఈ ఆలయానికి పసిపి పూత వేయాలనుకున్నాడు. అలా 162 కిలోల బంగారు పూతతో మొదలై..రాను రాను 90ల నాటికి 500 కిలోల బంగారుపూత వేశారు.
ఈ ఆలయంలో నిత్యం వేలమంది భక్తులకు అన్నదానం చేస్తారు. ఇక్కడ ఎవరైనా ఎంత గొప్పవారైనా నేలపై కూర్చునే భోజనం చేయాలి. ఎవరికీ ప్రత్యేక ఏర్పాట్లు ఉండలవు. భక్తులైనా, పర్యాటకులైనా , ఏ మతమైనా అందరూ ఇక్కడ సమానమే.
స్వర్ణకాంతులు మాత్రమే కాదు..మందిరంలో అణువణువు అద్భుతమే. హిందూ-మొఘల్ కలయిక శైలిలో నిర్మించిన ఆలయం గోపురం నుంచి కిటికీలు, గుమ్మాల వరకూ అన్నీ మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేలా ఉంటాయ్. ఇక్కడ ఆలయంలోకి వెళ్లేందుకు కనిపించే మెట్లమార్గం కిందకు ఉంటుంది. అంటే తమలో ఉండే అహంకారం, రాగద్వేషాలు వదులుకుని కిందకు దిగిరావాలని భగవంతుడి సందేశం
ఇక్కడ ఎంట్రీకి కుల, మతాలతో సంబంధం లేదు. ఆలయానికి నాలుగువైపులా ప్రవేశ ద్వారాలుంటాయి. అంటే అన్ని మతాలవారికి ఆహ్వానం పలుకుతున్నాం అని చెప్పడంలో ఆంతర్యం అది. దీని నిర్మాణ సమయంలోనూ గుర్ అర్జున్ దేవ్..సుఫీ సెయింట్ మియాన్ మీర్‌ను శంకుస్థాపనకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అప్పటి నుంచి అమృత్ సర్ స్వర్ణదేవాలయం అంటే అందరిది అనే భావన కలిగింది.
ఈ ప్రార్థనామందిరంలో సేవచేయాలనుకుంటే మీరు ఏ కులమైనా, ఏ మతమైనా కానీ ఎలాంటి అభ్యంతరం లేదు..కేవలం సిక్కులే అయి ఉండాల్సిన అవసరం లేదు. మతపరమైన తప్పిదాలు చేసేవారికి శిక్షలో భాగంగా ఇక్కడ సేవాకార్యక్రమాలు చేయిస్తారు. ప్రస్తుతం సుఖ్ బీర్ అనుభవిస్తున్న శిక్ష ఇదే.. భగవంతుడి సన్నిధిలో సేవచేయడమే...