కోటి విద్యలు కూటికొరకే, ధనం మూలం ఇదం జగత్.. ఇలా డబ్బు చుట్టూ రకరకాల నానుడులు ఉన్నాయి. అందరూ డబ్బు సంపాదన కోసమే ఆలోచిస్తారు. బాగా డబ్బు సంపాదించే వారిని లేదా డబ్బున్న వారిని అదృష్ట వంతులని అంటుంటారు. కొందరు కాస్త ప్రయత్నిస్తే చాలు ఆర్థిక విజయాలు అలవోకగా వచ్చి పడతాయి. కొంత మంది ఎంతో ప్రయత్నిస్తే కానీ డబ్బు సంపాదించలేరు. ఇలా జరగడానికి రకరకాల కారణాలుంటాయి. అందులో మనం పుట్టిన తేదిని బట్టి కూడా ఈ ఆర్థిక అదృష్టం ఆధారపడి ఉంటుందని న్యూమరాలజి చెబుతోంది. కొన్ని తేదీల్లో పుట్టినవారికి డబ్బు సంపాదించడం చాలా కష్టమవుతుందట. మరి ఆ తేదీలేమిటో, న్యూమరాలజిస్టులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.


నెంబర్ 2 (2, 11, 20, 29 తేదిల్లో పుట్టిన వారు)


పైన చెప్పిన తేదిల్లో పుట్టిన వారికి డబ్బు సంపాదించడం కొద్దిగా కష్టతరమవుతుంది. నిజానికి వీళ్లు డబ్బు సంపాదన మీద వీరి పూర్తి శక్తి సామర్థ్యాలు పెట్టరని చెప్పాలి. డబ్బు సంపాదన మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి చేస్తే తప్ప వీరిదగ్గర సంపద పోగవదు. ఆర్థికంగా ఏదైనా సాధించాలంటే ప్రత్యేకంగా శ్రమించాల్సి ఉంటుంది. వీరికి వారసత్వ సంపద కూడా పెద్దగా లభించదు.


నెంబర్ 4 (4, 13, 22, 31 తేదిల్లో పుట్టిన వారు)


వీరికి డబ్బు సంపాదించడం చాలా కష్టమైన పని. ఎంత పని చేసినా డబ్బు రావడం లేదనే నిరాశ ఆవహిస్తుంది చాలా సార్లు. కానీ విసుగు లేకుండా, అలసి పోకుండా ప్రయత్నించాల్సి ఉంటుంది. పాజిటివ్ గా ఆలోచించడం, నిరాశ పడడం, నెగెటివిటి దరిచేరనీయక పోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.


నెంబర్ 7 (7,16,25 తేదిల్లో పుట్టిన వారు)


ఈ నెంబర్ 7కు చెందిన వారు అయితే ఆగర్భ శ్రీమంతులుగా ఉంటారు. లేదా చాలా డబ్బు నష్టపోయే వారైనా అవుతారు. నిర్ధుష్టమైన లక్ష్యాలను పెట్టుకుని దాని కోసం శ్రమిస్తే తప్ప వీరికి సరైన ఫలితాలు కనిపించవు. ఏదైనా వృత్తి వ్యాపారాలు మొదలు పెట్టే ముందు పూర్తిస్థాయిలో అవగాహన పొంది ఆ తర్వాత ప్రారంభించాలనేది వీరికి ముఖ్యమైన సూచన. ఇలా జాగ్రత్తలు పాటించి అడుగు ముందుకు వెయ్యకపోతే నష్ట పోయే ప్రమాదం పొంచి ఉంటుందని పండితులు హెచ్చరిస్తున్నారు. 


నెంబర్ 3 (3,12,21,30 తేదిల్లో పుట్టినవారు)


ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత కానీ అదృష్టం వీరిని వరించదు. అర్థం చేసుకునే గుణం, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉండి ముందుకు సాగడం ద్వారా వీరు విజయం సాధించవచ్చు. వ్యక్తిగతంగా వీరికి ఉండే ప్రత్యేక నైపుణ్యాలే వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. కనుక వీరు వారి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూ ఉండడం అవసరం. 


 Also Read : Solar Eclipse 2024 : 54 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న సంపూర్ణ సూర్య గ్రహణం ప్రభావం ఏమిటో తెలుసా? మనకు వర్తిస్తుందా?


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.