రామాయణంలో మానవులు,దేవుళ్ళు, వానరులు, రాక్షసులే కాదు. ఇంకా అనేక జాతుల ప్రాణులు కనిపిస్తాయి. వాటిలో కొన్ని ఇప్పుడు  ఉనికిలో కూడా లేవు. కానీ యుగాల క్రితం అలాంటి అద్భుత జీవులు  ఉండేవని వాల్మీకి తన కావ్యంలో రాశారు. అలాంటి వాటిలో ఒక జాతి  అతి భీకరమైన  గండబేరుండ పక్షులు. ఇవి పక్షరూపంలోనే ఉంటాయి కానీ  పరిమాణంలో చాలా పెద్దది. ఎంతలా అంటే  పెద్ద ఏనుగులను సైతం  తన్నుకుని గాలిలోకి ఎగిరిపోయేవి. అలాంటి పక్షి రాజుల్లో  ఇద్దరి అన్నదమ్ముల కథ రామాయణంలో చాలా ప్రముఖంగా ఉంటుంది. వాటిలో 'జటాయువు' గురించి అందరికీ తెలుసు గానీ  తన అన్న 'సంపాతి' గురించి  చాలా తక్కువ మంది విని ఉంటారు.  

Continues below advertisement

తమ్ముడి కోసం రెక్కలు కాల్చుకున్న  పక్షి రాజు 'సంపాతి '

పురాణాల ప్రకారం సూర్యుడి రథసారథంలో ఒకడైన 'అరుణుడి "  కి ఇద్దరు కొడుకులు.  అతి పెద్ద పక్షుల రూపంలో పుట్టిన  ఆ ఇద్దరిలో  పెద్దవాడు "సంపాతి", చిన్నవాడు "జటాయువు". చాలా శక్తివంతమైన ఆ ఇద్దరూ కావలసినప్పుడు మనుష్య రూపంలో తిరిగేవారు. యుగాల పాటు జీవించిన  ఆ ఇద్దరూ వయసులో ఉన్నప్పుడు  తమ తండ్రి నడిపే సూర్యుడి వేగంతో పోటీపడ్డారు. అంతేకాకుండా సూర్యుడ్ని చేరుకోవాలని  చాలా ఎత్తులకు ఎగిరారు. ఇంకా దగ్గరికి వెళ్ళొద్దని "సంపాతి" చెబుతున్నా వినకుండా 'జటాయు' సూర్యుడు దగ్గరికి వరకూ ఎగిరాడు.  అయితే సూర్యుడి వేడిని తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతున్న  "జటాయువు"ను చూచి రక్షణగా తన రెక్కలు చాపాడు సంపాతి. దానితో సూర్యుడి వేడికి సంపాతి రెండు రెక్కలూ కాలిపోయాయి.  ఎగరలేని స్థితిలో  "సంపాతి "' వింధ్య పర్వతంపై పడిపోయాడు. నిరాశ చెందిన 'సంపాతి '  ఆత్మహత్య చేసుకుందామని కొండ శిఖరం పైకి చేరుకోగా  అక్కడ ఒక ఆశ్రమంలో నివసిస్తున్న "నిశాకర" మహర్షి "సంపాతిని" గుర్తుపట్టి  భవిష్యత్తులో  రాముడు జన్మిస్తాడని  ఆయన భార్య సీతను వెతుక్కుంటూ  వానరులు  వస్తారని  వారికి ఆమె జాడను చెప్పిన తర్వాత  "సంపాతి " కి క్రొత్త రెక్కలు వస్తాయని తెలిపాడు. అప్పటినుంచి వానరుల కోసం ఎదురు చూస్తూ 8వేల సంవత్సరాలు పర్వతం పైనే బతికాడు 'సంపాతి'. తన కుమారుడు "సుపార్సువ్యుడు " ప్రతిరోజు తెచ్చి ఇచ్చే ఆహారంతో  సంపాతి జీవించేవాడు. 

Continues below advertisement

వానరులని తినేద్దామని వచ్చి.. సహాయం చేసిన "సంపాతి "   

వేల సంవత్సరాల తర్వాత  సీత జాడను వెతుక్కుంటూ  ఆ ప్రాంతాలకు వచ్చిన వానరులను కొండపై నుండి చూచి ఆహారంగా తినేద్దామనుకుంటూ  సంపాతి నడుచుకుంటూ గుహలోంచి బయటకు వచ్చాడు. అదే సమయంలో వానరులు  సీతను కాపాడడానికి జటాయు రావణుడి కి అడ్డు వెళ్లడం  తన రెక్కలను రావణుడు  కత్తితో నరకడం  వంటి విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు విన్న "సంపాతి " తమ్ముడి చావు గురించి విని చాలా బాధపడ్డాడు.  సంపాతిని చూసి భయపడుతున్న వానరులతో తన కథంతా చెప్పాడు "సంపాతి ".  రావణుడు  సీతను ఎత్తుకొని పోవడం తాను కూడా చూసానని చెబుతూ  రావణుడి వివరాలు, లంకకు వెళ్లే దారి గురించి  వానరులకు వివరించాడు సంపాతి. ఆ వెంటనే "సంపాతి " కి కొత్త రెక్కలు వచ్చేసాయి. దానితో సంతోషపడ్డ "సంపాతి " వానర యువరాజు "అంగదుడ్ని " తన రెక్కలపై ఎక్కించుకుని  ఆకాశంలోకి ఎగిరి  దూరంగా సముద్రంలో ఉన్న లంకను చూపించాడు. ఆ తర్వాతనే "ఆంజనేయుడు " లంకకు ఎగిది వెళ్లడం , సీతను కలవడం, లంకాదహనం గావించడం వంటి అద్భుత కార్యాలు జరిగాయి. అలా సీత జాడ తెలియడంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించాడు "సంపాతి "

'మిరాయ్ " సినిమా ద్వారా మరోసారి చర్చలోనికి "సంపాతి "  

లేటెస్ట్ గా రిలీజ్ అయిన  'మిరాయ్ " సినిమాలో  రామాయణ కాలం నాటి కొన్ని పాత్రల ప్రస్తావన ఉంది. వాటిలో 'సంపాతి 'కూడా ఒకటే. రామాయణం లో చాలా తక్కువ మందికి తెలిసిన 'సంపాతి' పాత్ర  ప్రస్తావన మరోసారి ఇలాగా  సినిమా రూపంలో తీసుకురావడం ఫై రామాయణ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామాయణ,భారతాలు, పురాణాల లో ఇలా ఎన్నో మరుగున పడ్డ  అద్భుత పాత్రలు ఉన్నాయని  అలాంటి వాటిపై మన దర్శక నిర్మాత రచయితలు దృష్టి పెడితే హాలీవుడ్ ను తలదన్నే కథలు  భారతీయ చలనచిత్ర రంగంపై  క్లాసిక్స్ గా మారతాయని  వారంటున్నారు.