Hanuman Jayanthi 2025
వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే ||
వైశాఖ మాస బహుళ దశమి రోజు హనమాన్ జన్మ తిథి జరుపుకోవాలన్నదే ఈ శ్లోకం అర్థం
ఏటా వైశాఖ మాసం బహుళదశమి రోజు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే హనుమజ్జయంతి వేడుకలు ఈ ఏడాది మే 22 గురువారం వైభవంగా నిర్వహించనుంది టీటీడీ. శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి హనుమజ్జయంతి సందర్భంగా ప్రత్యేక పూజ జరగనుంది.
తిరుమల జాపాలి తీర్థంలో హనుమజ్జయంతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్బంగా టీటీడీ తరపున శ్రీ జపాలి హనుమాన్ కు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
మొదటి ఘాట్‌రోడ్డులో ఏడో మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి హనుమజ్జయంతి రోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను TTD నిర్వహిస్తుంది. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టీటీడీ భక్తులు, స్థానికుల సౌకర్యార్థం ఉచిత రవాణా సౌకర్యాన్ని తిరుమల నుంచి ఏడో మైలుకు, తిరిగి తిరుమల చేరడానికి కూడా కల్పిస్తున్నది.
భక్తికి, మనోధైర్యానికి, జ్ఞానానికి సంకేతంగా హనుమాన్ ని స్మరించుకుంటారు భక్తులు. ఆంజనేయుడు తన బలం కన్నా శ్రీరాముడిపై భక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. హనుమాన్ కి శ్రీ రామచంద్రుడంటే ఎంత భక్తి అంటే తనమనసునే మందిరంగా చేసుకుని ఆరాధించాడు. సీతాదేవి కన్నా మిన్నగా రాముడిని పూజించాడు. ఓసారి సీతాదేవి సింధూరం పెట్టుకోవడం చూసి ఎందుకు అని అడిగాడట. భర్త దీర్ఘాయుష్షు కోసం అని చెప్పిందట సీతమ్మ. వెంటనే ఆంజనేయుడు ఒళ్లంతా సింధూరం పూసుకున్నాడు. రామచంద్రుడంటే ఆంజనేయుడికి అంత భక్తి. ఓ సందర్భంలో సీతాదేవి ఇచ్చిన రత్నాలహారంలో పూసలన్నీ ఒక్కొక్కటి గా తీసి విసిరేశాడట. అది చూసి ఎందుకు హనుమా అలా చేస్తున్నావ్ అని అడిగితే వీటిలో తన స్వామి లేనప్పుడు రత్నాలు, స్వర్ణాలు ఎందుకు అని చెప్పాడట. సీతాదేవి జాడ తెలుసుకోవడం నుంచి తిరిగి రాముడు అయోధ్యకు చేరుకుని పట్టాభిషేకం జరిగేవరకూ వెన్నంటే ఉన్నాడు ఆంజనేయుడు. రామచంద్రుడికి నమ్మిన బంటు అయిన హనుమంతుడిని ఆరాధిస్తే ధైర్యం, బలం, ఆత్మస్థైర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.
Ramayana Jaya Mantram – రామాయణ జయ మంత్రం
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః |రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ||
దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః |హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||
న రావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ |శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః ||
అర్దయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీమ్ |సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
సరస్వతి పుష్కర స్నానానికి కాళేశ్వరం వెళుతున్నారా...ఆ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి
కాళేశ్వరంలో 12 ప్రత్యేకతలు.. సరస్వతి పుష్కరాలకు వెళ్లేవారు ఇవి మిస్సవకండి