ఉత్తరాఖండ్ లోని గర్వాల్ పరిధిలో ఉండే సురకందా దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన శక్తి పీఠాల్లో ఒకటి. భక్తుల మనసులో బలమైన ముద్రవేసే ఈ దేవి కొలువు తీరిన ఊరుపేరు ఉనియల్ గావ్. ఇది ధనౌల్తీ టౌన్ కి కూతవేటు దూరంలోనే ఉంటుంది.


చారిత్రాత్మక సురకందా దేవి ఆలయం చాలా మంది భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఏటా లక్షల మంది భక్తులు దేవి దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ కొలువైన దేవిని సురకందా దేవి. ఈమె పార్వతి దేవి స్వరూపం. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. సురకందా దేవి ఆలయం ఉన్న చోటు కేవలం ఆధ్యాత్మికులను మాత్రమే కాదు ఇక్కడి ప్రకృతి అందాలు, హిమాలయ శిఖరాలు పర్యాటకులను సైతం పెద్ద సంఖ్యలో ఆకట్టుకుంటాయి. ఈ ఆలయం సముద్ర మట్టానికి 2,757 అడుగుల ఎత్తులో ఉంటుంది. కనుక ట్రెకింగ్ వంటి సాహస యాత్రలు చేసే వారు కూడా ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశానికి సంబంధించిన కొన్ని విషేశాలను తెలుకుందాం.



  • సతి అగ్నిప్రవేశం తర్వాత ఆమె శరీరంలో కొంత భాగం సురకంద దేవి ప్రాంతంలో పడిపోయింది. కాబట్టి ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా రూపొందింది.

  • గర్వాలితో పాటు దక్షిణ భారత సంప్రదాయ కట్టడాల్లోని ఆర్కిటెక్చర్ ఇక్కడ సురకందా ఆలయ నిర్మాణంలో కనిపిస్తుంది. ఇక్కడి విగ్రహాలు, చెక్క శిల్పాలు ఆకట్టుకుంటాయి.

  • కద్దుఖల్ పట్టణం నుంచి 2.5 కిలోమీటర్ల పెద్దపెద్ద దేవదారు వృక్షాల అడవి గుండా ప్రయాణం చేసి సురకందా దేవి ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఆధ్యాత్మికులకైనా లేక సాహాసయాత్రికులకైనా ఈ మార్గం అద్భుతంగా అనిపిస్తుంది. చాలా మంది ఈ దారి వెంట కాలినడకన వస్తుంటారు. ఇదొక అద్భుత అనుభవంగా చెప్పుకుంటారు.

  • ఆలయ ప్రాంగణం నుంచి సమోన్నతంగా నిలిచి కనిపించే హిమాలయ శిఖరాలు చూడడం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే భద్రపూంచ్, కేదర్ నాథ్, గంగోత్రి శిఖరాలు సుస్పష్టంగా కనిపిస్తాయి. ప్రకృతి అన్వేషకులు ఈ ప్రదేశాన్ని తప్పకుండా సందర్శించాలి. ఇక్కడి సౌందర్యం మంత్రముగ్దులను చేస్తుంది.

  • ఉత్తరాఖండ్ లోని ఇతర ఆలయాలు చాలా వరకు చలికాలంలో మూసేస్తారు. కాని సురకందా దేవి ఆలయం మాత్రం సంవత్సరమంతా కూడా తెరచి ఉంటుంది. ఇక్కడికి ఏడాది పొడవునా ఎప్పుడైనా వెళ్లవచ్చు దేవి దర్శనం చేసుకోవచ్చు.

  • గంగా దశరా సమయంలో ఇక్కడి దేవికి మొక్కులు చెల్లించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ సమయంలో దేవిని ఆరాధించి మొక్కులు సమర్పించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం.


Also Read : నరసింహ స్వామిని ఆరాధిస్తే ఆ బాధలన్నీ తొలగిపోతాయా? ఆ అవతారం ప్రత్యేకతలేమిటీ?











Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.