Tirumala Brahmostavam 2022 :  శ్రీనివాసుడికి ఏడాదికొకసారి నిర్వహించే మహా ఉత్సవాలకు తిరుమల సిద్ధం అవుతోంది. రెండేళ్లు కరోనా ప్రభావంతో ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది ఆలయ మాఢ వీధుల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది టీటీడీ.  ఈ ఏడాది తిరుమలలో బ్రహ్మోత్సవ సందడే నెలకొననుంది. బ్రహ్మోత్సవాలలో ఏటా తొమ్మిది రోజుల పాటు తిరుమాడ వీధులలో 16 రకాల వాహనాలపై స్వామి వారు విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. తిరుమల క్షేత్రంలో జాతరను తలపించేలా, భక్తజనం తరలివచ్చే వైభోత్సవమే, శ్రీవారి బ్రహ్మోత్సవం. ఏడుకొండలపై వెలసిన శ్రీనివాసుని జన్మ నక్షత్రానికి ముగిసేలా సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే స్వామి వారికి నిర్వహించిన ఉత్సవమే బ్రహ్మోత్సవం.   


ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు


నిత్యం కళ్యాణం పచ్చతోరణంగా భాసిలుతున్న తిరుమల క్షేత్రంలో ప్రతి నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది.  వెంకటాద్రి పుణ్యక్షేత్రంలో ఏడాది పొడవునా ప్రతిరోజు పండుగే. ప్రతి రోజు పచ్చ తోరణాలే, ప్రతి పూట పిండి వంటలే, పరమాన్నాలే. అలంకార ప్రియుడు,నైవేద్య ప్రియుడు, అంత కంటే భక్తజన ప్రియుడైన శ్రీవారికి వైభవం అంతటిది.  భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం, తోమాలసేవ, అర్చన, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలు. ఏడాదికొకసారి తొమ్మిది రోజులు పాటు స్వామి వారికి నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తిరుమల చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. వేంకటాచల క్షేత్రంలో వెలసిన తొలి రోజులలో శ్రీనివాసుడు బ్రహ్మదేవుణ్ణి పిలిచి లోకకళ్యాణార్థం తనకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించమని ఆజ్ఞాపించాడట. శ్రీవారి ఆజ్ఞతో బ్రహ్మ దేవుడు, శ్రీవారి ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసంలోని శ్రవణా నక్షత్రం పూర్తి అయ్యేలా తొమ్మిది రోజులు పాటు వైభవంగా ఉత్సవాలను నిర్వహించారట. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే శ్రీవారికి నిర్వహించే ఉత్సవాలు కావడంతో ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొంది నేటి వరకు నిరాటంకంగా కొనసాగుతునే ఉన్నాయి. 


కోవిడ్ కార‌ణంగా రెండేళ్లపాటు ఆల‌యంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విష‌యం తెలిసిందే. ఈసారి మాఢ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు జ‌రగ‌నుండ‌డంతో విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉంద‌ని టీటీడీ అంచ‌నా వేస్తోంది. ఈ క్రమంలో భ‌క్తుల‌ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. 


వాహన సేవలు 



  • సెప్టెంబరు 20న ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం  

  • సెప్టెంబర్ 26న రాత్రి 7 నుంచి 8 గంట‌ల మ‌ధ్య అంకురార్పణ 

  • సెప్టెంబరు 27న మొద‌టి రోజు సాయంత్రం 5.15 నుంచి 6.15  గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం, రాత్రి 9 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు పెద్ద శేష వాహన సేవ

  • సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు హంస వాహన సేవ

  • సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు సింహ వాహనం, రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు ముత్యపు పందిరి వాహన సేవ

  • సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు కల్పవృక్ష వాహన సేవ, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు సర్వభూపాల వాహన సేవ

  • అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు మోహినీ అవతారం, రాత్రి 7 నుంచి  గరుడ వాహన సేవ 

  • అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు హనుమంత వాహన సేవ, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ర‌థ‌రంగ డోలోత్సవం(స్వర్ణ రథం), రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు గజ వాహన సేవ 

  • అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు సూర్యప్రభ వాహన సేవ, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చంద్రప్రభ వాహన సేవ

  • అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం), రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు అశ్వ వాహన సేవ 

  • అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ధ్వజావరోహణం