Temples To Visit In Telangana On New Years Eve 2024: కొందరికి వేంకటేశ్వర స్వామి సెంటిమెంట్, మరికొందరికి శివుడు సెంటిమెంట్..ఇంకొందరికి అమ్మవారు సెంటిమెంట్. ఇలా ఎవరి సెంటిమెంట్స్ వాళ్లవి. వారి నమ్మకాలకు అనుగుణంగా న్యూ ఇయర్ రోజు ఆలయాలను సందర్శిస్తారు. తెలంగాణలో, హైదరాబాద్ లో..ముఖ్యంగా హైదరాబాద్ కు సమీపంలో ఉన్న కొన్ని ప్రముఖ ఆలయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..


యాదాద్రి
నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైన యాదగిరి గుట్ట హైదరాబాద్ కి 65 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలసిన నరసింహ స్వామికి ఘనమైన చరిత్ర ఉంది . ఋష్యశృంగుని కుమారుడు యాదవ మహర్షి తపస్సుకి మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవగా…తనకు తనకు నరసింహుని మూడు అంశలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట.అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాల నరసింహుడు,యోగానంద నరసింహుడు అనే రూపాలలో కనిపించాడట. ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటంతో కొండపై వెలిసారన్నది స్థలపురాణం. లక్ష్మీనారసింహ స్వామి అనుగ్రహం లభించాలని చాలామంది యాదాద్రి దర్శించుకుంటారు.


Also Read: ఆదిత్య మంగళ రాజయోగం, ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్స్!


చిలుకూరు బాలాజీ
కలియుగదైవమైన వేంకటేశ్వరస్వామి మూడుచోట్ల ప్రత్యక్షంగా వెలిసినట్టు ప్రతీతి. అందులో ఒకటి చిత్తూరు జిల్లా తిరుమల, రెండోది తూర్పుగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల కాగా, మూడోది తెలంగాణ ప్రాంతంలోని చిలుకూరులో అని పురాణాలు చెబుతున్నాయి.  తెలంగాణ తిరుమలగా పేరొందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల పైగా చరిత్ర ఉంది. దశాబ్ద కాలంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందింది. వీఐపీ దర్శనాలు, టిక్కెట్లు, హుండీలులేని దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ నగరానికి చేరువలో ఉస్మాన్‌సాగర్ ఒడ్డున దేవాలయం ఉండడంతో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది. మొదటిసారి దర్శించుకున్నప్పుడు 11 ప్రదక్షిణలు చేసి కోర్కెలు కోరుకోవటం, అది తీరాక వచ్చి 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకునే పద్ధతి ఇక్కడ కొనసాగుతోంది. 


బాసర సరస్వతీదేవి ఆలయం
సరస్వతీదేవి బ్రహ్మస్వరూపిణి. సర్వ విద్యలకూ అధిదేవత. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రెండు సరస్వతి దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి కాశ్మీరులో ఉండగా మరొకటి బాసరలోని సరస్వతి దేవాలయం. ప్రశాంతగోదావరి తీరంలో కొలువైన ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే అంతులేని జ్ఞానసంపద సొంతమవుతుందని భక్తుల విశ్వాసం. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో వేదవ్యాసుడు ప్రతిష్టించిన ఈ చదువుల తల్లి నిలయం అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత వేద వ్యాసుడు మనశ్శాంతి కోసం తన కుమారుడు శుకునితో దేశ సంచారం బయలు దేరాడు. అలా వెళుతున్న సమయంలో బాసరలో ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై తపస్సు చేయగా… జగన్మాత ప్రత్యక్షమై వరం కోరుకోమంది. అమ్మ దర్శనానికి మించిన వరమేముందని చెబుతాడు వ్యాసుడు. సంతోషించిన జగన్మాత…తమ ప్రతిరూపాలైన పార్వతి, లక్ష్మి, సరస్వతుల విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని చెబుతుంది. ఆ తర్వాత వ్యాసుడు… గోదావరి నుంచి మూడు గప్పెళ్ల ఇసుక తీసుకొచ్చి మూడు విగ్రహాలు తయారు చేశాడు. అప్పటి నుంచి ఆ క్షేత్రం వ్యాసపురి, వ్యాసర, అటుపై బాసరగా మార్పు చెందింది. ఈ విగ్రహాలపై ఉన్న పసుపును ప్రసాదంగా స్వీకరిస్తే అనంతమైన విజ్ఞానం లభిస్తుందని భక్తుల నమ్మకం. 


Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ తిరుగులేదంతే!


భద్రాద్రి రాముడి ఆలయం
తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం.  భద్రుడి తపస్సుకి మెచ్చిన శ్రీరాముడు …ఆయనకిచ్చిన వరం ప్రకారం సీతా, లక్షణ, ఆంజనేయ సమేతంగా భద్రగిరిపై కొలువుతీరాడు. భద్రాచలానికి కేవలం పురాణ ప్రాశస్తమే కాదు…ఘనమైన చరిత్రకూడా ఉంది. భద్రిరెడ్డిపాలెంకి చెందిన పోకల దమ్మక్క రామయ్యకు పరమ భక్తురాలు. ఆమె భక్తికి మెచ్చిన శ్రీరాముడు ఓసారి ఆమె కలలో కనిపించి తాను భద్రగిరిపై ఉన్నానని … మిగిలిన భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చేయాలని..ఈ కార్యక్రమంలో నీకు మరో పరమ భక్తుడు సాయంగా నిలుస్తాడని చెప్పాడు.  ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేసి అక్కడ పందిరినిర్మించింది. అనంతరం ఆ స్థలానికి వెళ్లిన రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న  బ్రహ్మండమైన ఆలయాన్ని నిర్మించాడు. ఏటా సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం ఇక్కడ కన్నులపండువగా జరుగుతుంది. కొత్త  ఏడాది సందర్భంగా రామయ్యను పూజిస్తే జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టాలు తొలగి సుఖశాంతులు నెలకొంటాయని భక్తుల విశ్వాసం


2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


రామప్ప ఆలయం
రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. హైదరాబాద్‌కి 200 కిలోమీటర్లు, వరంగల్‌కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రుద్రేశ్వరుడు అనే పేరుతో శివుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఈ గుడి శిల్ప సంపద విశిష్టమైనది. దీంతో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది యునెస్కో. కాకతీయులు క్రీస్తు శకం 1123–1323 మధ్య తెలుగు రాష్ట్రాల్లో సింహ భాగాన్ని పాలించారు. 1213లో ఈ గుడి నిర్మాణం ప్రారంభం అయింది. నిర్మాణానికి సుమారు 40 ఏళ్లు పట్టిందని చరిత్రకారుల అంచనా. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలంలో ఆయన సేనాని రేచర్ల రుద్రుడు ఈ గుడి కట్టించినట్టు శాసనాలు చెబుతున్నాయి.



2024 వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


పెద్దమ్మ గుడి
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆలయాలలో శ్రీ పెద్దమ్మ దేవాలయం ఒకటి. జూబ్లీహిల్స్ ప్రధాన రహదారి సమీపంలో ఆ దేవాలయం ఉంది. మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్నీ పీడించేవాడు. యజ్ఞయాగాదుల్ని నాశనం చేసేవాడు.త్రిమూర్తులు కూడా ఆ ధాటికి తట్టుకోలేకపోయారు. పాహిమాం అంటూ శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు.ఆ  రాక్షసుడి సంహారం అనంతరం అమ్మవారు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నారని చెబుతారు. పెద్దమ్మ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు. ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మే కడు పెద్దమ్మ. వేల సంవత్సరాల క్రితం జూబ్లీహిల్స్‌ ఆదిమతెగలకు ఆవాసంగా ఉండేదట. వారి కులదైవం పెద్దమ్మ. రెండున్నర దశాబ్దాల క్రితం వరకూ ఇక్కడో చిన్న ఆలయం మాత్రమే ఉండేది. కాంగ్రెస్‌ దివంగత నేత పి.జనార్దన్‌రెడ్డికి ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. 1993లో ప్రారంభమైన నిర్మాణం ఏడాదికల్లా పూర్తయింది. ఐదు అంతస్తుల ఎత్తులో గర్భగుడి, ఏడంతస్తుల్లో రాజగోపురం, గణపతి - లక్ష్మీ - సరస్వతి ఆలయాలు కొలువుతీరాయి.


