Story Behind Vishnu Sahasranamam: ముఖ్యమైన బోధనలను రికార్డ్ చేసి రివైండ్ చేసి మళ్లీ మళ్లీ వింటుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఉన్న ప్రవచనాలు, ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ ఈ కోవకు చెందినవే. ఇప్పుడంటే కెమెరాలు, ఫోన్లు సహా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం  అందుబాటులోకి వచ్చింది. కానీ గడిచిన యుగాల్లో ఇది సాధ్యమయ్యే పనేనా? ఇలాంటి సాంకేతికత అప్పట్లో లేనప్పుడు అంపశయ్యపై ఉన్న భీష్ముడు చెప్పిన విషయాలన్నీ వ్రాతపూర్వకంగా మనకు అందుబాటులోకి ఎలా వచ్చాయ్? అదెలా సాధ్యమైంది?

 రాజధర్మం, రాజనీతి, పాలనా విధానం సహా ఎన్నో విషయాలను పాండవులకు బోధించాడు భీష్మపితామహుడు. అలా ఆయన అంపశయ్యపై ఉండి ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే విష్ణు సహస్రనామం చెప్పాడు. శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అని తెలిసిన వ్యక్తి భీష్ముడు. అందుకే తనవద్దకు వస్తున్న కృష్ణపరమాత్ముడిని చూసి ఆయన్ను వెయ్యి నామాలతో కీర్తించాడు. అవే విష్ణు సహస్రనామం.

ఈ వెయ్యి నామాలు శ్రీ మహావిష్ణువు మహిమలను వివరిస్తాయి. ఇవన్నీ ఆధ్యాత్మికత, ధ్యానం, భక్తి, అంతర్గత శాంతిని సూచిస్తాయి. నిత్యం విష్ణు సహస్రనామాలు పఠించినా, శ్రద్ధగా విన్నా ప్రశాంతత లభిస్తుంది. వెంటాడుతున్న ఎన్నో ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్‌తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చాలా ఇళ్లలో క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామం పారాయణం చేస్తారు..లేదంటే వింటారు. 

నిత్యపూజలో భాగమైపోయిన విష్ణుసహస్రనామాన్ని భీష్ముడు చెప్పినప్పుడు అక్కడ ఎవరూ రాసుకోలేదు. అంతా నిలబడి విన్నారంతే. మరి ఇది రాతపూర్వకంగా ఎలా అందుబాటులోకి వచ్చింది? మొదట దీన్ని రాసినవారెవరు? 

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు మహాపెరియవా కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి.

1940వ సంవత్సరంలో కంచి పరమాచార్యను ఇంటర్యూ చేసేందుకు ఓ వ్యక్టి టేప్ రికార్డర్ తో వచ్చాడట. అది చూసి స్వామివారు ప్రపంచంలో అతి పురాతనమైన టేప్ రికార్డర్ ఏదని అడిగారు?

ఆ ప్రశ్నకు సమాధానం ఎవ్వరికీ తెలియలేదు?

మళ్లీ స్వామివారు..విష్ణు సహస్రనామం మనకెలా వచ్చిందని అడిగారట?

భీష్మపితామహుడు అందించారని అన్నారొకరు

భీష్ముడు చెప్పినప్పుడు ఎవరు రాసుకున్నారని స్వామివారు అడిగారు?

ఎవ్వరి దగ్గరా సమాధానం లేదు...

అప్పుడు కంచి పరమాచార్య  ఇలా చెప్పారు.. భీష్ముడు సహస్రనామాలతో శ్రీ మహావిష్ణువును స్తుతిస్తున్నప్పుడు కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అంతా శ్రద్ధగా విన్నారు కానీ ఎవరూ రాసుకోలేదు. అంతా అయ్యాక అప్పుడు ధర్మరాజుకి సందేహం వచ్చింది.  ఈ వేయి నామాలు విన్నాం కానీ ఎవరం రాసుకోలేదు ఇప్పుడెలా కృష్ణా అని. అప్పుడు కృష్ణుడు..అది కేవలం సహదేవుడు, వ్యాసమహర్షి వల్లే సాధ్యమవుతుందని చెప్పాడు. అదెలా అని అడిగారంతా. అప్పుడు కృష్ణుడు సూత స్పటికం గురించి చెప్పాడు.

సూత స్పటికం అంటే?సూత స్పటికం అంటే మహేశ్వర స్వరూపం. వాతావరణంలో ఉండే శబ్ధ తరంగాలను గ్రహించి తనలో దాచుకుంటుంది. పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ధ్యానించి ప్రార్థిస్తే ఈ స్పటికంలో ఉండే శబ్ద తరంగాలను తిరిగి వినొచ్చు .

ఇక్కడున్నవారిలో సహదేవుడు ఒక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. అందుకే సహదేవుడు శివుడిని ప్రార్థిస్తే ఇప్పుడు విన్నదంతా తిరిగి వినే అవకాశం లభిస్తుంది...అప్పుడు వ్యాసమహర్షితో రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. అలా సూతస్పటికం సహాయంతో శబ్ద తరంగాలు రీప్లే అవుతుండగా వ్యాసమహర్షి రాసి..తర్వాత తరాలకు అందిచారు. 

ఈ విధంగా మొదటి టేప్ రికార్డర్ శివస్వరూప స్పటికం ద్వారా విష్ణుసహస్రనామం అందిందని చెప్పారు కంచి పరమాచార్య.