తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులకు వివిధ రూపాల్లో టీటీడీ స్వామి వారి దర్శనం కల్పిస్తుంది. అయితే సర్వదర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్టు, ఆర్జిత సేవల ద్వారా స్వామి వారిని భక్తులు దర్శించుకుంటారు. కరోనా మహమ్మారి విజృంభించ ముందు వరకు ఇలా ఉండేంది. కోవిడ్ తరువాత తిరుమలలో పరిస్థితులు మారిపోయాయి. పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. పరిమిత సంఖ్యలో ఆన్లైన్ లో విడుదల చేసిన ప్రత్యేక ప్రవేశ దర్శనం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల సిపార్సు లేఖలు, శ్రీవాణి ట్రస్టు, వర్చువల్ ఆర్జిత సేవ టిక్కెట్లు కలిగిన భక్తులను అనుమతిస్తోంది. కోవిడ్ మహమ్మారి కారణంగా సర్వదర్శనాన్ని టీటీడీ గత ఏడాది సెప్టెంబరు 25వ తేదీ నుంచి పూర్తిగా నిలిపి వేసింది. తిరుమలకు చేరుకుని అఖిలాండం వద్ద నుంచి స్వామి వారిని ప్రార్ధించాలనే ఉద్దేశంతో కొందరు భక్తులు తిరుపతికి చేరుకుంటున్నారు. ఇలా తిరుపతికి చేరుకున్న భక్తులు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద విజిలెన్స్ సిబ్బంది నిలిపి వేస్తుంది. అయితే టీటీడీ ఈవో, టీటీడీ ఛైర్మన్ కు ఫోన్ ద్వారా విన్నతి పత్రాల రూపంలో భారీగా సామాన్య భక్తులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆఫ్ లైన్ ద్వారా సర్వదర్శనాన్ని పునః ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇటీవల్ల టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కలిగేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్ లైన్ టికెట్లు...!
ఈ నెల 29వ తేదీన సామాన్య భక్తుల కోసం ఆన్లైన్ లో సర్వదర్శనం టోకెన్లను రోజుకు ఐదు వేల చొప్పున ఫిబ్రవరి 15వ తేదీ వరకూ జారీ చేయనుంది. కోవిడ్ వ్యాప్తి కారణంగా తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా సర్వ దర్శనం టోకెన్లు జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ నుంచి రద్దు చేసింది టీటీడీ. ప్రస్తుతం ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ అవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సామాన్య భక్తులకు అందడం లేదన్నది భక్తుల ఆవేదన. ఈ క్రమంలో సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుపతిలో ఆఫ్లైన్ విధానంలో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయాలని అనేకసార్లు భావించిన కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెప్తున్న కారణంగా ప్రస్తుతం ఆన్లైన్లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు రేపు ఉదయం 9 గంటలకు సర్వ దర్శనం టోకెన్ లను జారీ చేయనుంది టీటీడీ. అటు తర్వాత ఫిబ్రవరి 15వ తేదీ వరకు కోవిడ్ వ్యాప్తి పరిస్థితిని అంచనా వేసి సర్వదర్శనం టోకెన్లను సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్లైన్ విధానంలో జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రకటించారు. అయితే ఆఫ్ లైన్ ద్వారా అందిస్తున్న సర్వదర్శనం టోకెన్లు చిత్తూరు జిల్లా వాసులకే పరిమితం చేయాలా లేక ఏపీ ప్రజలకు మాత్రమే టికెట్లను పరిమితం చేయాలా అనే అంశంపై టీటీడీ చర్చించి నిర్ణయం తీసుకోనుంది.