బిర్లామందిర్
పాల నురుగులాంటి తెల్లని చలువ రాళ్లతో నిర్మితమై, అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడే ఆలయం బిర్లామందిర్. ఈ ప్రాంతాన్ని నౌబత్ పహడ్ అని పిలుస్తారు.తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని అత్యంత ముఖ్యమైన ప్రాంతంలో ఈ దేవాలయం ఒకటి. ఇది పూర్తిగా పాలరాతితో నిర్మితమైంది. నిత్యం వేలమంది పర్యాటకులు సందర్శించే ఈ ప్రాంతం న్యూ ఇయర్ వేళ మరింత కన్నులపండువగా ఉంటుంది. 


సంఘీ టెంపుల్
హైదరాబాదు నగరానికి సుమారు 35 కి.మీ దూరంలో ఉంది సంఘీ టెంపుల్. ఈ దేవాలయం  చాలా ఎత్తైన రాజ గోపురం ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి దర్శించుకోవచ్చు. అందమైన కొండల మద్య ఉండడం వల్ల ఈ దేవాలయం చాల ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి ఆలయంతో పాటూ చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి.


2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 


కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం
హైదరాబాద్ సమీపంలో ఉన్న ఈ ఆలయంలో ధ్యాన ఆంజనేయ స్వామి స్వయంభువుగా వెలసిన అతి ప్రాచీన దేవాలయం.  కాకతీయ ప్రభువైన రెండవ ప్రతాప రుద్రుడు నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. ఇక్కడి స్వామిని 40 పాటు ప్రదక్షిణలతో సేవిస్తే సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దర్శించటానికి విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారు. రాజీవ్ గాంధి విమానాశ్రయానికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది


2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


కీసరగుట్ట
శ్రీ రామచంద్రుడు రావణ సంహరణానంతరం అయోథ్యానగరానికి వెళుతూ మార్గమధ్యలో ఈ ప్రాంతంలో ఆగాడట. ఆ సమయంలో అక్కడ స్వయంగా రాముడు శివలింగం ప్రతిష్టించాడని..అందుకే రామలింగేశ్వర స్వామి అంటారని కథనం. ఆంజనేయుడు శివలింగాలను తీసుకొచ్చేలోగా అక్కడ ప్రతిష్ట జరగడంతో తాను తీసుకొచ్చి శివలింగాలను చెల్లాచెదురుగా విసిరేశాడు ఆంజనేయుడు. కేసరి తనయుడి చేష్టలను చిరునవ్వుతో ఆహ్వానించిన రాముడు.. తన కేసరి పేరుమీద ఈ క్షేత్రం వెలుగుతుందని వరమిచ్చాడు. అలా కీసరగుట్ట అయింది. 


2024 సింహ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


ఇంకా చెప్పుకుంటూ వెళితే కాళేశ్వరం ముక్తేశ్వరస్వామి, వరంగల్ భద్రకాళి, వేములవాడ రాజన్న, వేయి స్తంభాల గుడి, సంగమేశ్వరాలయం
కొండగట్టు దేవాలయం, ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం, పద్మాక్షి దేవాలయం, సలేశ్వరం లింగయ్య స్వామి దేవాలయం, అలంపూర్ జోగులాంబ దేవాలయం సహా తెలంగాణలో, హైదరాబాద్ లో చాలా పుణ్యక్షేత్రాలున్నాయి. కొత్త ఏడాది సందర్భంగా మీరు దర్శించుకునే ఆలయం ఏంటో ముందుగానే ప్లాన్ చేసుకోండి.


గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం